దొంగలు పడ్డారు

*
"నిన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారటగా ? " అడిగింది పక్కింటి పంకజం .

"అవును , చీకట్లో చూసుకోకుండా కాలేసి, మేము పారేసిన అరటిపళ్ళ తొక్కల
మీద జారి దొంగలు పడ్డారు "

ఎటు వైపు ?

*
"మీరు నిద్రించేటప్పుడు ఎడమవైపు పడుకుంటారా ?, కుడివైపు పడుకుంటారా ?"

"రెండు వైపులా పడుకుంటాను ,నా శరీరం మొత్తం ఒకేసారి నిద్రిస్తుంది "

దేవుని దయ

*
"మీ హేతువాద సభలు ఎట్లా జరిగాయి ?" అడిగాడు ఆచారి, రామానంద్ ని .

"భగవంతుని దయవల్ల విఘ్నాలు లేకుండా చక్కగా జరిగాయి "

వేస్ట్ ఖర్చు

*
వరలక్ష్మి రాష్ట్రస్థాయి "ఉత్తమ పొదుపుమహిళ" గా ఎంపికయ్యింది

విలేఖరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు . ఓ విలేఖరి ప్రశ్న ,

"మీరు ఇంతవరకు జీవితంలో దేనికైనా డబ్బులు బాగా వేస్ట్ చేసారా ? "

"ఒకేఒక విషయంలో . 5 లక్షలు పోసి మొగుడిని కట్టుకొన్నపుడు "

తాజ్ అందాలు

*
"ప్రియా ! నీలాకాశం క్రింద అందమైన ఈ సాయంత్రం, పాలరాతి తాజ్ మహల్
చూస్తుంటే నీకేమనిపిస్తోంది ? "

"ఇటుగా మా ఆయన రాకుంటే ఎంతో happy గా ఉంటుంది సందీప్ !"

దేవ"డోసు " తపస్సు

*
దేవదా(డో )సు ఘోరంగా తపస్సు చేసాడు .దేవుడు ప్రత్యక్షమై ,

"భక్తా ! ఏమి నీ కోరిక ? " అని అడిగాడు .

"మీతో కలసి మందు కొట్టాలని ఉంది ,అంతే " మత్తుగా చెప్పాడు దేవ డోసు .

దురద

*
పేషెంట్ : ఈ మందు వాడితే దురదలు తగ్గుతాయా డాక్టర్ ?

డాక్టర్ : లేదు ,గోళ్ళు పెరుగుతాయి .హాయిగా దురదున్న చోట గోక్కోవచ్చు .

ప్రేమ విషయం

*
"కిరణ్ ! మన ప్రేమ విషయం ఈ రోజు మా నాన్నకు చెప్పు"

"మీ నాన్న అసలే మిలటరీ ఆఫీసర్ .విషయం విని నన్ను తుపాకీతో
కాలుస్తాడేమోనని భయంగా ఉంది"

"భయమేం లేదు .మా నాన్న తుపాకీ రిపేర్ కిచ్చారు "

365 లేఖలు

*
గుడి మెట్లపై కూర్చొని శూన్యంలోకి చూస్తూ కొబ్బరి ముక్క తింటున్న
మారుతి ని భుజం తట్టి పలకరించాడు పాత మిత్రుడు ఆంజనేయులు .

" విజయవాడ అమ్మాయి వాణిని ప్రేమించావు కదా ,ఎక్కడ దాకా
వచ్చింది వ్యవహారం ? "

"నేను విడవకుండా ప్రతి రోజూ సంవత్సరమంతా 365 ప్రేమ లేఖలు
అందంగా రాసి పంపాను ఆమెకు "

" తరువాత ? "

" ఆమె పోస్ట్ మాన్ ను పెళ్లి చేసుకుంది "

అబద్దం -అద్దం

*
ఇద్దరు బ్లాగర్ల ఈటపాల రాతలు

మొదటి బ్లాగరు : " మీ బ్లాగు చాలా బాగుంది "

రెండవ బ్లాగరు : "నాకు మీ బ్లాగు బాగా నచ్చింది "

మొదటి బ్లాగరు : " మీరు నా లాగే అబద్దాలు చెబుతున్నారా ? "

కుటుంబ నియంత్రణ

*
"ప్రపంచం లో అత్యుత్తమమైన కుటుంబ నియంత్రణ పద్దతి నీకు చెప్పనా ? "

" వద్దు "

" అదే నేనూ చెప్పేది "

నాన్న జోకు

*
చిన్ని, చేతన్ స్కూల్ బస్ దిగి గేటు తీసుకొని ఇంట్లోకి
అడుగు పెడుతున్నారు .

చేతన్ : అక్కా ! అమ్మ అంత బిగ్గరగా నవ్వుతోందేంటి

చిన్ని : నాన్న జోకు వేసారు

చేతన్ : నాన్న జోకుకు అమ్మ నవ్వుతోందంటే ,
మనింటి కెవరో చుట్టాలు వచ్చినట్టున్నారు

చూసిన సినిమా

*
కిరణ్ : నా ప్రాణ స్నేహితుడు రాము , నాకు చెప్పకుండా ,
నా గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సినిమా కు వెళ్ళాడు రా నిన్న .

కృష్ణ : మరి నువ్వేం చేసావు ?

కిరణ్ : ఏం చెయ్యను ?, నేను ఆ సినిమా మొన్నే చూసేసాను .

తప్పు కు కారణం

*
"స్వామీజీ ! రోజూ నేను నాలుగైదు గంటలు అద్దంలో నన్ను నేను
చూసుకొంటూ తప్పు చేస్తుంన్నాననిపిస్తోంది. బహుశా అందం వల్ల
వచ్చిన గర్వం దానికి కారణం కావొచ్చు కదా ? "

స్వామీజీ ఆమెను పరీక్షగా చూసి, చెప్పారు,

"తప్పు నీ ఊహ వల్ల, అందం వల్ల కాదు "

రష్యన్ భాష

*
"రవీ ! నీకు రష్యన్ భాష చదవటం వచ్చని కిరణ్ నాతో చెప్పాడు ,నిజమేనా ?"

" నిజమే , దానిని తెలుగులో రాసినపుడు "

ఇద్దరు సన్నాసులు

*
ఇద్దరు ముసలి సన్నాసులు తమ అనుభవాలను పంచుకొంటున్నారు .

"నేను జీవితం లో ఎవరి సలహాలు వినక ఇలా అయ్యాను "
బాధపడ్డాడు ఓ సన్నాసి .

"అందరి సలహాలు వినే నేనిట్టా అయ్యాను " నిజం చెప్పాడు మరో సన్నాసి .

చెల్లి ఏడుపు

*
"ఏరా చిన్న చెల్లిని ఎందుకు ఏడిపిస్తూన్నావు ? "

"దానికి నా చాక్లెట్ పెట్టలేదని ఏడుస్తోంది "

"మరి దాని చాక్లెట్ ఏమైంది ? "

"నేను అది తింటున్నపుడు కూడా ఏడ్చిందమ్మా చెల్లి"

ఖైదీ లొంగిపోయాడు

*
ఒక సీనియర్ ఖైదీ అతి కష్టం మీద జైలు నుండి తప్పించుకొని పారిపోయాడు .
కానీ ఆశ్చర్యం గా అదే రోజు సాయంత్రం తిరిగి లొంగిపోయాడు.
విలేఖరులు చుట్టూ మూగి కారణ మడిగారు

"బయటపడి మొదటగా నా భార్యను కలుద్దామని ,ఇంటి కెళ్ళి తలుపు తట్టాను .

విసురుగా తలుపు తీసిన వెంటనే ఆవిడ అడిగిన మొదటి ప్రశ్న :

"ఇప్పటి దాకా ఎక్కడ చచ్చావు ?, తప్పిచ్చుకొని 8 గంటలైతే " "

ఆదర్శ దంపతులు

*
"ఏమండీ ! మన పక్కింటి ఆలుమగలు ఎంత ఆదర్శ దంపతులో కదండీ "

"అలా అనుకోకు ,బహుశా మన గురించి కూడా వాళ్లు అలాగే అనుకుంటూ
ఉంటారు "

పొరపాటు- తప్పిదం

*
గుళ్ళోకి వెళ్ళినప్పుడు ,మన పాత చెప్పులు మరచిపోయి,
వేరే వాళ్ల కొత్త చెప్పులు వేసుకొని రావటం "పొరపాటు "

మన కొత్త చెప్పులు గుళ్ళో మరచి , పాత చెప్పులు
తొడుక్కొని రావటం " తప్పిదం "

షేర్లు పెరుగుతాయి

*
ఇన్వెస్టార్, షేర్ బ్రోకర్ మధ్య సంభాషణ :

ఇన్ : మార్కెట్ పీక్ లో ఉన్నపుడు "గోల్ మాల్ లిమిటెడ్ " షేర్లు
1023 రూపాయలకు 500 కొన్నానండీ. ఇప్పుడు అది 42 ఉంది ,
కొంటే పెరుగుతాయా ? ,లాభ మొస్తుందా ?

షేర్ : కొనండి . పెరుగుతాయి . లాభ మొస్తుంది.

1000 షేర్లు కొన్నాడు ఇన్వెస్టార్.


ఆరు నెలల తరువాత ,

ఇన్ :గోల్ మాల్ 5 రూపాయలకు వచ్చింది. పెరుగుతాయి,

లాభమొస్తుందన్నారు మీరు ?

షేర్ : మీ షేర్లు 1500 అయినాయి. ఆపరేటర్ కు లాభమొచ్చింది.

నేను చెప్పింది కరెక్టే గా .

గొంతు ఇబ్బంది

*
కొండవీటి చాంతాడంత ఉపన్యాసాలను దంచే ఉపన్యాసకేసరి వాచాల రావుగారు,
ఈ మధ్య గొంతు ఇబ్బంది వల్ల చిన్నగా మాట్లాడి ముగిస్తున్నారు .

ఎక్కువ మాట్లాడితే గొంతు కోస్తామన్న బాధిత శ్రోతల బెదిరింపే ఇబ్బందికి
కారణం .

మనసు విప్పి

*
ఆఫీసు జతగాళ్ళు కార్తీక్ ,కిరణ్ ల సంభాషణ:

"నా ఫ్రెండ్ పవన్ , నేను ఓ రోజు ఇద్దరికి ఉపయోగంగా ఉంటుందని
మనసు విప్పి ఒకరి తప్పు లొకరికి చెప్పుకోవాలనుకున్నాము"

"దానివల్ల మీకేమైనా ఉపయోగం కలిగిందా ? "

"ఆ తరువాత ఇద్దరం 5 ఏళ్ళు మాట్లాడుకోలేదు "

రెట్టింపు

*
జనాభా లెక్కల అధికారి ఓ ఇల్లాలిని వయసడిగాడు .

"ఒక్క నిమిషం లెక్క పెట్టనివ్వండి .నా పెళ్లి నాడు నా వయసు 18,
ఆయన వయసు 30 .ఇప్పుడు ఆయన వయసు దానికి రెట్టింపు,
60 ఏళ్ళు . అంటే నాకు 36 అండీ ."

విధేయుడు

*
భార్యా విధేయుల సంఘం సమావేశం జరుగుతోంది .అధ్యక్షులవారు మైకు లో

"ఆటల పోటీ లకు సభ్యులను రెండు జట్లుగా విభజిస్తున్నాము .జీవితంలో
ఒక్కసారైనా భార్య మాటకు ఎదురు చెప్పినవాళ్ళు ఎడమ వైపుకు రండి.
మిగిలిన వారు కుడివైపునే ఉండండి "

సభ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది .కొద్దిసేపటికి ఒక సన్నగా ,పీలగా ,
పొట్టిగా ఉన్నవ్యక్తి నీరసంగా లేచి ఎడమ వైపుకు వెళ్లి నిలబడ్డాడు .
మిగిలిన అందరు ఆరాధనగా అతన్నే చూస్తూ కుడివైపే ఉండిపోయారు .

అధ్యక్షులవారు అనుమానంగా అతన్ని ప్రశ్నించారు

"నువ్వు నిజంగా భార్యను ఎదిరించావా ? "

"అవునని చెప్పమని మా ఆవిడ వచ్చేడప్పుడు వార్నింగ్ ఇచ్చి పంపింది "

"మూడు" పదాలు

*
"సుజీ ! నన్ను గాలిలో తెలిపోయేట్లు చేసే ఆ మూడు పదాలు
నీ కోకిల కంఠంతో నా చెవి లో చెప్పవా !"

" వెళ్లి ఉరి వేసుకో "

బుజ్జి పిల్లి

*
వారం క్రితం కాపురానికి వచ్చిన కాంతామణి అప్పుడే ఇల్లు చేరిన భర్తతో ,

"ఏమండీ ! మీకిష్టమని చేసిన కొబ్బరి పాయసం,మన బుజ్జి పిల్లి తాగేసిందండీ"

"పోనీలే , బాధ పడకు ,నీకోసం వేరే చిన్ని పిల్లిని తెచ్చిపెడతాలే "

ఎవరు ?

*
లలితా !"అతనెవరు ?,మిడి గుడ్లేసుకొని, నన్ను పట్టి పట్టి చూస్తున్నాడు "

"ఆయనా ? ,పిచ్చి వాళ్ల మీద గొప్ప పరిశోధన చేసి నందుకు ఇంటర్నేషనల్
అవార్డ్ వచ్చిందాయనకు "

రేఖ చెప్పింది

*
కాంతారావు , కార్తీక్ ల సంభాషణ :

"ఒరేయ్ ! నేను చాలా సరదా మనిషినని ,నాకు మంచి ధైర్యం ,తెలివితేటలు
ఉన్నాయని రేఖ నన్ను మెచ్చుకుంది రా "

"అరేయ్ ! రేఖ మొదట్లోనే ఇన్ని అబద్దాలు చెబుతోంది .దాంతో తిరక్కు .
నాశన మైపోతావు "

అమ్మాయి తో డాన్స్

*
ఇద్దరు మిత్రుల సంభాషణ :

"నేనా అమ్మాయి తో డాన్స్ చేయలేను "

" ఏం "

" నాతోకలిసి డాన్స్ చేస్తావా అని అడిగింది "

" అందులో తప్పేముంది ? "

"నేనా అమ్మాయి తో కలిసి డాన్స్ చేస్తున్నపుడు అడిగిందీ మాట "

వరద కవి

*
కవి : నా కవితల్లో వరదొస్తోంది , మునిగి పోతారు .కాచుకోండి

విమర్శకుడు : కవి "తల్లో " వరదా ?, పెంకు లేచి పోతుంది , పారిపోండి .