ఆపరేషన్

*

గోవింద్ , హరి ఆపరేషన్ చేసి , చేతులు కడుక్కుంటూ ,

"అయితే ,చివరి క్షణం లో ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేయగలిగాను అంటావు ! " అన్నాడు హరి


"పేషెంట్ ఒప్పుకునే సరికి టైం అయ్యింది .లేకపొతే మాములుగానే అతను
మరో
గంట తరువాత కోలుకునే వాడు "

గొర్రె

*

లుంబిని పార్క్ లో , తన ప్రియురాలి కళ్ళలోకి చూస్తూ రాజు ,

"రాణీ ! నీ అందమైన కళ్ళల్లో నాకు లోకమంతా కనిపిస్తోంది" అన్నాడు

అది విన్న రంగన్న ఆత్రంగా ,

"మీకు పుణ్యముంటుంది.మూడు రోజుల క్రితం తప్పిపోయిన నా మచ్చల

గొర్రె ఎక్కడుందో కాస్త ఆమె కళ్ళలో చూసి చెప్పు బాబూ " అడిగాడు అమాయకంగా .

అమ్మాయి కోసం

*

విజయవాడ నగరంలోకెల్ల గొప్ప ధనవంతుడైన వెంకటరాయుడు ఒకరోజు పార్టీ ఇచ్చి ప్రకటించాడు ,


"మీకు తెలుసు ,నాకు మిస్ వరల్డ్ లాంటి అందమైన పెళ్ళికాని కూతురు ఉంది .మీకు ఎదురుగా ఉన్న విశాలమైన స్విమ్మింగ్ పూల్ లో నేను పెంచే పది మొసళ్ళు ఉన్నాయి . యువకుడైనా స్విమ్మింగ్ పూల్ లో దూకి ,అవతలి వొడ్డుకు చేరితే మా అమ్మాయిని కాని , కోటి రూపాయలు కాని ఇస్తాను "

మాట పూర్తయ్యే లోపే , కుర్రాడు నీళ్ళలో దూకి , కళ్లు మూసి తెరిచే లోపు అవతలి వైపుకు చేరాడు .

రాయుడు ఆనందంతో , కుర్రాడిని కౌగలించుకొని అడిగాడు ,

"నీకు , నా కూతురు కావాలా ? , కోటి రూపాయలు కావాలా ? "

"నీ కూతురూ వద్దు , నీ కోటి వద్దు . నన్ను నీళ్ళలోకి తోసినవాడు ఎవరో కావాలి "అన్నాడు అతను కోపంగా అటు ఇటు వెతుకుతూ .

ముభావం

*

" లక్కీ హోటల్ ఓనర్ రాంబాబు, ఎప్పుడు నవ్వుతు,నవ్విస్తూ ఉండేవాడు , మధ్య ముభావంగా
ఉంటున్నాడు,శూన్యం లోకి చూస్తూ ఏం మాట్లాడినా విసుక్కుంటున్నాడు . ఏమైంది వాడికి ? "
అడిగాడు సుధీర్ , మధుని .


"వాడి హోటల్ పక్కన "నిత్యాన్నదాన సత్రం "పెట్టినప్పటినుండి, అదే వరస వాడిది"కళ్లు తెరిపించాడు మధు .

తిక్క

*

" క్లాసు ఫస్ట్ గోపాల్ గాడికి , అరికాలు నుండి మాడు దాకా అంతా తిక్కేనే " అంది ఆదిలక్ష్మి , భవాని తో


"నువ్వంత గట్టిగా ఎలా చెప్పగలవు ? " అడిగింది భవాని .


"వాడు నాకో లవ్ లెటర్ రాసాడు .దాని చివర్లో , నేను నీకు నచ్చక పోతే, ఉత్తరం మీ చెల్లెలికి ఇవ్వు అని రాసాడు తిక్క సన్నాసి "

ఫొటో

*

ఇష్టపడి శ్రీలక్ష్మిని పెళ్ళిచేసుకున్నాడు కోదండరామ్ .ఆమె రోజూ బ్యాగ్ లో తన ఫొటో పెట్టుకొని ఆఫీసుకు వెళ్ళటం చూసి మరింత ఇష్టం పెంచుకున్నాడు . ఒకరోజు ,


" ఏమోయ్ లక్ష్మీ ! రోజూ నా ఫొటో బ్యాగ్ లో పెట్టుకొని వెళతావు కదా,ఎందుకు" అడిగాడు ప్రేమగా .


"మీ ఫొటో చూస్తుంటే ,నాకొచ్చిన సమస్య అయినా చిటికెలో మాయమైపోతుంది .పోయిన చిరునవ్వు తిరిగి వస్తుంది "

"నా ఫొటో నే అంత చేయగలిగితే,నేను ఎదురుగా ఉంటే నీ కెంత హాయో కదా "

"మీరు పొరబడ్డారు ,మీ ఫొటో చూడగానే ,మీకంటే పెద్ద సమస్య ఏముంటుందని నాకు ధైర్యం వస్తుంది ,అంతే "

తగ్గిన అందం

*

"నా అందం తగ్గుతున్నట్లు అనుమానంగా ఉందే " అంది వనజ , సుహాసిని తో .


" ఎందుకలా అనిపించింది " అడిగింది సుహాసిని మనసులో ఆనందిస్తూ


" మద్య నేను కౌంటర్ లో కూర్చొని డబ్బులు ఇస్తుంటే బ్యాంక్ కస్టమర్లు నోట్లు లెక్కపెట్టుకొని వెళుతున్నారు "

మాటలు

*

" నేను మా ఆవిడతో మాట్లాడి 10 రోజులయ్యింది " చెప్పాడు శంకర్, అవినాష్ తో

" ఇద్దరి మధ్య పెద్ద గొడవ ఏమైనా జరిగిందా ? " అడిగాడు అవినాష్

"లేదు, ఇప్పటి వరకు ఆవిడ మాట్లాడటం ఆపలేదు "

వినతి

*

సుబ్బారాయుడు కొత్తగా ఫలహారశాల తెరిచాడు .తను పెట్టే తిండి పై ఖాతాదారుల అభిప్రాయం తెలుసుకోవటానికి సలహాలు-ఫిర్యాదులు పెట్టె ఒకటి ఏర్పాటు చేసాడు . రోజు సాయంత్రం తెరిచి చూస్తే ఒకే ఒక చీటీ కనిపించింది .

దానిపై ఇలా రాసి ఉంది

"పదార్ధాల రుచి , నాణ్యత చాలా బాగున్నాయి .కాకపోతే మీరు ఇడ్లీలలోకి ఎక్కువ చట్నీ ఇస్తున్నారు .అందుచేత ఇడ్లీ సైజు పెంచాలని వినతి "

పొదుపు

*
మన్మధరావు ,మిత్రుడు కరుణాకరం తో ,

"డబ్బు పొదుపు చేయటం వల్ల చాలా లాభపడ్డాను రా "


"నీ జల్సాలకే ఉన్న, అప్పు తెచ్చిన డబ్బులు సరిపోవు కదా !,మరి పొదుపెలా చేసావు ?, లాభమెలా
కలిగింది ? " నమ్మలేనట్లు అడిగాడు కరుణాకరం


"నా గోవిందా ఫైనాన్స్ లో జనాలు పదికోట్లు పొదుపు చేసారు ,నేను జండా ఎత్తేశాను ,అంతే "

పెళ్లి కొడుకు

*

"నువ్వు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ?" అడిగింది సుప్రియ , రజని ని .


"అతను ఎల్లపుడు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధి గాను , నన్ను ఓటరు గాను చూసుకొనే వాడిని చేసుకోవాలని నా కోరిక " మనసులోమాట చెప్పింది రజని

తిట్లు

*

"పోయిన దీపావళి కి ,షేర్లు మట్టి కొట్టుకుపోయి నేనేడుస్తుంటే ,పాతిక వేలు పెట్టి పట్టు చీర కొనిపెట్టమంది మా ఆవిడ . నాకు పిచ్చ కోపమొచ్చి ,చెడామడా బూతులు తిట్టేశాను "
చెప్పాడు అరవింద్ , వెంకట్ తో .



"నువ్వు చెల్లెమ్మని అంతలా తిట్టావా ? ,నమ్మ లేక పోతున్నాను "



"తిట్టింది చిట్టిని కాదు , నరకాసురుని "

భోజనం బాలేదు

*

"విశాలాక్షి ఉత్తరం చదివి పక్కన పెడుతూ ,భర్త వెంకట రావు తో అంది ,

"మన రెండో వాడికి పట్నం లో భోజనం బాగుండటంలేదుటండి "


"అడుక్కున్న వాడికి అరవై కూరలు , వండుకున్న వాడికి ఒక కూర అని ,
వేరే
హోటల్లో తినేడవచ్చు కదా "


"అలా చేయటం జైల్లో కుదరదు అని రాసాడండి ఉత్తరం లో వాడు " చెప్పింది విశాలాక్షి .

పెంపకం

*

మెజీషియన్ పద్మనాభ రావు ఇంటికి ,చిన్న నాటి స్నేహితుడు సీతాపతి వచ్చాడు .హాల్ లో కూర్చొని మాట్లాడు తుంటే ,వాళ్ల పెంపుడు కుక్కను , మెడలో గంట ఉన్న పిల్లి తరుముతూ వచ్చింది .

ఆశ్చర్యపోయిన సీతాపతి ,

"ఇది కూడా మాజిక్కేనా పద్మనాభా ! " అని అడిగాడు .

"లేదురా , కుక్కను నేను , పిల్లిని మా ఆవిడ పెంచటమే దీనికి కారణం "

ఇదే

*

చిన్న నాటి స్నేహితుడు రమాకాంత్ పెళ్ళికి వెళ్ళాడు పరాంకుశం .రమాకాంత్ మాటల్లో అన్నాడు ,

"ఎంతైనా బ్రహ్మచారి బతుకు చాలా కష్టం రా .మెస్ లో తినటం ,ఇల్లు శుభ్రం చేసుకోవటం ,బట్టలు
ఉతుక్కోవటం
,ఇస్త్రీ చేసుకోవటం నా వల్ల కాక పెళ్లి చేసు కుంటున్నారా "


"సరిగ్గా ఇదే కారణాల వల్ల నేను విడాకులు తీసుకున్నాను " హెచ్చరించాడు పరాంకుశం .

కౌన్సెలింగ్

*

భార్య గొడవ భరించ లేక చెవి డాక్టర్ దగ్గరకు వినికిడి పరీక్షకు వెళ్ళాడు గోపాలం . డాక్టర్ తెనాలి రామకృష్ణ సరదాగా రాజకీయాలు , పేకాట, హీరోయిన్లు , మందు మొదలైన వాటి గురించి మంద్ర స్థాయి నుండి తారా స్థాయి స్వరం వరకు ఉపయోగించి మాట్లాడాడు .అంతా సుబ్బరం గానే వినపడింది గోపాలానికి .తరవాత అరగంట గోపాలం భార్య ఆండాళ్ళు మాట్లాడింది .పరీక్ష పూర్తి అయ్యింది .ఫలితం తెలిసింది .

డాక్టర్ నోరు తెరిచాడు ,

" అమ్మ ఆండాళ్ళు , మీ ఆయనకు వినికిడి బాగానే ఉంది .కాని నీ మాటల్లో అతనికి 10 శాతం మాత్రమే వినపడుతున్నాయి "


"ఆయనకు చెముడు వచ్చిందేమోనని భయపడ్డాను .ఇకనుంచి ఆయనకు ప్రతిదీ 10 సార్లు చెప్పే కష్టం నేను పడతాలెండి "

ఏకాభిప్రాయం

*

సమరం , ఏకాంబరం మాట్లాడు కుంటున్నారు .

సమరం : పెళ్లి తరువాత, మొదటిసారి మా ఇద్దరికి ఒక విషయం లో ఏకాభిప్రాయం కుదిరిందోయ్


ఏకాంబరం : విషయం లో ?

సమరం : విడాకులు తీసుకొనే విషయం లో

ఆయన ఎక్కడ ?

*
సుజాత, సబిత CMR షాపింగ్ మాల్ దగ్గర కలిసారు ,

సుజాత : ఏడాది నుండి మా ఆయన ఆఫీసు అయ్యింతరువాత సాయంత్రాలు ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాడా అని ఆలోచించే దానిని .


సబిత : ఇప్పటికైనా తెలిసిందా మరి ?


సుజాత : మొన్న నేను క్లబ్బు కు వెళ్ళలేదు ,దాంతో ఆయన సాయంత్రాలు ఇంట్లోనే గడుపుతున్నారని తెలిసింది

వంట

*

మధ్యాహ్నం రెండు గంటలకు తన ఇంటి కిటికీ తెరిచి పక్కింటి పంకజాన్ని పిలిచి , అడిగింది తాయారు,




"
ఏమే , పంకజం ! వంట అయ్యింది టే ? "



"
అయ్యింది పిన్ని గారు "


"వాళ్ల ఇంట్లో వంటైయ్యింది .అక్కడకు వెళ్ళు " అంది వీధి వైపు చూస్తూ ,అరగంట నుండి తన ఇంటి ముందు జిడ్డులా కదలకుండా నుంచున్న ముష్టి వాడి వైపు తిరిగి .

బొంగరం

*

"ఏమే సుజీ , అమ్మాయిల వంక కన్నెత్తి కూడా చూడని గణేష్ ను , నీ చుట్టూ బొంగరంలా ఎలా తిప్పించుకో గలిగావు ? "



"అతని రీసెర్చి నోట్స్ తీసుకొని నేను తిరిగివ్వలేదు , దాని కోసం నా చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు , అంతే "

లాయర్ ఫీజు

*

లాయర్ గుర్నాధం దగ్గరకు వచ్చాడు ఏసుపాదం,

"లాయర్ గారు , నేను బాగా పేద వాడినండీ , నా కేసు మీరే వాదించి పెట్టాలి "


"పేదవాడి నంటున్నావు, నా ఫీజు ఎలా ఇస్తావు ? "


"నా దగ్గర డొక్కు స్కూటర్ ఉంది , దయతో అది తీసుకొని నా కేసు వాదించండి "


" ఇంతకీ నీ కేసు ఏమిటి ? "


" స్కూటర్ దొంగతనం కేసు "

ఫాలోయింగ్

*
జూలీ, డాలీ టాంక్ బండ్ పై మార్నింగ్ వాక్ చేస్తున్నారు . వారికి పది అడుగుల దూరం లో ,ఓ కుర్రాడు వీళ్ళని ఫాలో అవుతూ, అవుతూ ............,

ఒళ్ళు మండిన వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అరిచారు ,

"ఒరేయ్ , వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో ,నువ్వు మా ఇద్దరిలో ఎవరి వెనుక పడుతున్నావో తెలియక బుర్ర పిచ్చెక్కి పోతోంది .లేకపోతే ఇంకో కుర్రడినైనానీ వెంట తెచ్చుకో "

కుర్రాడు కంగారేమీ పడకుండా నెమ్మదిగా సమాధానం చెప్పాడు ,

"మీరు అపార్ధం చేసుకున్నారు .నేను మిమ్మల్ని ఫాలో అవటం లేదు , మీ ముందు వయ్యారంగా నడుస్తున్న నా బుజ్జి బొచ్చు కుక్క టామీ ని ఫాలో అవుతున్నాను "

గెలుపు పందెం

*

రవళి రుక్మిణి మెళ్ళో నగ చూసి,


"
నీ కొత్త గొలుసు చాలా బాగుంది . ఎన్ని కాసులు పెట్టి చేయించావేమిటి "


" ఇది కొన్నది కాదు . మా ఆయన పరుగు పందెం లో గెలుచు కున్నారు "


" పందెంలో ఎంతమంది పాల్గొన్నారు ? , ఎప్పుడు జరిగింది ? "


"నిన్న రాత్రి .ముగ్గురు . మా ఆయన , పోలీసు , గొలుసు యజమాని "

తాజా వార్తలు

*

రమేష్ , సురేష్ సంభాషణ :


రమేష్ : ఏరా , నీకు టీవి , రేడియో ,న్యూస్ పేపర్ అంటే చచ్చే ఎలర్జీ కదా. వాటిని చూస్తేనే పారిపోతావు కదా. కాని ప్రపంచం లోని తాజా వార్తలన్నీ నీకు మాకంటే ముందే ఎలా తెలుస్తాయి ?



సురేష్ : నేను రోజూ పొద్దున, సాయంత్రం నీళ్లు వచ్చే వేళకు మా వీధి కుళాయి దగ్గర పావు గంట కూర్చుంటా .