నిచ్చెన

*
" అమ్మా ,అమ్మా ! ఒక్కసారి పెరట్లోకి రా " అరుస్తూ వంటిట్లోకి పరిగెత్తుకొని వచ్చాడు బంటీ

" మళ్ళీ ఏం నాశనం చేశావు రా ? "

" అమ్మా , నా కాళ్ళకి అడ్డంపడి గోడకానించిన నిచ్చెన పడిపోయింది కింద "

" నాకు పని ఉంది. వెళ్లి నాన్న కి చెప్పు "

" నాన్నకి తెలుసమ్మా "

"తెలిసినాయన ఆయనే సరిగా పెట్టచ్చు కదా ? "

" నాన్న చూరు పట్టుకొని వెళ్ళాడుతున్నారమ్మా "

నాస్తికుడు

*
వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో ఇద్దరు వయసు మళ్ళిన బిచ్చగాళ్ళు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ,

" ఏరా అప్పిగా ! భిక్షం గారి ఇంటి సందు లోకి రావటం మానుకున్నావేరా ? "

" ఆ సందు మా కొత్త అల్లుడికి కట్నం క్రింద ఇచ్చాను. వాడే వస్తున్నాడు "

" సరే గానీ , మీ కొత్తల్లుడు పండగకి కూడా గుడి కాడికి రాడెందుకు ? "

" ఆడొట్టి నాస్తికుడు , గుడి కాడికి రాడు "

పరుగు

*
హైదరాబాద్ లుంబినీ పార్క్లో ఒక తెలుగు బ్లాగరు వేగంగా పరిగెడుతున్నాడు. అప్పుడే లోపలికి అడుగు పెట్టిన మరో బ్లాగరు అతన్ని ఆపి అడిగాడు ,

" ఎందుకు పరిగెడుతున్నారు ? "

" ఇద్దరు తెలుగు బ్లాగర్ల మధ్య పెద్ద కొట్లాట జరిగేట్టుఉంది. దాన్ని ఆపటానికి పరిగెడుతున్నాను "

" ఎవరు వాళ్ళు ? "

" ఒకటి నేను , రెండు నన్ను పట్టుకోవటానికి పరిగెడుతూ వస్తున్నాడే వాడు " అని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు మొదటి బ్లాగరు .

ప్రేమ పెళ్లి

*
సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది ,

" కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా "

" అతని మొహం చూస్తే ఆ తప్పు చేసిన వాడిలా కనిపించలేదే "

" లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది "

" ఏమిటో అది "

" రాత్రి తోడుకని మజ్జిగ కోసం వెళితే, ఆ పిల్ల చలిలో అతని కోసం వేడి నీళ్ళు పెట్టి ,దగ్గర కూర్చొని
మరీ అంట్లు తోమిస్తోంది "

అమ్మాయి ఒప్పుకుంది

*
" అమ్మా ! కొత్త వంటవాడిని తెచ్చుకుందాం. రోజూఒకటే వంట తిని బోరు కొడుతోంది " తల్లి పక్కన చేరి అడిగింది అర్చన .

కాంతం ఆనందం తో అరిచింది ,

" ఏమండీ ! మనమ్మాయి పెళ్లి కి ఒప్పుకుంది. ఆ చేత్తోనే మైసూరు పాక్ కూడా కలియ బెట్టండి "

అన్యాయం

*
కీర్తన ఏదోగా ఉండటం చూసి కవిత అడిగింది ,

" ఏమైంది కీర్తీ ! బాగా డల్ గా ఉన్నావు ? "

"పరిస్థితులు చూస్తుంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే రాంబాబుకి అన్యాయం చెయ్యక తప్పేట్టు లేదు . అదే బాధ గా ఉంది . "

" ఏం జరిగిందే ? "

" మా వాళ్ళు నా పెళ్లి నిశ్చయం చేశారు రాంబాబు తోనే " కలవరపడింది కీర్తన .