పెళ్లి వద్దు

*
పరంధామయ్య గారు తన జీవితపు చివరి క్షణాలలో బుద్దిమంతుడైన తన ఏకైక పుత్రరత్నాన్ని పిలిచి చెప్పారు ,

" రామం ! నేను జీవితంలో చాలా తప్పులు చేశాను.అన్నింటికంటే పెద్దతప్పు పెళ్లి చేసుకోవటం.ఆ తప్పు నువ్వు ఎన్నటికీ చెయ్యకు "

" రెండోదా,మూడోదా నాన్నా ? " అడిగాడు సకలగుణాభిరామం.


జేబులో పది

*
పట్టణం లోని గొప్ప కోటీశ్వరుడు రత్నాకరంని ఇంటర్వ్యూ చేస్తున్నాడు " మీ " టీవీ ఛానల్ విలేఖరి ఏకదంతం .

" మీరు బందరు ఎలా వచ్చారు ? ,వ్యాపారం ఎలా మొదలు పెట్టారు ? "

" నేను నా 16 వ ఏటా నా కాళ్ళ మీద నేను నిలబడాలని ,ఇల్లు వదిలి దొరికిన రైలెక్కాను.చివరి స్టేషన్ బందరు కాబట్టి నన్ను ఇక్కడ దించేశారు .అప్పుడు నా వంటి మీద కట్టు బట్టలు ,చొక్కా జేబులో పది రూపాయిలు మాత్రం ఉన్నాయి " జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ ఒక్క క్షణం ఆగాడు రత్నం .

వెంటనే ఏకదంతం ,

" అయితే మరి మీరు ఆ పది రూపాయలను మొదటిగా ఏ వ్యాపారం లో పెట్టుబడి పెట్టారు ? " అడిగాడు ఆత్రంగా

" ఆ పది రూపాయలతో మా నాన్నకు ట్రంకాల్ చేసి వెంటనే డబ్బు పంపమని చెప్పాను "

పునర్జన్మ

ఇందిరా పార్క్ లో తన కోసం ఎదురుచూస్తున్న సుజన వైపు , ఎంతో భారంగా ,ఏదో కోల్పోయిన వాడిలా
అడుగులు వేసి నీరసంగా ఆమె పక్కన కూలబడ్డాడు సిద్ధార్ధ .

"ఏమైంది సిద్దూ ! అలా ఉన్నావు ? "

" నీకు పునర్జన్మల మీద నమ్మకం ఉందా సుజీ ? "

" ఉంది, అయినా ఎందుకలా అడిగావు ? "

" ఈ జన్మకి మనం ప్రేమికులు గానే మిగిలిపోతామనిపిస్తోంది.వచ్చే జన్మలోనైనా పెళ్లి చేసుకుందాం "

" సిద్దూ ! ఎందుకలా ? " కన్నీళ్ళు ఆపుకొంటూ అడిగింది సుజన

" క్రితం జన్మ లోని ప్రేయసితో నాలుగు రోజుల క్రితం నా నిశ్చితార్ధం జరిగింది " వివరించాడు సిద్దు.

మళ్ళీ తీపి

*
పెళ్లి రోజు సరదాగా భార్య సుజాతతో కలిసి బయలుదేరాడు పురుషోత్తం.నడుస్తుంటే పుల్లారెడ్డీ స్వీట్స్ కనిపించింది .

భార్యని అడిగాడు ప్రేమగా " ఇంకో బందరు లడ్డు తింటావా ? "

సుజాత అచ్చెరువొంది " ఇంకా ఒకటే తినలేదు , రెండోదేంటి ? " అంది

" నీ మతిమరుపు మండా , పెళ్ళైన కొత్తలో మొదటి లడ్డు ఇక్కడేగా ఇప్పించా నీకు " గుర్తుచేశాడు
పీనాసి పురుషోత్తం .

కారు కష్టాలు

సీతామహాలక్ష్మి చికాకు పడుతూ, భర్త అరవింద్ కి ఫోను చేసింది ,

"మన కారు వల్ల పక్కింటి పంకజం దగ్గర నా పరువు పోయింది.దాంతో
కలిసి సినిమాకు
వెళుతుంటే మధ్యలో ఆగి పోయింది "

" కారుకేమైయ్యింది ? "

" కార్బోరేటర్లో నీళ్ళున్నాయి "

"కార్బోరేటర్లో నీళ్ళు ఉండటమేమిటి ? వెటకారం, నిజం చెప్పు "

"నిజంగా నిజం ,నీళ్ళున్నాయి "

" సరే , నీకు తెలిసిచ్చావదు గానీ , నేను చూస్తా, కారేక్కడుంది " విసుగ్గా అరిచాడు అరవింద్

" మన ఇంటి రోడ్డు దాటి కుడి వైపు ముందు కెళితే సాగర్ రోడ్డు వస్తుందే, దాని పక్కనున్న చెరువులో "

దత్తత

ఎన్నో నిద్ర లేని నెలలు ,సంవత్సరాలు గడిపి, ఆగలేక తన డెబ్భై ఏళ్ల తల్లి సుందరమ్మని
అడిగాడు సుదర్శనం ,

"అమ్మా ! నాకు యాభై ఏళ్ళు .తమ్ముడికేమో నలభై, చెల్లికి 38.నాకు ,వాళ్లకి రూపంలో
పోలిక లేదు ,అలవాట్లలో కూడా లేదు .నన్నేమైనా దత్తత కి తీసుకున్నారా ? "

"నీ ఆరో ఏటా దత్తత జరిగింది.కానీ వెనక్కి పంపించేసారు ,భరించలేక నిన్ను" చెప్పింది
తల్లి బాధ పడుతూ .

పుణ్యం

*
చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి ,తన ఎదురుగా ఉన్న మనిషిని అడిగాడు ,


"నిన్ను కొంత కాలమైనా స్వర్గానికి పంపటానికి నీ ఖాతా లో ఒక్క పుణ్యం

కూడా కనబడటం లేదు "


"లేదు సార్, నేను ఒక ముసలమ్మా ని రౌడీ బారి నుండీ కాపాడాను "


" నా రికార్డ్ లో లేదు ,వివరం చెప్పు "


"ఒక డెబ్బై ఏళ్ల ముసలమ్మ బాంక్ లో పించెను తీసుకొని వెళుతోంది ,

ఒక రౌడీ ఆమె ను కొట్టి డబ్బు లాక్కు పోతుంటే నేను అడ్డగించి వాడిని

కొట్టి ఆమె డబ్బు తిరిగి ఇప్పించాను ."


" ఇది ఎప్పుడు జరిగింది ? " ఆసక్తి గా అడిగాడు చిత్రగుప్తుడు

" ఒక పది నిమిషాల క్రితం "