సంగీత పాఠం

*
సరస్వతి విద్యార్ధులకు జంట స్వరాలు నేర్పుతోంది. ఇంతలో ఓ పెద్దాయన ఆమెని

కలిసి అడిగాడు ,

" మీరు నాకు తప్పకుండా సంగీతం నేర్పాలి .ఇంతవరకు నేర్చుకున్న చోట

ఆరేళ్ళైనా ఒక్క ముక్క నాకు అబ్బలేదు "

" ఎక్కడ నేర్చుకున్నారు ? "

" సామగానం సంగీత దగ్గర "

" అది ఒట్టి మూర్ఖురాలు .దాని పొట్ట కొస్తే అక్షరం ముక్క కనపడదు.అది పాడని

అపస్వరం లేదు.పాడిన సుస్వరం లేదు. ఇంతకీ ఏం చెప్పింది ? "

" మీ దగ్గరకు వెళ్ళమని చెప్పింది "

త్యాగమయి

*
నరమాంస భక్షకులు ఇద్దరు లొట్టలు వేసుకొంటూ భోజనం చేస్తున్నారు. అతిధిగా వచ్చినవాడు
తన మిత్రునితో ,

" నువ్వు చాలా అదృష్టవంతుడివి. వదిన వంట అద్భుతంగా వండుతుంది "

" నిజమే, కానీ తను ఇక లేదన్న విషయం గుర్తొస్తే నాకూ బాధగానే ఉంది " అన్నాడు
మిత్రుడు విస్తట్లోకి విచారంగా చూస్తూ .

ఈ పుస్తకం ఎంతో రుచి


*
తెలుగు వారి ఆహారచరిత్ర గురించి మీరు ఎప్పుడైనా,ఎక్కడైనా చదివారా ?

తరతరాల
తెలుగు వంటలు ఏమిటో ,అవి ఎలా చేయాలో, అవి

తినటం
వల్ల కలిగే లాభాలేమిటో మీకు తెలుసా ?

"తందూరి రోటి " తెలుగు వారిది ,నమ్మకం లేదా ? అయితే ,



మీరు
శ్రీ జి.వి.పూర్ణచంద్ గారి " తరతరాల తెలుగు రుచులు " చదవండి.
ఇంతకు
ముందు నేను రాసిన రెండు టపా లలోని తెలుగు వంటల విశేషాలు
దీని నుండే "చూచి రాత " రాసాను.

పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్ వారు ప్రచురించారు. విదేశాల్లోని వారు ఇక్కడ నుండీ
కొనుక్కోవచ్చు .మన వారు ఎమెస్కో బుక్స్.కాం ( emescobooks.com ) నుండీ పొందవచ్చు

చెప్పుకోండి చూద్దాం - సమాధానాలు

* అందుచేత ,అందువలన నేను అందరి పప్పులు ఉడికాయని భావించి సమాధానాలు
చెప్పేస్తున్నా .

.చాపట్లు = ఫింగర్ రోల్స్ = అట్టు లోపల కూర పెట్టి చాపలా చుట్టి,చిన్న ముక్కలు చేసి
నూనెలో వేయించే వంటకం


.గంగ నురుగులు = తెల్ల నువ్వులు/ + సగ్గుబియ్యం కలిపి వడియాలు

.నీరొత్తిగలు = పేపర్ దోశలు /ఫేణీలు


.బజ్జులు = కూరగాయల్ని కాల్చి చేసిన పచ్చళ్ళు


.సారసత్తులు = జంతికలు


.ఇంచిమంచి = కాకా పట్టటం , లంచం ఇవ్వటం


.దూది మడుగులు = పూత రేకుల్లా మడిచి వండిన పూరీలను పాల కోవా లో ముంచి
తీసిన వంటకం, మాల్పువా -బెంగాలీ పేరు


.క్కెర = చెక్కెర /బెల్లం చేర్చి నెయ్యిలో వేయించిన బియ్యపు పిండి వంటకం,
సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగా


.కరిజ = ఖజ్జికాయ


౧౦.నూటిడి = రుబ్బిన తెల్ల నువ్వుల పిండిలో లేత కొబ్బరి, దంచిన బెల్లం ,వేయించిన
శనగపప్పు పిండి కలిపి చేసిన వంటకం


పైవన్నీ (ఇంచిమంచి కాక ) మన బాగా పాత తరాల తెలుగువారు చేసుకొని , లొట్టలు
వేసుకుంటూ ఆరగించిన అచ్చ తెలుగు వంటకాలు .కొన్ని శ్రీనాధుల వారి కవిత్వం లో
మనకు కనిపిస్తాయి .

చెప్పుకోండి చూద్దాం

* కొన్ని తేట తెలుగు పదాలను ఇస్తున్నాను. అవి ఏమిటో, అర్ధాలేమిటో

చెప్పుకోండి చూద్దాం :

. చాపట్లు

. గంగ నురుగులు

. నీరోత్తిగలు

. బజ్జులు

.సారసత్తులు

.ఇంచిమంచి

.దూది మడుగులు

.ఉక్కెర

.కరిజ

౧౦. నూటిడి

ఎవరొస్తారు,ఎవరొస్తారు, ఎవరొస్తారో ......................................

అభియోగం

*
కోర్టు బోనులో తలవంచుకొని నిలబడిఉన్నాడు చిన్నారావు. జడ్జ్ గారు ప్రశ్నించారు,

"నువ్వు ,నీకు ఐదువేలు అప్పు ఇచ్చిన భీమారావు ని ఆరో అంతస్తు లోని నీ అపార్ట్మెంట్ రోడ్డు

వైపు కిటికీ గుండా కిందకి తోసేశావని నీమీద అభియోగం .నువ్వు చెప్పుకోనేదేమన్నా ఉందా? "

"కావాలని చెయ్యలేదు .అనుకోకుండా జరిగిపోయింది "

" అది సరి కాదు. అలా చేసేటప్పుడు కనీసం ఆలోచన ఉండద్దూ, అప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్లకి
ఎంత అపాయమో "

కలలో క్రికెట్

*
సన్యాసిరావు, మానసిక వైద్యుడు చిదానందం దగ్గర కి వచ్చి తన బాధ చెప్పుకొన్నాడు ,

"డాక్టర్ గారూ ! నాకు నెల రోజుల నుండీ రోజూ అడవి పందులు క్రికెట్ ఆడుతున్నట్లు
కలలోస్తున్నాయి. దీని నుంచీ బయట పడటం ఎలా ? " అని తల పట్టుకొన్నాడు .

చిదానందం టాబ్లెట్లు రాసిచ్చి రాత్రి భోజనం తరువాత వేసుకోమన్నాడు .

" ఈ టాబ్లెట్లు రేపటి నుంచీ వేసుకుంటాను " చెప్పాడు సన్యాసి రావు.

" ఈ రోజే మొదలు పెట్టచ్చు గదా ? "

" ఈ రాత్రి ఫైనల్ మ్యాచ్ ఉంది " నసిగాడు స. రావు

వీరభద్రం వచ్చాడు

*
ఊరు"మునిపల్లె. దానికి దక్షిణంలో అడవి. ఉత్తరంలో కొండలు. ఊర్లో ఉన్న చిన్న హోటల్
యజమాని భీమారావు ,కొత్తగా పనిలో చేరిన సీనయ్య తో చెబుతున్నాడు ,

"ఊరి వాళ్ళు మంచివాళ్ళు. ఇబ్బంది పెట్టరు. అయితే ఒకటే ఇబ్బంది .అడవిలో వీరభద్రం అనే
దుర్మార్గుడు ఉన్నాడు. వాడిది భయంకరాకారం.వాడికి నచ్చనివాడు బతికి ఉండడు.వాడు ఊళ్ళోకి
వస్తున్నాడంటే ,నువ్వు పారిపోయి కొండలలో దాక్కో.మర్చిపోకు "

సీనయ్య తల వూపాడు.

ఓ నెల గడిచింది. ఓ రోజు"వీరభద్రం వస్తున్నాడు, పారిపొండీ"అంటూ గొర్రెల కాపరి గోపాలం అరుస్తూ కొండ వైపు పరిగెత్తాడు.

సీనయ్య భయంతో వెంటనే పరుగులు తీసాడు.ఊరివాళ్ళు కంగారుగా ,భయంతో పరిగెడుతుంటే ,
వాళ్ళ కాళ్ళ మధ్య నలిగి ఓ పక్కగా హోటల్ గోడ వెనుక నక్కి వణుకుతున్నాడు.

కొద్ది సేపటికి ఓ భీకరాకారుడు పెద్ద పెద్ద అంగలతో హోటల్ వైపుకి వచ్చి ,సీనయ్య ని చూసి
"ఓ ప్లేటు ఇడ్లీ పట్టుకురా " అని అరిచాడు . అతి కష్టం మీద సీనయ్య వణుకుతున్న చేతులతో
వాడికి ఇడ్లీ అందించాడు. వాడిని మంచి చేసుకుందామని "మీకు ఇంకేమన్నా కావాలా "
అని భయంగానే అడిగాడు .

చింత నిప్పులలాంటి కళ్ళతో సీనయ్యని గుచ్చి చూస్తూ వాడు ,

"అంత సమయం లేదు .వీరభద్రం వస్తున్నాడు ,పారిపోవాలి " అంటూ డబ్బులిచ్చి వేగంగా
కదిలాడు .

బంగారు భూమి

*
బంగారుభూమి రియల్ ఎస్టేట్ ఆఫీసు ఏడో అంతస్తు లోని సీనియర్ మేనేజర్ సింగరాజు గదిలోకి
కంగారు పడుతూ వచ్చాడు కొత్త సేల్స్ మాన్ శీనుబాబు.

"సార్ ,మన గోవిందా వెంచర్ ఒకటి లో 57 నంబర్ ఫ్లాట్ కొన్న పార్టీ తను కట్టిన డిపోజిట్
తిరిగిమ్మని గొడవ చేస్తున్నాడు. వినలేని బూతులు తిడుతున్నాడు.డబ్బు తిరిగి ఇచ్చేయ్యనా ? "


" ఏంటి ప్రోబ్లం "

"మన ఫ్లాట్ లో చెరువు ఉందిట సార్ "

" నువ్వేం సేల్స్ మాన్ వయ్యా .పోయి అతనికి ఒక పడవైనా అమ్ము లేదా పక్క ఫ్లాట్ అయినా
అమ్ము .ఇప్పుడున్న దాన్ని స్విమ్మింగ్ పూల్ చేసుకునేట్లు వప్పించు "

లాయర్ సంపాదన

ఇద్దరు లాయర్లు కోర్టు క్యాంటిన్ లో టీ తాగుతూ మాట్లాడు కొంటున్నారు .

"రామూ ! నీ మొదటి సంపాదన ఎంత ? "

" ముష్టి ఐదువేలు ,మా సీనియర్ పార్టీ దగ్గర పాతిక వేలు నొక్కేసి ,నాకు ఐదు వేలు పడేసాడు .
మరి నీకురా చలపతీ ? "

" నేను నా మొదటి కేసు తో, నా మేనమామ దగ్గర చదువు కోసం తీసుకొన్న లక్ష బాకీ తీర్చేసాను "

" మొదటి కేసే గొప్పది కొట్టేసావు ,ఆ కేసు గురించి చెప్పరా "

" అప్పు తీర్చలేదని మామయ్య నా మీద కేసు వేసాడు ,దాంతో మొత్తం కట్టాల్సివచ్చింది "

కారెక్కు త్వరగా

*
కుమారస్వామి రెండు రోజులు ఫాం హౌస్ లో ఖుషీ చేసుకొని,నగరం దోవ పట్టాడు తన కారు లో. రోడ్డు ఎక్కే సరికి, అవతలి వైపు అరటి తోటల దగ్గర నుండీ ఓ కుర్రాడు చేతిలో అరటి పళ్ళతో పరిగెత్తుకొని వస్తున్నాడు. అతని వెనుక ఆరు కోతులు పరిగెడుతున్నాయి. అతను వేగంగా పరిగెడుతున్నాడు .అవి మరింత వేగంగా అతన్ని వెంబడిస్తున్నాయి

స్వామికి అతన్ని చూసి జాలేసి ,కారు పక్కన ఆపి డోర్ తెరిచి పట్టుకొని గట్టిగా పిలిచాడు ,

"బాబూ ! తొందరగా రా ,కారెక్కు త్వరగా "

కుర్రాడు రొప్పుతూ వచ్చి కుమారస్వామి చేయి పట్టుకొని పది సార్లు " నెనర్లు ,నెనర్లు " అన్నాడు .

ఆయన "ఈ పాటి సాయానికి అంతగా చెప్పాలా " అన్నాడు .

అప్పుడు కుర్రాడు వినయంగా పలికాడు ,

" అయ్యా ! మీరు కాబట్టి నాకు , నా ఆరు కోతులకు లిఫ్ట్ ఇస్తున్నారు .ఉదయం నుంచీ
ఎదురు చూస్తున్నాను.ఒక్క వెధవా లిఫ్ట్ ఇచ్చి చావలేదు "

భానుమతి బొలెరో

యస్.వి.రంగారావుగారు మోజుపడి మరీ బుకింగ్ చేసుకొన్నటాటా నానో,ఆరు నెలలకువారింటికి చేరింది.ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ఆజనేయ స్వామి కోవెల లో ముప్పై బొట్లు పెట్టి,మూడు కొబ్బరికాయలు కొట్టి పూజ చేయించి రోడ్డు ఎక్కారు డ్రైవ్ చేస్తూ .

అంతలో భానుమతి గారి బొలెరో, కొత్త కారుని పలకరించటానికి అన్నట్లు రాసుకుంటూ
ముందుకు దూసుకెళ్ళింది. రంగారావు గారు పిచ్చ కోపం తో ఊగిపోతూ స్పీడుగా కారుని పోనిచ్చి బొలెరో కి అడ్డంగా ఆపారు .భానుమతిని క్రిందకి దిగమని గర్జించి ,బొలెరో చుట్టూ తన కాలి చెప్పుతో వలయం చుట్టి ,"దీంట్లో నుండీ బయటకి అడుగు పెడితే ఉర్కోను " అని హెచ్చరించారు.

తన జేబు లోంచి నెయిల్ కట్టర్ తీసి ,కసిగా బొలెరో సీట్లు కోసేసి " నీ తప్పు కి చెల్లు కొట్టా చూసావా ? " అంటూ వికటంగా నవ్వారు భానుమతిని చూస్తూ .

"నేను నీ గీత దాటి నా కుడి కాలు నాలుగు సార్లు బయట పెట్టాను , నువ్వు చూడలేదుగా "
అంది నవ్వుతూ భానుమతి , ఆయన మాటల్ని కరివేపాకులా తీసేస్తూ


మీరు మంచి ప్రచురణకర్త కావాలనుకుంటున్నారా ?

ప్రచురణ రంగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే వారి కోసం నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా వారు,విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారితో కలిసి ఈ నెల 17 వ తేదీ నుండీ 29 వ తేదీ వరకు రెండు వారాలపాటు శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది .ఈ శిక్షణా తరగతులలో ఎడిటింగ్ ,ప్రొడక్షన్ ,మార్కెటింగ్ ,సేల్స్ ప్రమోషన్ ,ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ ,ఫైనాన్స్ మరియు కాపీ రైట్స్ మొదలైన విషయాలపై లోతైన అవగాహన,ఈ రంగం లో ప్రసిద్ధులైన వారిచే అందజేయబడుతుంది .ఆసక్తి కలవారు ఈ నెల 12 వ తేదీ లోగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆఫీసు లో 50 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి .కోర్స్ ఫీజు 1000 రూపాయలు.తరగతులు విజయవాడ లో నిర్వహించబడతాయి.

వివరాలకు సంప్రదించండి : 0866-2570843,2573354 /www.nbtindia.org.in