స్పీచ్

*
వామన రావు తన పుత్రరత్నం నరహరి కి ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తూ , కొడుకు ప్రయోజకత్వం తెలుసుకోవటానికి ప్రశ్న వేసాడు ,

"హరీ , డైరెక్ట్ స్పీచ్ , ఇన్డైరెక్ట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పరా "

"నా ప్రోగ్రెస్ కార్డ్ చూసి అమ్మ తక్కువ మార్కులు వచ్చినందుకు నన్ను చదువు రాని వెధవ అని
తిట్టటం డైరెక్ట్ స్పీచ్.మీ మీద కోపంతో నన్ను అంట్ల వెధవ , చవట దద్దమ్మ ,క్షీప అని తిట్టటం ఇన్ డైరెక్ట్ స్పీచ్ నాన్నా "

ప్రేమ లేదు

*
అనూజ , జలజ భలే మొగాడు సినిమా ఇంటర్వెల్లో కలిసారు. అనూజ అడిగింది ,

" ఏమే మీ ఆయన ఏమన్నా మారాడా ? "

"ఆ, నాకు తనెంత ఇష్టమో చెప్పి పొగిడి నప్పుడల్లా ,నేనేదడిగినా చకచకా చేస్తూ నన్ను హ్యాపీ గా ఉంచుతున్నాడు "

"ఆతనంటే నీకు అస్సలు ఇష్టం లేదని చెప్పావు కదే నాకు ! "

"నిజమే , కాని మరి పనులెలా చేయించుకోవాలి ? "

హోటల్ కూడు

*

శ్రీవల్లి విజయవాడ లోని న్యూ సురుచి హోటల్ కు వెళ్లి భోజనం ఆర్డర్ చేసింది . సర్వర్ ఆమెను ఎగా దిగా పైనించి క్రిందదాకా చూసి ,

"మీరు మా హోటల్ కు మొదటిసారి వచ్చారు కదూ "

"అవును , నీకెందుకు అలా అనిపించింది "

" మా హోటల్ లో ఒకసారి తిన్నవాళ్ళెవరు మళ్ళీ రారు " అని నిజం చెప్పి నాలుక కరుచుకున్నాడు సర్వర్

జైలుకు

*
రజనికాంత్, అరవింద్ జైలు లో కొండ రాళ్ళు కొడుతూ మాట్లాడుకుంటున్నారు.

రజని : నువ్వెలా జైలు కొచ్చావు బ్రదర్ ?

అరవింద్ : నేను గోవిందా ప్రింటింగ్ ప్రెస్ లో దొంగతనం చేసి నోట్ల కట్టలతో దొరికిపోయాను

రజని : ఆ ప్రెస్ ఓనర్ ను నేనే, దొంగ నోట్లు అచ్చువేసి దొరికిపోయాను

వడ్డీ

*
వడ్డీల వెంకన్న బోనులో నిలబడి ఉన్నాడు , జడ్జ్ గారు తీర్పు చెబుతున్నారు ,

"ఇంతకుముందు మూడు నెలల క్రితం, క్రెడిట్ కార్డుల వాళ్ల కంటే ఎక్కువ వడ్డీ లాగి అప్పుల వాళ్ళను ఏడిపించినందుకు నీకు రెండు నెలలు శిక్ష వేసాను .మళ్ళీ రెండోసారి నీమీద కేసు వేసారు .కాని సాక్ష్యాలు సరిగా లేనందువల్ల నిన్ను వదిలేస్తున్నాను .ఇకనైనా సరిగా బతుకు "

విన్న వెంకన్న కంగారు పడుతూ ,

"జడ్జ్ గారు , దయచేసి నన్ను వదలద్దు . కనీసం వారం రోజులైనా శిక్ష వేయండి "

"ఎందుకు " అడిగారు జడ్జ్ గారు .

"ఖైదీలకు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకొని వెడతాను సార్ "

రంగు మారింది

*
తాయారమ్మ , సుందరి తో ,

"ఏమే సుందరి ,మీ ఆయన మొన్నటి వరకు నల్లగా ,నిఖార్సైన రంగుతో మెరిసిపోయేవాడు ,ఇప్పుడు తెల్లగా కనిపిస్తున్నాడు , ఏమన్నా ఒళ్ళు తేడా చేసిందా ? "

"లేదు తాయారు , ఆయన మొన్నటి వరకు బొగ్గుల షాప్ లో పనిచేసేవాడు ,ఇప్పుడు పిండిమరలో పనిచేస్తున్నాడు ,అంతే "

పేకాట లాభం

*
పేకాట పాపారావు తన ఆఫీస్ లో కొత్తగా వచ్చిన కొలీగ్ గుర్నాధంను , పేకాట క్లబ్ కు ఒక రోజు బలవంతం చేసి లాక్కెళ్ళాడు.

గుర్నాధం మొదటి రోజు భయంతో పాపారావు కు వెనగ్గా దూరంగా కూర్చొన్నాడు .రెండో రోజు పక్కన చేరాడు .మూడో రోజు ముక్క కలిపాడు .ఆట సాగింది . వెయ్యి పోయింది .

క్లబ్ మూసిన తరువాత తప్పక ఇంటికి బయలుదేరుతూ పాపారావు ,

"గుర్నాధం గారు , పేకాటలో వెయ్యి రూపాయిలు పోయిందని తెలిస్తే చెల్లెమ్మ ఇంట్లోకి రానీదన్నారు కదా ,ఈ వెయ్యి ఉంచండి .రేప్పొద్దున తిరిగివ్వవచ్చు "

"పాపారావు గారు , ఇంకో వెయ్యి కూడా ఇవ్వండి , పేకాట లో లాభం వచ్చిందని మా ఆవిడకు చెబుతాను "

వందేళ్లు

*
రమాకాంతరావు అదేదో టీవీ లో "ఆరోగ్య చిట్కాలు " కార్యక్రమం కోసం ,

98 ఏళ్ల రామయ్య గారిని ఇంటర్వ్యూచేసాడు .

ఆయన దగ్గర సెలవు తీసుకొంటూ ,

"రామయ్య గారు , మరో రెండేళ్ళ తరువాత ,మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను "

రామయ్యగారు , అతన్ని ఎగాదిగా చూస్తూ ,

"ఆరోగ్యం గానే కనపడు తున్నారు ,రెండేళ్ళ తరువాత తప్పకుండా కలవగలరు " అని భరోసా ఇచ్చారు .

యవ్వన గుళికలు

*
సందు చివర మెయిన్ రోడ్డు మీద ఓ కోయదొర మూలికలు అమ్మటం చూసి రామనాధం , పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు .

కోయదొర ఓ మూలికతో చేసిన గుళికలు చూపించి ,

"ఈ గుళికలు వాడారంటే 40 ఏళ్ల వయసున్న మీరు,పాతికేళ్ళ కుర్రాడిలా మారి పోతారు "

"ఆ వయసులోనే నాకు పెళ్లి అయ్యింది .20 ఏళ్ల వయసు వచ్చే గుళికలు ఏమీ లేవా "ఆశగా అడిగాడు రామనాధం

అనుమానం

*
"నిజం చెప్పు ఈ లెటర్ ఎవరు రాసారు నీకు ? " కోపంగా గద్దిస్తూ అడిగాడు రామనాధం , సరోజను .

" మా బావ రాసాడండి " వణుకుతూ బదులిచ్చింది సరోజ

"మరి మీ బావనే కట్టుకోపోయావా ? "

"అదే చేసేదాన్ని .కాని వాడు ,మీ కంటే పెద్ద అనుమానపు పీనుగ "

రెండు కార్లు

*
రంగనాయకులు కొత్త కారు కొన్నాడు . పాతకారు అమ్మకానికి పెట్టాడు .మిత్రుడు హరి అడిగాడు ,

"పాత కారు ఎందుకు అమ్మేస్తున్నావు ? "

"దాన్లో అన్ని పార్ట్ లు శబ్దాలు చేస్తున్నాయి . ఒక్కటి తప్ప "

"ఆ ఒక్క పార్ట్ ఏమిటి ? "

" హారను "

" కొత్త కారు ఎలా ఉంది ? "

" అన్ని పార్ట్ లు చక్కగా పని చేస్తున్నాయి . ఒక్కటి మాత్రం బాగా వింత శబ్దాలు చేస్తోంది "

" అదేమిటి ? "

" డిస్కో హారను "

జోక్యం

*
అర్ధ రాత్రి ఒంటి గంట సమయం ,

వెంకాయమ్మ ,భర్త సంగామేశాన్ని నెమ్మదిగా తట్టి నిద్ర లేపింది.చెవిలో చెప్పింది,

"ఏదో గోడకు కన్నం వేస్తున్న శబ్దంవస్తోంది . లేచి పిల్లిలా వెళ్లి చూసిరండి. మీరు పీల గొంతుతో అరవకండి .నేను అరుస్తాను గట్టిగా "

సంగమేశం అడుగులో అడుగు వేసుకుంటూ ,వెళ్లి చూసి వచ్చి చెప్పాడు ,

" ఎవడో దొంగాడు , పక్కింటి వాళ్ల గోడకు కన్నం వేస్తున్నాడు "

" ఇతరుల విషయాలలో మన జోక్యం మంచిది కాదు . ప్రశాంతం గా నిద్రపోండి " అంటూ గుర్రు పెట్టింది వెంకాయమ్మ

ఆదివారం ఆంధ్రజ్యోతి బ్లాగు లోకంలో నా నవ్వులాట

*
ఈ నెల 15 వ తేది ఆదివారం ఆంధ్రజ్యోతి నవ్య బ్లాగు లోకం లో నా నవ్వులాట బ్లాగు పై రివ్యూవచ్చింది .మీరు చూసారా ?.లేకుంటే
ఇక్కడ క్లిక్ చేయండి

రాసిన వారి పేరు నాకు తెలియదు . కాని నాకు తెలిసింది ఒక్కటే .రోజూ నా బ్లాగును ఓపిగ్గా చూస్తూ ,వ్యాఖ్యలతోను , తిట్టని మౌనం తోను నన్ను ఉత్సాహ పరిచిన మీ అందరిలో వారూ ఒకరు . వారి అభిమానానికి నా వేల నెనర్లు .

నాకు ఎల్లపుడు మీ ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తూ,

మీ నవ్వులాట శ్రీకాంత్

ఆయనే

*
"మనవాళ్ల మీద చిందులు తొక్కుతూ , అరుస్తూ , పోట్లాడుతున్నాడే ,ఆయన ఎవర్రా ? "

" ఆయనే ఆనంద రావు . ప్రముఖ యోగా గురువు , గొప్ప హాస్య రచయిత. "

కవి(తా) తాపం

*
పెద్దన్నగూడెం యువజన వారోత్సవాలలో యువకవి మధురకలం కాళీ బాబు , మద మత్తేభాల వంటి తన కవితలను ,కంచు కంఠంతో గంటనుండి ఆపకుండా గానం చేస్తున్నాడు . వింటున్న ఒక శ్రోత లేచినుంచొని స్టేజ్ వైపుకు వెళ్ళసాగాడు .

అతను బాగా ఎత్తుగా , కండలు తిరిగిన శరీరం కల్గి ఉన్నాడు .చేతిలో దుడ్డు కర్ర ఉంది .నిమిషానికి 60 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నాడు .అతను ఆ ఊరి వస్తాదు వీరభద్రయ్య .

రెండు అంగలలో స్టేజ్ పైకి ఎక్కి అటు ఇటు కోపంగా చూడసాగాడు .

అది చూసి కాళీ బాబు భయంతో, తన కవితా గ్రంధాలను అక్కడే వదిలి కాలికి బుద్ది చెప్పబోయాడు .

వీరభద్రం కాళీబాబును చెయ్యి గట్టిగా పట్టుకొని ,

" మీరు మీ పని కానివ్వండి .మిమ్మల్ని ఏమీ అనను .మీరు మా అతిధులు .నేను మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానించిన ఆ బేవకూఫ్, దగుల్బాజీ గాడి కోసం వెతుకుతున్నాను "

చేతిలో డబ్బులు

*
అన్ని కళలు ఉన్న సత్తి బాబు ,తెలిసిన ,తెలియని జబ్బులతో హాస్పటల్ లో చేరాడు .డాక్టర్ పరీక్షించి చెప్పాడు

"సత్తిబాబు, నువ్వు ఈ రోజు నుండి మందు కొట్టగూడదు ,సిగరెట్టు తాగ కూడదు .రోజుకు ఒక పూటే భోజనం చేయాలి .పేకాటకు ,రేసులకు అసలు వెళ్ళకూడదు .సినిమాలు చూడకూడదు "

"ఇవన్ని చేస్తే నాకు జబ్బుతగ్గి ఆరోగ్యం చిక్కుతుందంటారా ? "

" ఇవి నీకు జబ్బు తగ్గటానికి కాదు .ఈ పనులన్నీ చేస్తే నీ దగ్గర నా ఫీజుకు సరిపడా డబ్బు ఉంటుంది .ఆ తరువాత నా ట్రీట్మెంట్ మొదలు పెడతాను "

భీష్ముని పునరుద్ధానం

*
భీష్ముడు చనిపోయిన 3 వ రోజు పునరుద్ధానం చెంది మనకు "విష్ణు సహస్ర నామాలను " మనకు

అందించారు.ఇది నిజం.ఈ విషయం,

"నేను అనేక విద్యల సమ్మేళనాన్ని. భారతీయ జ్యోతిషం, వీర విద్యలు, యోగ మరియు తంత్ర, ధ్యాన క్రియలు,ఇతర వైద్య విధానాలలో ఏళ్ళ తరబడి పరిశ్రమ నాకుంది " అని తన గురించి

చెప్పుకొన్న శ్రీ సత్య గారి ఆలోచనా తరంగాలు చెప్పాయి .వారు నిజమైన , నిజమౌతున్న జోస్యాలు అనేకం చెప్పారు .

వారి ప్రకారం భీష్ముని మరణం మాఘ శుక్ల అష్టమి(భీష్మ అష్టమి ) రోజు జరిగింది .


విష్ణు సహస్రనామం మాఘ శుక్ల ఏకాదశి (భీష్మ ఏకాదశి ) రోజు అనుగ్రహించ బడింది .

మరణం పోస్టు ఈ నెల ఏడున ,నామం పోస్టు ఈ నెల ఆరున వచ్చాయి .

దీనివల్ల ఇంతవరకు మనకు తెలియని భీష్ముని పునరుద్ధానం గురించి మనం తెలుసుకొనే అవకాశం కలిగింది .

నీతి : సమన్వయము లేని జ్ఞానం , బొంగరము లేని తాడు లాంటిది

నీకు పెళ్లి అయిందా ?

*
రామారావు చచ్చి స్వర్గం ముందున్న గేటు ఎదురుగా నిలబడి కాలింగ్ బెల్ కొట్టాడు . లోపలనుండి మాట వినపడింది

" నీకు పెళ్లి అయిందా ? "

"సీతారత్నం తో నాకు పెళ్లైంది "

"నీ పాపాలకు శిక్ష భూలోకంలో ముందే అనుభవించావు. లోపలకు రా "

రామారావు ఆనందంగా లోపలికి వెళ్ళాడు .

కాసేపాగి మెయిన్ గేటు ను అటు- ఇటు లాగుతున్న శబ్దం వినిపించింది .లోపలి నుండి దేవదూత పలికాడు ,

"నీకు పెళ్లి అయిందా ? "

" నాకు ఇద్దరు భార్యలు " చెప్పాడు కాంతారావు .

"నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలకు స్వర్గం లో చోటు లేదు .వెంటనే ఇక్కడనుండి వెళ్ళిపో "

కోతుల బ్లాగింగ్

"కోతి నుండి మనిషి పుట్టాడు" .డార్విన్ నిజమే చెప్పాడు .లక్షల ఏళ్ల పరిణామం తరువాత కూడా మనలో ఆ మూలాలు మిగిలే ఉన్నాయి .


ఆనగనగా కొన్ని అనామక కోతులు ,


అవి అసూయ అనే కల్లు తాగాయి ,సాటి బ్లాగర్ల కున్న పేరు ప్రఖ్యాతులు వీరి కాళ్ళలో ముళ్ళుగా గుచ్చుకున్నాయి.ఆత్మ స్తుతి , పర నింద అనే
భంగు మనసుకెక్కింది.మెదడుకెక్కింది.చివరిగా అసభ్య పదాలనే నిప్పులపెనం పై కూర్చున్నాయి .


ఇన్ని జరిగిన తరువాత అవి ఉరికే ఉండటం కష్టం.తెలుగు బ్లాగుల వనం లోకి ప్రవేశించాయి.


గోల చేసాయి.భయపెట్టాయి.తూలనాడాయి.తూలి పడ్డాయి.పరిమళ పుష్పాలను కాలి క్రింద చిదిమేశాయి.వేరు వేరు చెట్ల కొమ్మలను రాపాడించి , వాటి మధ్య అగ్గి పుట్టించాయి.అసభ్య పదాలతో దూషించాయి.


ధ్వంస రచన హింసతో................ , మనో హింసతో.................... ,


ఏం చేయాలి మనం ?


నిలిచి పోరాడుదామా,పారిపోదామా ?,


పోనిలే అనుకుందామా , పోరు చేద్దామా ?


మన కలాల గళాలకు ,మన అనుభవాల దొంతరలకు , పంచుకొనే
అనుభూతులకు,పెంచుకొనే జ్ఞానానికి ఇక మనం వీడ్కోలు చెబుదామా?


నా మనసులో మాటగా ,


1.మనందరం కలసి కట్టుగా నిలిచి ,వాటిని పట్టి బంధిద్దాం. సుద్దులు
చెబుదాం.మత్తు వదిలితే సరే , లేకుంటే కట్టడి చేద్దాము.కాదంటే తోకలు కట్ చేద్దాం .


2.వారి చింతలు తీరుద్దాం . ప్రతి కోతికి రెండు చింతలుంటాయి. ఒకటి తనకు లేదని చింత , రెండు పక్క వాడికి ఉందని చింత . వారికి సరైన అవగాహన నిచ్చి చూద్దాం . మారకుంటే మూర్ఖులని దూరమౌదాము వారికి.


౩. ఎవరో తెలీనప్పుడు, అసభ్యపు రాతలు విషమని తెలిసి దూరంగా ఉందాము .ప్రోత్సాహం వల్ల దుర్మార్గం పెరుగు తుంది .


4. ఎవరైనా మనకు ఏదైనా ఇస్తే , మనం కాదంటే , ఆ వస్తువు ఇచ్చిన వారిదే అవుతుంది . కాదనండి కాపురుష వచనాలను.


5.మన ప్రతి వెనకడుగు, వారు ఆక్రమణకు మరో ముందడుగుగా మారుతుంది. ఆ అవకాశం వారికి ఇవ్వద్దు


6. మీ బ్లాగుకు మీరే అన్ని . ఇతరుల అభిప్రాయాలు వినండి . నిర్ణయం మీరు తీసుకోండి .


కోతుల దాడి లో బాధ పడిన ప్రతి ఒక్కరికి ,నా బాసట ఎల్లపుడూ అందించగలనని వినయంగా తెలియజేస్తున్నాను.

బిచ్చగాడి దినం

*
అడుక్కున్న అర కప్పు హార్లిక్స్ తో రోజు మొదలు పెట్టాడు బిక్షపతి .తను అడుక్కొనే రోడ్డు లోకి అడుగులు వేసాడు వడివడిగా .


ఓ ఇంటి దగ్గర ,

ఆ ఇంటి ఇల్లాలు ,పాలవాడి మీద అరుస్తోంది ,

"పాలేందుకు లేటుగా వచ్చాయి ? "

"ఏం చెప్పనమ్మా ! పంపుల్లో నీళ్లు లేటుగా వచ్చినాయి "

" సరే ,ఏడువు " అంటూ లోపలికి వెళ్ళబోయింది .బిక్షపతి 70 mm dts సౌండ్ లో అరిచాడు ,

" అమ్మా ! ధర్మం చేయి తల్లీ "

ఆమె పరిశీలనగా బిక్ష పతిని చూసింది . ఆప్యాయంగా అడిగింది

"క్రితం వారం కడుపు నిండా అన్నం పెట్టింది నీకే కదా , ఎలా ఉన్నావు ? "

"నిన్నటి నుండే కొద్దిగా కోలుకున్నాను . ఓ ముద్ద పెట్టండి చాలు "

అక్కడ నుండి కదిలి రెండిళ్ళ అవతల ఉన్న , పేకాట పాపారావు ఇంటిముందు అరిచాడు

" ఓ 10 రూపాయలు ఇస్తే కడుపునిండా అన్నం తింటా సార్ "

"ఇస్తాగాని , ఈ డబ్బు తో పేకాట ఆడతావో , అన్నం తింటావో గ్యారంటీ ఏమిటి "

ముక్కలు కలుపుతూ అడిగాడు పాపారావు .

"తప్పకుండా అన్నమే తింటాను సార్ , పేకాట ఆడటానికి నా జోలె లో సరిపడా
డబ్బులు ఉన్నాయి " అంటూ,పాపారావు చేతిలో డబ్బులు వేగంగా తీసుకొని ముందుకు వెళ్ళాడు .

వరహాలయ్య కొట్టు ముందు ఆగాడు .వీడిని చూస్తూనే అతను


"ఇంకా బోణీ కాలేదు , వెళ్ళు , వెళ్ళు " అన్నాడు

"ఇంద , ఈ పావలా తీసుకొని , ఓ బీడీ ఇవ్వు , తరువాత ఎంత ఇస్తావో చెప్పు"
అడిగాడు పావలా తీస్తూ భి.పతి .

అక్కడ ఓ రూపాయి సంపాదించి , మరో సందు లోకి అడుగుపెట్టి ఓ ఇంటి ముందు ఆగాడు .అప్పుడే ఇంటిలో నుంచి ఎర్ర చొక్కా వేసుకొని ఓ పెద్దాయన బయటకు వచ్చి , వీడిని చూసి శకునం బాలేదని లోపలికి వెళ్లి ,మళ్ళీ 5 నిమిషాలకు బయటకు వచ్చాడు .

బిక్షపతి అక్కడే ఉన్నాడు .పెద్దాయన తప్పదని రెండు రూపాయలు ఇచ్చి ,

"అడుక్కున్నదంతా ఏం చేస్తావోయ్ " అని అడిగాడు

"తోటి బిచ్చగాళ్ళకు దానం చేస్తాను " సమాధానం చెప్పాడు భిక్షపతి .

ముచ్చట

*
ఆది లక్ష్మికి భర్త నారాయణరావును భయపెట్టాలని ముచ్చట కల్గింది .రాత్రి 11 గంటలకు ఇంటి కొచ్చి తలుపు తట్టాడు ఆ అమాయకుడు ,

తలుపు హఠాత్తుగా తెరుచుకుంది .లక్ష్మి మొహం చుట్టూ రగ్గు కప్పుకొని ,గడ్డం క్రింద టార్చ్ లైట్ ఫోకస్ పెట్టుకొని పెద్ద పెట్టున దెయ్యంలా అరుస్తూ ఎదురు పడింది .


ఆ దెబ్బకు భయపడి , క్రింద పడ్డాడు మొగుడు . కాసేపటికి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ,పీల గొంతుతో అడిగాడు ,

"నువ్వు ఎవరివి ? "

" నేను దెయ్యాన్ని " అరిచింది ఆదిలక్ష్మి .

"సరే అయితే , ఇంకా మా ఆవిడేమోనని హడలి చచ్చాను "

పుంజు కూత

*
సెయింట్ సిండ్రెల్లా గ్రామర్ స్కూల్ స్టూడెంట్ మురుగేష్ , తన డాడీ తో కలిసి మొదటిసారి తన తాతగారి పల్లె , వెల్లటూరుకు వేసవి సెలవులకు వెళ్ళాడు.ఉదయాన్నే పెరట్లో గేదెలనుండి పాలుపితకటం చూసి అర్ధం కాక డాడీ ని,

"డాడీ ! వాళ్ళేం చేస్తున్నారు ? "

" వాళ్లు పాలు పితుకుతున్నారు "

" పాలు పాకెట్ల నుండి కదా వచ్చేది ,గేదెల లోపల పాకెట్లు ఉన్నాయా ? "

వాడికి అర్ధం అయ్యేట్లు చెప్పేసరికి సాంబశివ రావు కి తల ప్రాణం తోకకొచ్చింది.

కాసేపాగి , అటు ఇటు తిరిగి వచ్చి మురుగేష్ అడిగాడు మళ్ళీ ,

"డాడీ ! కొంచం ఎత్తుగా వెనక గోడకు అతికించి ఉన్నాయే ,అవి ఏమిటి ?"

"నాయనా , వాటిని పిడకలు అందురు .అవి పశువుల పేడతో తయారగును .
వీటితో పొయ్యి వెలిగించు కొంటాము "

"సరే డాడీ , అయితే గేదెలు , ఆవులు గోడెక్కి ఎలా పేడ వేసాయి ? "

మరోసారి విజ్ఞాన సర్వస్వం 3 వ బైండు , 16 వ పుట రీలు వేయబడింది .

అలా ఓ నాలుగు రోజులు గడిచాయి .

ఐదో రోజు పొద్దున్నే ఐదు గంటల ఐదు నిమిషాలకు డాడీ ని తట్టి లేపాడు గేష్

"డాడీ ! "కొక్కొరోకో " అని రోజూ కోడిపుంజు పొద్దున్నే అరిచి మన నిద్ర డిస్టర్బ్ చేస్తుందే ?"

"అది దాని అలవాటు బాబూ, దాని కోడి లేవకనుండే ,తను చెప్పాలనుకున్నదంతా ముందే చెప్పేస్తుంది "

చెక్క పాట

*
రాత్రి 11 గంటల సమయం.ఆఫీసులో ఒళ్ళు పులిసేలా పనిచేసిన కుటుంబరావు పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు.అతని పక్కనే అర్ధాంగి ధనలక్ష్మి కీ-టీవీ " చెక్క పాట " ప్రోగ్రాం ను కళ్ళు ఆర్పకుండా,చెక్కలా బిగిసిపోయి తదేకంగా లీనమై చూస్తోంది.


ఇప్పుడో చిన్న బ్రేక్ అని యాంకర్ ,హనుమంతుని చూసి అరిచిన లంఖిణిలా మధ్యలో కేకపెట్టినప్పుడు ఉలిక్కిపడి లేస్తున్నాడు కుటుంబరావు.

ప్రోగ్రాం లో కొత్త పాటగాడు గోలబాలు స్టేజ్ ఎక్కాడు .అతన్ని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కదలకుండా రంగు తాళ్ళతో కట్టేసారు.తల కదలకుండా స్పాండిలైటిస్ కు వాడే పట్టీ ఒకటి మెడకు కట్టారు .

జడ్జిలు అందమైన అనుభవం సినిమా లోని "కుర్రాళ్ళోయ్ ,కుర్రాళ్ళూ "పాట తో ఆడుకోమన్నారు .

గోలబాలు అందుకుందామని ట్రై చేసాడు.గొంతులోంచి ఉత్త గాలే వచ్చింది .

ధనలక్ష్మి కి టెన్షన్ పెరిగింది.

అంతలో "బ్రేక్ ",అనుకోని పవర్ కట్ వల్ల.

తిక్కరేగిన ధనలక్ష్మి కరంట్ వాడిని అటు ఏడు తరాలు ,ఇటు ఏడు తరాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.ఓ పది నిమిషాలకు మొగుడిచ్చిన మంచినీళ్ళు తాగి తలకి కూల్ కూల్ పట్టించి అంది,

"ఎవరో మహానుభావుడు టీవీ కనిపెట్టి మంచి పని చేస్తే,కరంట్ వాళ్ళు మన ప్రాణం తీస్తున్నారు "

"టీవీ కనిపెట్టిన వాడికంటే,మరో గొప్పోడు ఉన్నాడు " అన్నాడు కుటుంబరావు

"ఎవరు ? " ఆసక్తిగా అడిగింది ధనం

"దాన్ని కట్టేయటానికి స్విచ్ కనిపెట్టినవాడు "

"మీకెప్పుడూ రేడియో ,టీవీలు నచ్చవు.ఏమంత కోపం వాటిమీద ? "

"ఎందుకంటే అవి ఎప్పుడూ ప్రముఖుల మరణాల గురించి వార్తలు చెబుతాయి, ప్రముఖుల జననాల గురించి చెప్పవు "

టికెట్ ప్లీజ్

*
కండల వీరుడు వీరభద్రానికి చాలా టెన్షన్ గా ఉంది.ఎక్కాల్సిన బస్సు మిస్సైంది.

టైముకు వెళ్ళకపోతే జిమ్ము ఓనర్ వీర కుమ్మేస్తాడు.దెబ్బలైతే తట్టుకోవచ్చు,
కానీ ఇచ్చే కాస్త జీతం కట్ చేస్తే ,కొనుక్కోవటానికి రోజుకో కుళ్ళు కోడి గుడ్డు
కూడా రాదు.తనకు ఇష్టమైన కండలు ఐస్ క్రీంలా కరిగి పోతాయి.

ఇంతలో 11 వ నెంబర్ బస్సు,బస్ స్టాప్ కు 60 అడుగుల దూరంలో ఆగింది .
పరిగెత్తి బసెక్కి ఫుట్ బోర్ద్ పై నిలబడి,ఆయాసం తీర్చుకొనేలోగా ,కండక్టర్ వచ్చి
టికెట్ అడిగాడు .

వెంటనే వీరభద్రం తన కుడిచేతిని,ఎడమచేతి కండలపై వేసి టికట్ తీసుకోనన్నాడు.
బక్క పలచటి ఆ కండక్టర్ భయపడి మారు అడుగలేదు.
రెండో రోజు ,మూడో రోజు ఇదే స్టోరీ రిపీట్ అయ్యింది .

నాలుగో రోజు వీరభద్రం బస్సెక్కగానే ,రోడ్డు మధ్యలో బస్ ఆపి,గూండాలా ఉన్న
డ్రైవర్ వీరభద్రం చొక్కా పట్టుకొని ఉరిమాడు "ఏం నకరాలు చేస్తున్నావు ?,
రోజూ టికెట్ ఎందుకు తీసుకోవు ? " .

వీరభద్రం చొక్కా విడిపించు కొంటూ అడిగాడు వినయంగా, భయంగా ,

" బస్ పాస్ ఉన్నా టికెట్ తీసుకోవాలా సార్ "

దురదృష్టవంతుడు

*
ఓ జీవశాస్త్రజ్ఞుడు తన పరిశోధన కోసం కొండలు ,గుట్టలు ,గుహలు ,గ్రామాలు
పట్టి తిరుగుతున్నాడు.చివరిగా తోకతో బతికిన మనిషి ఆనవాలు కనుగొనాలని

ఆయన ప్రయత్నం.కాళ్ళకు కట్టుకున్న బలపాలు అప్పటికి 20 కట్టలు
అయిపోయినాయి.ముందురోజు కొండ గుహలో గబ్బిలాల కంపుతో పడిన
ఇబ్బందిని గుర్తుచేసుకొని ,తనతో పాటు వచ్చిన గైడ్ ను అడిగాడు ,

" ఈ రోజు మనం చూడబోయే గుహలో గబ్బిలాలకంపు ఉంటుందా ? "

" ఉండదు సార్ " చెప్పాడు గైడ్ .


"ఏం ,ప్రభుత్వం చక్కగా నిర్వాహణ చేస్తోందా ? "

"లేదు , గుహలోని పాములే గబ్బిలాలను తినేస్తాయి "

దాంతో భయపడి ఆయన , దగ్గరలోని ఓ అందమైన ,పచ్చని ,పరిశుభ్రమైన
గ్రామం లోకి అడుగుపెట్టాడు.దాహం తీర్చుకొని గ్రామపెద్ద శంకర్ నాయక్ ని
గ్రామం గురించి వివరాలు అడిగాడు

" ఈ ప్రాంతం లో ప్రజలు ఎక్కువగా ఏ రోగాలతో బాధ పడుతుంటారు ? "

"మా ఉళ్ళో రోగాలు లేనే లేవు " అన్నారు శంకర్

"నిజంగానా "

"మేము అందరం పూర్తి ఆరోగ్యంగా ఉంటాము .గత 14 ఏళ్లగా మా గ్రామంలో
ఒక్కరు కూడా చనిపోలేదు "

" అదెలా సాద్యం ? " నోరు తెరిచాడు శాస్త్రజ్ఞుడు .

"క్షమించాలి .రెండు ఏళ్ల క్రితం ఒక మనిషి చనిపోయాడు . అదీ ఆత్మహత్య
చేసుకొని "

" ఆ వ్యక్తి గురించి వివరాలు చెప్పగలరా ? "

"ఆయన మా ఊరి డాక్టర్ రమేష్ గారండి.దరిద్రం భరించలేక ఉరి వేసుకున్నాడు "

రైతు కష్టాలు

*
ప్రకాశం జిల్లా రైతు సీతయ్య ఇంట్లో మిగిలిన చివరి పత్తిపువ్వు వత్తి
వెలిగించుకోవటానికి చుక్క నూనె లేదు.పుల్లలు లేని అగ్గిపెట్టెతో ఆఖరిపిల్లాడు
రైలాట ఆడుకుంటున్నాడు.అమావాస్య కావటంతో ఇంటికప్పు జల్లెడైనా ,
దీపాల కాంతిని సుడిగాలి మింగేసినట్లు ,నక్షత్రాల మసక వెలుతురుని ,
చీకటి తినేస్తోంది .ఆ పక్కనే ఉన్న కాంట్రాక్టర్ కనకారావు ఇంటి 3 వ అంతస్తు
లో ,చల్లని పాలరాతి ఏసీ గదిలో ఏకైక పుత్ర రత్నం సీలింగ్ కు అలంకరించిన
ఫ్లోరోసెంట్ నక్షత్రాలను చూస్తూ హాయిగా నిద్రలోకి జారుకొంటున్నాడు.

ఇదంతా ఆలోచిస్తున్న సీతయ్యకు మళ్ళీ బాధ కలిగింది .

"నన్ను నా పక్కింటివాడిలా ధనవంతుడిని చెయ్యి"

దేవుని ప్రార్ధించాడు , పొద్దున్న నుండి 1001 వ సారి.

రోజులు ముందుకు వెళుతున్నాయి .సీతయ్య గొంగళి అక్కడే ఉంది .

ఆపకుండా దేవునికి అడుగుతూనే ఉన్నాడు ,

"నేను నీ భక్తుడిని , పక్కింటోడు నీకు ప్రార్ధన కూడా చేయడు.నేను నిన్ను
ఎప్పుడూ తలుస్తూనే ఉంటాను .అయినా వాడికి అన్నీ ఇచ్చావు .నేనేం
తప్పు చేశాను ?"

దేవుడిలా పలికాడు ,

"భక్తా సీతయ్యా ! నువ్వు ఎప్పుడూ నీ కోరికలతో జోరీగ లాగా చెవిలో

నస పెడుతుంటావు .వాడు ఎప్పుడూ ఆ పని చేయలేదు "

ఉత్తమ పౌరుడు

*
రాజమండ్రీ మున్సిపాలిటీవారు ఈసంవత్సరం "ఉత్తమ పౌరుడు "ని నిర్ణయించి
సన్మానం చేయాలనుకొన్నారు .ఉరంతా చాటింపు వేయించారు .20 బస్తాల
ఎంట్రీలు వచ్చాయి .జడ్జీలు కష్టపడి ఓ పది ఎంట్రీలను చివరి ఎంపిక కోసం
ఎన్నిక చేసారు . ప్రతి జడ్జి ఎవరికీ వారు తమకు నచ్చిన వ్యక్తి పేరు మూసిన
కవర్లో ఉంచారు . అభ్యర్దుల పేరు, వివరాలు రహస్యంగా ఉంచారు నిర్వాహకులు .

ఎన్నిక రోజు :
మూసిన కవర్లు తెరిచారు .10 మందిలో 8 మంది జడ్జీలు ఒకే పేరు ఎంపిక
చేసారు . ఆ వ్యక్తి తన అప్లికేషన్ లో ,అవార్డ్ తనకు ఎందుకు ఇవ్వాలో
ఇలా ప్రకటించారు,

"గత 10 ఏళ్లుగా నేను చాలా నియమంగా జీవిస్తున్నాను .నేను పొగ తాగాను ,
మందు ముట్టను .పేకాట ఆడను .నేను కట్టుకున్న దాన్ని తప్ప వేరే ఆడదాన్ని
కన్నెత్తి కూడా చూడను .నేను కష్టజీవిని .పేచీకోరును కాదు .పై వారికి
విధేయుడను.నేనెప్పుడు సినిమాలు చూడలేదు .నాటకాలు చూడలేదు .రోజు
రాత్రి తొందరగా నిద్రిస్తాను .ఉదయం సూర్యునితో పాటు మేల్కొంటాను . "

నిర్వాహకులు ఎంపికైన ఆ అభ్యర్ధి పేరు , వివరాలు ప్రకటించారు :

పేరు : రంగస్వామి

వివరాలు : కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న సెంట్రల్ జైలు జీవితఖైది
.

అతిధి' మర్యాద

*
లంబోదరరావు భాగ్యనగరం చూడాలని అత్తిలి నుండి బయలుదేరాడు.
ఉదయాన్నే బస్సు దిగి స్నేహితుని ఇంటి తలుపు తట్టాడు . చాలా ఏళ్ల
తరువాత వచ్చిన ఫ్రెండ్ కు ఆనందం గా స్వాగతం పలికారు కుచేల రావు ,
అతని భార్య సంతాన లక్ష్మి .

కుచేల రావు తన జేబుకు చిల్లు పడేంత వరకు ,సిటి అంతా తిప్పి
చూపించాడు. స్వయంగా కొన్ని చూసాడు లంబోదర రావు ఒక్కడూ.

అలా 3 రోజులు ఆనందంగా గడిచాయి అందరికి .మరో 4 రోజులు మాములుగా
వెళ్ళాయి. తరువాత 3 రోజులు భారంగా మారాయి ఇంటివారికి .ఇంకో నాలుగు
రోజులకు కుచేల రావు ఓపిక నశించి ,

"ఒరేయ్ లంబు ! ఇంటిదగ్గర చెల్లి , పిల్లలు నీ గురించి బెంగపడి ఉంటారు కదా "
అన్నాడు .

"నాకు బెంగగానే ఉందిరా .రెండు రోజుల నుండీ వాళ్ళూ తెగ నస పెట్టేస్తున్నారు.
నేను 10 నిమిషాల ముందు డిసైడ్ అయ్యాను ఈరాత్రి బస్సుఎక్కటం గురించి.

ఈ విషయం మా వాళ్లకు చెప్పాను .నస ఆపారు.నువ్వు హాపీగా నిద్రపో .
నేను తలుపు తీస్తాలే , పొద్దున్నే వాళ్ళకి "