ఇడ్లీలమ్మి

*
అలివేలుది ఏ ఊరో తెలీదు .బెజవాడ దుర్గమ్మ పాదాలను నమ్ముకొని కాలవ వొడ్డున చెట్టు
క్రింద ఇడ్లీలు అమ్మటం మొదలు పెట్టింది,రెండేళ్ళ క్రితం. మొదలెట్టిన ఆరు నెలలకే "బాబాయ్
హోటల్ " కు దీటుగా ఉన్నాయని పేరొచ్చింది .


అలా మూడు చట్నీలు , ఆరు ఇడ్లీలు గా రోజులు గడుస్తుండగా , ఒక రోజు

కాలవలో ఇడ్లీ పాత్ర తోముతుండగా , దూరం నుండీ మొగుడు పెట్టిన పొలికేకకి ఆమె చేతిలోని
పాత్ర నీటిలోకి కొట్టుకు పోయింది .

అలివేలు మూడు పగళ్ళు ,మూడు రాత్రులు ఆపకుండా ఏడ్చి,ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది .

నదీ దేవత , ఆమె ఏడుపు చూడలేక ,ఓ ఇడ్లీ పాత్ర తో ప్రత్యక్షమయ్యింది.అది వెండిది .దాంతో
ఒక వాయ కి వంద ఇడ్లీలు వెయ్యచ్చు . అది చూసి అలివేలు నాది కాదు అంది .

నదీ తల్లి మళ్ళీ వెళ్లి ఈ సారి స్టీల్ పాత్ర తో వచ్చింది .దాంతో 50 ఇడ్లీలు వొకేసారి వండచ్చు.
అది కూడా తనది కాదు అంది అలివేలు .

మూడో సారి, పాతిక ఇడ్లీలు వండే సత్తు పాత్రతో ప్రత్యక్షమయ్యింది నదీ మా తల్లి .అది చూసి
ఆనందంగా ఇది నాదే అంది అలివేలు .

అలివేలు నిజాయతీ కి మెచ్చి , ఆమె పాత్ర, , దాంతో పాటు స్టీల్ , వెండి పాత్రలు బహుమతిగా
ఇచ్చి మాయమయ్యింది నదీ దేవత .

అలివేలు వెండి పాత్ర అమ్మేసి , కష్టమర్లకోసం బల్లలు , కుర్చీలు కొంది. స్టీల్ పాత్రలో ఇడ్లీలు
వండటం మొదలు పెట్టింది .

కొన్నాళ్ల తరువాత ,

ఓ అర్ధ రాత్రి అలివేలు మొగుడు తూలి నదిలో పడిపోయాడు. అలివేలు ఏడుపు చూడలేక
వెంటనే కనిపించింది నదీ దేవత , చేతులు కట్టుకొని వినయంగా నిలుచుని ఉన్న

హృతిక్ రోషన్ లాంటి ఓ కండల వీరుడితో .అడిగింది అలివేలుని ,

" ఇతనేనా నీ మొగుడు ? "

అలివేలు వెంటనే " అవును , అవును " అంది .

దేవతకి కోపం వచ్చింది ." నువ్వు అబధ్ధం చెబుతున్నావు .ఆనాటి నిజాయితి ఏమైయ్యింది ? "

" అమ్మా ! కోపం వద్దు . కొద్దిగా నా మాట విను.నా మొగుడు ఒట్టి చవట,తాగుబోతు.వాడి వల్లే
నేను ఇడ్లీలు అమ్ముకోవలసి వచ్చింది .వాడితో నాకు ఏ ఉపయోగం లేదు . నువ్వు చూపించిన
వాడితే నాకు పని లో సాయపడతాడని అలా చెప్పాను . అంతే కాక నా నిజాయతి కి మెచ్చి
ముగ్గురు మొగాళ్ళను నాకిస్తే , నా పేదరికానికి వాళ్ల నేలా పోషించనూ,దయ చూపమ్మా ! "

చివరి కోరిక

*
సుమ , మరణానికి చాలా దగ్గరగా ఉంది . అంత కంటే దగ్గరగా, ఆమెను అమితంగా ఇష్టపడే
భర్త కిషోర్ ఉన్నాడు ,మంచం పై తన వడిలో ఆమెను పెట్టుకొని ,

సుమ పూడుకుపోతున్న సన్నని గొంతు తో , భర్తతో ,

"మీరు నాకు మాట ఇవ్వండి .నేను పోయిన తరువాత నా స్నేహితురాలు కల్పన ని పెళ్లి
చేసుకుంటానని.చేతిలో చెయ్యేసి ఒట్టు వెయ్యండి "

" నేను ఇంకెవర్నీ పెళ్లి చేసుకోలేను "

" నా చివరి కోరిక తీర్చరా ? "

" సరే , ఇంతకీ కల్పననే ఎందుకు చేసుకోమంటున్నావు ? "

" అది నాకొచ్చిన కోటీశ్వరుడి సంబంధం చెడగొట్టింది "

బాధ

*
విశ్వనాథం , స్నేహితుడు కుమార్ ని అడిగాడు ,

" ఎందుకురా ఇంత బాధ పడుతున్నావు ? "

" మా ఆవిడ పుట్టింటి కెళ్ళింది "

" దానికి బాధ పడతారా ఎవరైనా ,వచ్చే దాకా మజా చేసుకో "

" అది కాదురా బాధ , వచ్చేటప్పుడు వాళ్ల అమ్మా , నాన్న లని కూడా మళ్ళీ తీసుకొస్తోంది "

ఫోన్ కాల్

*
" తెలుగు నాడి మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ లిమిటెడ్ " వారి రిసెప్షన్ లో,వచ్చే వందలాది
ఫోన్ కాల్స్ కు ఓపిగ్గా సమాధానాలు ఇస్తూ బాగా బిజీగా ఉంది కాళిక.

వచ్చిన కొద్ది ఖాళీ లో టీ తాగుతుండగా,

ఓ ఫోన్ మోగింది .కాళిక సౌమ్యం గా ఫోన్ తీసి హలో అంది .అవతలివైపు గొంతు కొంచం
ఆదుర్దాగా పలికింది


" అమ్మా ! రవీంద్ర ఎలా ఉన్నాడో కాస్త చెప్పగలరా ? "

" మీరు ముందుగా వారి రూం నెంబర్ చెప్పండి "

" రూం నంబర్ 113 "

" ఒక్క రెండు నిమిషాలు లైన్లో ఉండండి, కనుక్కొని చెబుతాను "

ఆ రూం లోని పేషెంట్ ని చూసే నర్స్ నుండీ వివరాలు తీసుకొని కాళిక ,

"ప్రస్తుతం రవీంద్ర గారు ఆరోగ్యం గానే ఉన్నారు ,వారి పరిస్థితి బాగుంది , రేపు వారిని
ఇంటికి పంపుతామని డాక్టర్ చెప్పారు "

" చాలా సంతోషమమ్మా ,ఉంటాను " ఫోను పెట్టబోయారు అవతలి మనిషి

కాళిక అడిగింది ఆసక్తిగా ,

" మీరు రవీంద్ర గారికి ఏమౌతారు ?, నాన్న గారా లేక తాత గారా ? "

" రవీంద్ర ని నేనేనమ్మా,నా ఆరోగ్యం గురించి ఏమడిగినా ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పి చావట్లేదు "

నిద్ర

*
అరుంధతికి బాగా చికాగ్గా ఉంది.రాత్రంతా కలత నిద్ర .అలసటగా , నిస్సత్తువగా ఉంది. కాఫీ
తాగుదామంటే పాలవాడు ఇంకా రాలేదు .బహుశా వాడి ఏరియాలో నీళ్ళ టాంక్ ఇంకా
వచ్చుండదు .

ఇంతలో పడగ్గది మంచం పైనుండీ ఓ అరుపు వినపడింది

" ఏమే ! కాఫీ ఇచ్చి చావు తొందరగా "

దాంతో అరుంధతికి తిక్క రేగింది , మొగుడిపై విరుచుకుపడింది,

" ఏం ఈ మధ్య విపరీతంగా తిట్టి పోస్తున్నారు ,నిన్న రాత్రి బండ నిద్ర పోతూ కలలో నన్ను
రాత్రంతా తిట్టి పోస్తునే ఉన్నారు ,నేనేం తప్పు చేసానో ఇప్పుడే తేలాలి "

భర్త , ఆమె వంక అయోమయం గా చూసి అడిగాడు,

" నిన్న రాత్రి ఎవరు నిద్ర పోయారు ? "

ఆలస్యం

*
లక్ష్మీపతి తనకు వెంటనే వంద ఏ .సీ . మెషిన్లు పంపవలసిందిగా , బ్లేజ్ కూలర్స్ వారికి
మెయిల్ పంపాడు .

కంపెనీ వారు , సరుకు పంపటానికి ముందు లక్ష్మీపతి పాత బాకీ కట్టాలని గమనించి

" మీరు పాత బాకీ కట్టిన వెంటనే సరుకు పంపగలము " అని తిరుగు మెయిల్ పంపారు

దానికి సమాధానం గా , లక్ష్మీపతి

" అంత ఆలస్యం భరించలేను,కాబట్టి నేనడిగిన సరుకు పంపవద్దు " అని మెసేజ్ పంపాడు

వ్యాక్యుం క్లీనర్

*
అప్పారావు కి దడగా ఉంది .నెలలో చివరివారం. ఎవరన్నా ఓ నాలుగు వ్యాక్యుం క్లీనర్లు కొంటే
చాలు .ఈ నెలకి బతికి పోతాడు .త్వరగా తయారై మార్కెటింగ్ కి బయలుదేరాడు .

భుజంగరావు కాలనీ లో , ఓ ఇంటి తలుపు తెరిచి కనబడింది .తలుపు మీద తట్టి ,
లోపలికి రావచ్చా అని అడిగాడు .సమాధానం వచ్చే లోపే లోపలికి దూసుకెళ్ళాడు

కనిపించిన ఇంటావిడ తో ,

"మేడం , నేను సూపర్ క్లీన్ వ్యాక్యుం క్లీనర్స్ నుండీ వచ్చాను .మీకు డెమో చూపిస్తాను "
అంటూ తన బ్యాగ్ నుండి నాలుగు సుద్దలు పేడ తీసి నేల మీద వేసాడు గట్టిగా .


"చూడండి మేడం , నేను చిన్న మరక కూడా లేకుండా ఈ పేడ క్లీన్ చేస్తాను , నా వ్యాక్యుం
క్లీనర్ తో .అలా చేయలేక పోతే , నేను ఈ పేడంతా తినేస్తాను " ధైర్యం గా చెప్పాడు

" నీకు పచ్చడేమైనా కావాలా ? " అడిగింది మేడం .

" పచ్చడి ఏమిటి మేడం ? "

" నంజుకోవటానికి "

" నంజుకోవటం దేనికి మేడం ,నాకు అర్ధం కావటం లేదు "

" ఎందుకంటే , మేము ఈ ఇల్లు కొత్తగా కట్టుకొని ,పొద్దున్నే గృహప్రవేశ మయ్యాం .
మాకింకా కరంట్ కనక్షన్ పెట్టలేదు "

పుచ్చకాయలు

*
ఈ ఏడాది సుబ్బయ్య పుచ్చకాయల తోట పిచ్చపిచ్చగా విరగ కాసింది .కానీ ఎంత జాగర్తగా
ఉన్నా రాత్రి పూట కాయల దొంగతనాలు ఎక్కువైయ్యాయి. కాళ్ళ గుర్తులు చూస్తే ,చిన్నపిల్లలే
దొంగలని తేలింది .

సుబ్బయ్య బాగా ఆలోచించి ,పొలంలో ఐదారు చోట్ల రంగు దీపాలు పెట్టి,వాటి కింద అట్ట మీద
హెచ్చరిక రాసి పెట్టాడు

" ఈ తోటలో ఒక పుచ్చకాయలో విషం ఎక్కించాము , జాగర్త "

"ఈ పనితో పిల్లల పని సరి " అని అనుకొని హాయిగా నిద్ర పోయాడు సుబ్బయ్య

కొత్త రోజు మొదలయ్యింది .సుబ్బయ్య రాత మారలేదు .మళ్ళీ కాయలు దొంగతనం జరిగింది
అంతే కాదు , అట్ట మీద ఈ హెచ్చరిక రాసి పెట్టి ఉంది,

" ఈ తోట లో రెండు పుచ్చకాయలు విషం తో నిండి ఉన్నాయి , జాగర్త "

తప్పిపోయిన కుక్క

*
భైరవమూర్తి తెల్లని బొచ్చు కుక్క పింకీ ని చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాడు .
మొన్న ఆదివారం ఇంటి సింహద్వారం , గేట్లు తెరిచి ఉండటంతో బయటకు వెళ్ళిపోయింది .

మూర్తి ప్రేమగా ఎంత పిలిచినా భౌ భౌ శబ్దం లేదు,తోక ఉపటం లేదు.

దాంతో కాఫీ కూడా తాగకుండా ఇల్లంతా వెతికాడు , ఇంటి చుట్టూ వెతికాడు ,పక్కిళ్ళు వెతికాడు.

కారేసుకొని రోడ్డున పడ్డాడు .కాలనీ లోని ఆరు లైన్లు తిరిగాడు .

రావు గారు కనిపిస్తే ఆగాడు ,అడిగాడు ,

" సార్ ! నా పింకీ కనిపించిందా మీకు ? "

" పింకీ ఎవరు ? "

" నా బొచ్చు కుక్కపిల్ల సార్ "

" నీ కారు వెనకాల ఇంతదాకా పరిగెత్తుకొని వచ్చింది అదే కాదా ? "

దయాగుణం

*
నాలుగేళ్ల హరి వాళ్ల నాన్నని అడిగాడు ముద్దుగా ,

" నాన్నా , నాకు ఓ పది రూపాయలు ఇవ్వవా "

"ఎందుకురా ? "

"మన సందు చివరి పార్క్ లో పాపం ఓ ముసలాయన ఉన్నాడు , ఆయనకి ఇద్దామని "

"మంచి ఆలోచన , నా పోలిక తో పుట్టావురా ,ఇంతకి ఆ ముసలాయన ఏం చేస్తుంటాడు ? "
అంటూపది రూపాయలు తీసి ఇచ్చాడు .

"ముసలాయన ఐస్ క్రీములు అమ్ముతాడు నాన్నా "అని పది రూపాయలతో పరిగెత్తాడు
హరి.

విడాకులు

*
కరుణాకర్ ,ఆనందరావు తో,

"ఇన్నాళ్ళకు కష్టపడి విడాకులు తీసుకోవటానికి వీలుగా పని మొదలు పెట్టానోయ్ "

" మంచి లాయర్ ని ఏర్పాటు చేసుకున్నావా ? "

" లేదు , పెళ్లి చేసుకున్నాను "

మామిడి తోట

*

మైనర్ బాబు మామిడి తోట లోకి , గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించారు రామదండు ,

గోపీ నాయకత్వం లో .




కొన్నికాయలు తెంపారు.కొన్ని పళ్ళు తిన్నారు . ఇంతలో తోటమాలి అంకినీడు అరుస్తూ వీళ్ళ

వెనుక పడ్డాడు . అందరూ పారిపోయారు, ఒక్క గోపీ దొరికిపోయాడు ,బండోడు కావటంతో

పరిగెత్తలేక .




అంకినీడు గోపీని గట్టిగా పట్టుకొని నిలదీశాడు ,




"పద మీ నాన్న దగ్గరకి వెళదాం .అక్కడ నీ సంగతి తేలుస్తా "


గోపీ వణుకుతూ "వద్దు, వద్దు " అని ఏడ్చాడు .




" పోనీ మీ ఇంటికి పద "




" వద్దూ , వద్దూ " మళ్ళీ పెద్దగా ఏడ్చాడు గోపీ .




"సరే , ఆ వెధవ ఏడుపు ఆపు , కనీసం మీ నాన్న ని దూరంగా అయినాC చూపించు "




గోపీ కొద్ది దూరం వెళ్లి చూపుడు వేలు పెట్టి దూరంగా చూపించాడు


ఆక్కడ ఓ పెద్దయిన , మామిడి పళ్ళు దొంగతనంగా తెంపుతూ కనిపించాడు ,

అచ్చం గోపి లాగే ఉన్నాడు

చిన్నారి బూట్లు

*
చిన్నారి అమృత U.KG.కి వచ్చింది .పాపం దిగులు గా ఉంది .ఈ రోజు నుండీ స్కూల్ కి వెళ్ళాలి.
టైమైయ్యింది .ఆటో వాడు వచ్చేస్తాడు .చక చకా బూట్లు కాలికి తొడుక్కోవటానికి ట్రై చేస్తోంది .కాని
అవి పట్టట్లేదు .అమ్మ లోపల పనిలో ఉంది .

ఇదంతా గమనిస్తున్న పక్కవాటా గీతాంజలి,ఎంతో కష్టపడి చిన్నారి కాళ్ళకి బూట్లు ఎక్కించింది .

అమృత తన కాళ్ళు చూసుకొని ఏడుస్తూ ,

"అక్కా ! కుడి కాలిది ఎడమ కాలికి , ఎడమది కుడికాలికి వేసావు " అంది .

దాంతో మళ్ళీ చమటలు కక్కుకుంటూ ఓపిగ్గా బూట్లు కష్ట పడి తీసి ,సరిగా తొడిగింది .

అంతా అయిపోయాక అమృత "ఇవి నా బూట్లు కావు అక్కా " అంది .దాంతో చిన్నారి పాపని
ఇబ్బంది పెట్టే ఆ బూట్లను ,కష్టపడి మళ్ళీ తీసి పక్కన పెట్టింది గీతాంజలి .

" బూట్లు ఎందుకు తీసేసావక్కా ! ఇవి తమ్ముడివి . ఈ రోజు ఇవ్వే వేసుకోమంది మా అమ్మ .
రేపు కొత్తవి కొని పెడతానంది " చెప్పింది చిన్నారి .

దాంతో తల పట్టుకొని , చిన్న పిల్లనేమీ చేయలేక ,మళ్ళీ ఓపిగ్గా ఆయాస పడుతూ బూట్లు
తొడిగింది అమృత కాళ్ళకి .

"లేసులేవి " అడిగింది చిన్నారి అమృతని,

"లేసులు బూట్ల లోపల ఉన్నాయి అక్కా " జవాబిచ్చింది అమృత

తరువాత ? ...............................................

పద్దతి

*
లక్ష్మీదేవమ్మ కి ,జయశ్రీ తో పరిచయం ఆరు నెలల క్రితం "అందం " బ్యూటీ పార్లర్ లో జరిగింది .
చీరలదుకాణం లో స్నేహం మొదలై, నగల కొట్లో గట్టి పడింది .

ఒక రోజు, జయశ్రీ

"మా ఆయన తో రోజూ వేగలేక చస్తున్నాను .ఇంట్లో ఏ వస్తువు ఉన్నచోట ఉంచరు. ఎక్కడెక్కడో
తగలేస్తారు .టైముకి వెతికి ఇవ్వకపోతే విరుచుకు పడతారు . మీ వారు ఏం చేస్తారు ? "

" పెళ్ళైన ఆరు నెలలకే , మా ఆయనకు గట్టిగా చెప్పాను ,ఎక్కడ తీసిన వస్తువు అక్కడ
పెట్టక పోతే నాకు మహా చెడ్డ చిరాకు అని " చెప్పింది లక్ష్మీదేవమ్మ .


" మరి దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ? "

" ఆ తరువాత ఆయన ఇంతవరకు నాకు మళ్ళీ కనిపించనేలేదు" చెంగుతో కళ్లు తుడుచుకుంది
లక్ష్మీదేవమ్మ .

దొంగ తెలివి

*
వెంకట నారాయణ పోలీస్స్టేషన్ కి వచ్చి యస్. .గారిని బతిమాలసాగాడు ,

"సార్ ! మా ఇంట్లో పడి నా స్ట్రాంగ్ లాకర్ని తెరిచి నా బంగారం ,డబ్బు దోచిన దొంగని
ఒక్కసారి చూడాలి "

"దొంగాడ్ని చూడాలా , మీ కోరిక వింతగా ఉంది ,కారణం ఏమిటి ? " అనుమానం గా ఆరా
తీసాడు యస్ . .

"గత పాతికేళ్ళగా మా ఆవిడ కన్ను గప్పి , రోజూ నాకు ఇంట్లోకి వెళ్ళటం సాధ్యం కాలేదు .
అంత అవలీలగా అతను ఎలా చేయగలిగాడా, తెలుసుకుందామని " నసిగాడు వెంకటనారాయణ

ఇల్లరికం

*
సుభద్ర : మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు .కాని నీనింత అందం గా వున్నా
ఒక్కరూ ముందుకు రావట్లేదు

అమల : ఎందుకలా ?

సుభద్ర : మా నాన్న షరతు పెట్టాడు . దాంతో ...

అమల : ఏమిటది ?

సుభద్ర : అల్లుడు ఇల్లరికం రావాలంటున్నాడు

అమల : అంత అవసరం ఏముంది ,అయినా క్రితం సంవత్సరం తమ్ముడు పుట్టాడుగా ?

సుభద్ర : నాన్న కి వయసు పెరుగుతోంది . తోడు కోసం ఆశ పడుతున్నాడు.
రోజు రోజు కి పెరుగుతున్న ఇంటి పని తానొక్కడు చేసుకోలేక పోతున్నాడు

రెండో పెళ్లి

*
సీతా మహాలక్ష్మి , శ్రీరాం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . రెండేళ్ళ తరువాత ,భర్త రెండో పెళ్లి
చేసుకుంటానంటే ఏమాత్రం బాధ పడకుండా ,ముక్కు చీదకుండా , శాపనార్ధాలు పెట్టకుండా ,
రాద్ధాంతం చేయకుండా నవ్వుతూ పెళ్లి కి వొప్పుకుంది.

ఇది తెలిసి ప్రాణ స్నేహితురాలు వర్ధని బాధగా అడిగింది ,

"మీ ఆయన రెండో పెళ్ళికి నువ్వు ఎలా వోప్పుకున్నావే ? "

"ఏం చెయ్యనూ,మా అత్తగారితో పోట్లాడటానికి నా ఒక్క దానికీ శక్తి సరిపోవటం లేదు "

కారణం

*
అజాత శత్రువు ని , భార్య సులోచన అడిగింది సాలోచన గా ,

"నాకు తెలిసి మీ పేరుకి తగినట్టు , ఒక్క శత్రువు కూడా లేడు కదా మీకు ? "

" నాకు ఒక్క శత్రువు మాత్రమే ఉన్నాడు "

"ఎవరతను ? "

" నాగ వెంకట వీర నారాయణ సుబ్రమణ్య శంకర వరప్రసాద హనుమాన్ "

"ఆయనా ?, ఆయన మీకేం ద్రోహం చేసారు ? "

"మన పెళ్లి కుదిర్చింది ఆయనే కదా "

కార్ డ్రైవర్

*
రాజమౌళి కొత్త కారుమీద,మొదటి సారి షికారు బయలుదేరాడు. డ్రైవర్ చాలా ప్రశాంతం గా
నడుపుతున్నాడు కారుని .ఇంతలో రాజమౌళికి ఏదో గుర్తొచ్చి ,ముందున్న డ్రైవర్ భుజం పై
చేత్తో కొట్టి " ఆ వచ్చే షాపు ముందు ఆపవోయ్ " అన్నాడు .

అంతే , స్టీరింగ్ డ్రైవర్ వశం తప్పింది .కారు మెలికలు తిరిగింది .ఓ బస్సు కు కొట్టుకోబోయి
కొద్ది లో తప్పింది .చివరికి ఓ అద్దాల షాపు కు ఒక్క అరడుగు దూరం లో ఆగింది .

ఒక్క రెండు నిమిషాలు , అంతా నిశ్శబ్దం .

రాజమౌళి తేరుకుని , డ్రైవర్ ని అడిగాడు ,

" ఇంతకు ఏం జరిగింది ? "

"మీరు నా భుజం మీద చేత్తో కొట్టారు గదా ? "

"దానికి , కారు కంట్రోల్ తప్పటానికి ఏమిటి సంబంధం ? "

"నిజానికి ఏమీ లేదండీ , కాపోతే ఓ విషయం ఉందండీ "

" ఏమిటి ఆ విషయం ? " అసహనం గా అడిగాడు రాజమౌళి .

" నాకు కారు నడపటం ఇదే మొదటి సారి .ఇంతకు ముందు ఇరవై ఏళ్ళు నేను
ఆస్పత్రులకు శవాలను తీసుకు వెళ్ళే వ్యాను నడిపాను " చెప్పాడు డ్రైవర్

మరపు

*

రంగరాజు : నిన్ను నేనెప్పటికీ మరచిపోలేను గౌతమీ !

గౌతమీ : మీ మనసు లో నాకు అంత చోటుందా ?

రంగరాజు : మా ఆవిడ పేరు కూడా గౌతమే మరి


హిప్నాటిస్ట్

*
స్వప్న , ప్రాణ స్నేహితురాలు దీపిక తో,

"కోరి కోరి బుద్ధి తక్కువై ప్రేమించి హిప్నోటిస్ట్ ని పెళ్లి చేసుకున్నానే ,నా చెప్పు తో
నేనే కొట్టుకోవాలి "

" అంత బాధేమి వచ్చిందే " అడిగింది దీపిక

"నన్ను హిప్నోటైజ్ చేసి ,నేను ఎక్కడెక్కడ పోపు డబ్బాలలో దాచుకున్న
డబ్బుల వివరాలన్నీ తెలుసుకుంటున్నాడే " వాపోయింది స్వప్న .

దగ్గు మందు

*
శ్రీధర్ నిన్న రాత్రి నుండి దగ్గిన దగ్గు దగ్గినట్లు దగ్గకుండా ,ఆపకుండా దగ్గుతూనే ఉన్నాడు .
దాంతో పొద్దున్నే ఆఫీసు కి గంట పర్మిషను పెట్టి ,డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు .

డాక్టర్ గారు మందులు రాసిచ్చారు .కొన్నాడు .ఆఫీసుకి వెళ్ళాడు . మందు బిళ్ళ మింగి ,
ఏమిటో ఆలోచిస్తూ కూర్చొన్నాడు . కొలీగ్ వంశీ అడిగాడు ,

"ఏమిటంత ఆలోచన ?, మీ ఇంటి కప్పుకి చామినార్ రేకులే వెయ్యచ్చులే "

"అదేం లేదు, డాక్టర్ దగ్గు కి ,టాబ్లెట్ తో బాటు ,టానిక్ కూడా రాసిచ్చాడు .దాన్ని పడుకోబోయే
ముందు వేసుకో మన్నాడు .ఆఫీసు లోనా , ఇంట్లోనా అని అడగటం మర్చి పోయాను "

వాకింగ్

*
అధిక బరువుతో బాధపడుతూ పరిష్కారం కోసం ,డాక్టర్ లంబోదర రావుని సంప్రదించింది
అలివేణి .ఆయన టెస్ట్ ద్వారా, మొదటగా ఆమె హాండ్ బ్యాగ్ బరువు తగ్గించారు ,

రిపోర్టులు చూసి , చెప్పారు ,

"మీకు అంత ఇబ్బంది ఏమీ లేదు .రోజూ తప్పకుండా వాకింగ్ చేయండి ,చాలు "

"అలా అయితే నేను షాపింగ్ ఎక్కువ చేస్తే సరిపోతుంది కదా " అడిగింది అలివేణి

రంగమ్మ

*
కనకం ఆత్రంగా గడియారం వంకా ,గేటు వంకా చూస్తోంది .తను మార్నింగ్ షో కు వెళ్ళాలి .
రెండురోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది , తన అభిమాన హీరో సుమన్
"ఉషా పరిణయం " సినిమా కు .చాకలి రంగమ్మ ఇంకా రాలేదు.

"ఎప్పుడు ఇంతే, అవసరమైనప్పుడే లేటు చేస్తుంది". పళ్ళు నూరుకుంటోంది కనకం .

అంతలో రంగి రానే వచ్చింది . బట్టలన్నీ మూట గట్టుకొని తీసుకు పోబోయింది .

అసలే చిరాగ్గా ఉందేమో , కనకం అరిచింది

"నీకేం పుట్టిందే , ఎక్కడకు పట్టుకు పోతున్నావు , ఉతికి చావకుండా ? "

"మీకు సినిమా కి టైమైపోనాది కదండీ .మా ఇంటి కాడ వాషింగ్ మిషన్ లో వేసి ,ఉతికి
పట్టుకొస్తానండీ. బేగెల్లండి , రీలు తిప్పేస్తాడు " చెప్పింది రంగి

మానేజర్ తిట్లు

*
రాత్రి తొమ్మిది గంటలు దాటితే గాని ఆఫీసునుండి ఇంటికి రాని విష్ణుమోహన్ రోజు నాలుగు

గంటలకే ఇంటికి వచ్చాడు .అది చూసి ఆశ్చర్యంతో వెంకట లక్ష్మి ,

"ఏమండీ ! నిజంగా మీరేనా ?, ఇంత తొరగా ఇంటికి వచ్చారా "

"మా మానేజర్ తో మాటా మాటా పెరిగింది .చివరికి ఆయన కోపంతో ఊగిపోతూ
"నరకానికి పో " అని అరిచాడు . నేను ఇంటి కొచ్చాను "

పుట్టిన రోజు కానుక

*
ఇందుమతి , భర్త మనోజ్ తో అంది ,

" రోజు తెల్లవారుఝామున ,రేపు వచ్చే నా పుట్టిన రోజుకి మీరు రవ్వల చంద్ర హారం
బహుమతిగా ఇచ్చినట్లు కలొచ్చిందండీ .దీనికి అర్ధం ఏమిటి ? "

"రేపటిదాకా ఓపికపట్టు , నీకే తెలుస్తుంది " నవ్వుతూ ఆమె మొహం లోకి చూస్తూ చెప్పాడు
మనోజ్

సూర్యుడి వయసు ఒక రోజు పెరిగింది . ఇందుమతి పుట్టిన రోజు వచ్చింది

మనోజ్ ప్రేమగా అందంగా ప్యాక్ చేసిన బహుమతి ఆమె చేతిలో పెట్టాడు .ఇందుమతి ఆత్రంగా ,
ఆశగా , ఆనందంగా ప్యాకెట్ తెరిచింది .అందులో ,

అంబటిపూడి వారి "కలలు -వాటి ఫలితాలు " పుస్తకం ఉంది

కోపం

*
సుభద్ర , అప్పుడే కాంప్ నుండీ ఇంటికి వచ్చిన భర్త శాంతమూర్తిని గుమ్మం లోనే నిలేసింది,

"మీకు బుర్ర ఉందా ?,దొరక్క దొరక్క పని మనిషి దొరికితే , దాన్ని నిన్న పొద్దున్నే ఫోను
చేసి ,చ్చడామడా అర్ధం పర్ధం లేకుండా తిడతారా ?. దెబ్బకి అది తోముతున్న గిన్నె
నామోహాన వేసి , ఇక పని చేయనని వెళ్లి పోయింది "

"ఫోనెత్తింది నువ్వుకాదా " తెల్లమొహం వేసాడు శాంతమూర్తి

అంతా ఒప్పుకున్నారు

*
కల్యాణి హుస్సేన్ సాగర్ లోని బుద్ధవిగ్రహాన్ని చూస్తూ కూర్చున్న నరసింహం దగ్గరకు
పరుగున వెళ్లి ఆనందంగా చెప్పింది ,

"మన పెళ్ళికి మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకున్నారు".

నరసింహం బదులు పలుకలేదు

"నువ్వెందుకు నీరసం గా ఉన్నావు ?, మీ తల్లిదండ్రులను ఒప్పించలేవా ? "


"
మా అమ్మానాన్నలు ఎప్పుడూ నావైపే .కాని చిన్న సమస్య ఉంది డియర్ "

"ఏమిటది " అడిగింది ఆతురత తో కల్యాణి

"నా అనుమానం ఏమిటంటే , నా భార్య ఒప్పుకుంటుందా లేదా అని "

మాత్రలు

*
డాక్టర్ ఏకాంబరం , పేషెంట్ భార్య తులసమ్మ ని పిలిచి చెప్పాడు ,

"మీ వారికి షుగర్, బీపీ , గుండెజబ్బు అన్నీ ఉన్నాయి .ఆయనకు పూర్తిగా విశ్రాంతి కావాలి .
ఈ మాత్రలు వాడండి "

"ఈ మందులు ఆయనకు ఎప్పుడెప్పుడు వెయ్యాలి డాక్టర్ గారు ? " అడిగింది తులసమ్మ

" ఇవి మీరు ఉదయం , మధ్యాహ్నం , రాత్రి వేసుకోవటానికి, ఆయనకు కాదు "

పేలటం లేదు

*
" ఈ మధ్య నేను ఎంత పేల్చినా పేలట్లేదురా " వాపోయాడు శివకాశి , మిత్రుడు ఆనందంతో

" వేసవి లో టపాకాయలు పేలకపోవటమేమిటి ?, అయినా నువ్వు వాటిని ఇప్పుడు
కాల్చటమేమిటి వెర్రివెంగలప్పలా ? "

" టపాకాయలు కాదురా , జోకులు " చెప్పాడు శివకాశి

"జోకులెయ్యమాకురా " అంటూ పగలబడి నవ్వాడు ఆనందం