లెక్క

*
లెక్కల మాస్టారు పరశురాం గారు పిల్లలకు రోజూవారి ఉదాహరణలతో పాఠం చెబుతున్నారు ,
రెండో తరగతి పిల్లలకు .

" ఏరా గోపీ ! చెప్పు , మా ఇంట్లో పది గేదెలు ఉన్నాయి,వాటిలో నాలుగు గేదెలు నీకిస్తే
ఏమౌతుందో చెప్పు "

" నేను చదువు ఆపేసి వాటిని మేపాల్సి వస్తుంది మాస్టారూ "

ఉద్యోగం

*
డిటెక్టీవ్ యుగంధర్ ,తన దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేస్తున్నాడు .చురకత్తుల
సీతాపతి రావు ఇంటర్వ్యూ కి వచ్చాడు .

యుగంధర్ కొన్ని ప్రశ్నల తరువాత అడిగారు ,

" మహాత్మా గాంధీని ఎవరు చంపారు ? "

ప్రశ్న విన్న సీతాపతి ఆనందం తట్టు కోలేకపోయాడు .దిగ్గున కుర్చీలోంచీ లేచి యుగంధర్
గారికి బలంగా షేక్ హ్యాండ్ ఇచ్చి,

" మీరు నాకు ఉద్యోగం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు .గాంధీ ని ఎవరు చంపారో నేను
తప్పక కనుక్కుంటా సార్ " అన్నాడు .

జైలు

*
బోనులో ముద్దాయి రాజన్న ని ప్రశ్నిస్తున్నాడు జడ్జ్ ,

" నువ్వు వారం క్రితం జైలు నుండీ తప్పించుకొని ఎందుకు పారిపోయావు ? "

" అప్పుడు రంగి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తోంది , అందుకని "

" అయితే , మరి నువ్వు నిన్న ఎందుకు లొంగి పోయావు ? "

" నాకు స్వాతంత్రం కావాలనిపించి " చెప్పాడు రాజన్న

సహాయం

*
పని మనిషి షర్మీలా ఒగరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యకాంతం తో చెప్పింది ,

" అమ్మగారూ , మన సందు చివర , ఎవరో ముగ్గురు ఆడవాళ్ళు మీ అత్తగారిని
కొడుతున్నారమ్మా "

సూర్యకాంతం దిగ్గున లేచి షర్మీలాతో పాటు అక్కడికి పరిగెత్తింది . అక్కడి విషయం చూసి
అలాగే నిలబడిపోయింది .

" అమ్మా ! వెళ్లి సహాయం చేయండి " అంది ఆదుర్దాగా షర్మీలా

" నా సహాయం అక్కర లేదు , వాళ్ల ముగ్గురూ చాలు " అంది సూర్యకాంతం తాపీగా

నవ్వుల చిలకలు

*********************************************************************
ప్రశ్న : ఆశ్రమం లో పాలు తాగుతున్న బ్రహ్మచారి చనిపోయాడు ,ఎందుచేత ?

జవాబు : ఆవు హటాత్తుగా కూర్చోవటం వల్ల

*********************************************************************
శివ : అసాధ్యం అనేమాట నా నిఘంటువు లోనే లేదు

అవ్వ : కొనేటప్పుడే చూసుకోవాల్సింది. పుస్తకాల దుకాణం వాడు కొత్త పుస్తకం ఇస్తాడో ,లేదో ?

*********************************************************************

అడవి అంటుకుంది

*
నల్లమల అడవి లో ఓ మండు వేసవి కాలం చెట్ల రాపిడి వల్ల మంటలు రాజుకున్నాయి .అడవి
తగలపడి పోతోంది. దాన్నిచిత్రీకరించటానికి, తక్షణ వార్తా ప్రసారానికి కవి కిషోర్ వెళ్ళాడు .
కానీ అంతా పొగతో నిండిపోవటంతో సరిగా చిత్రీకరణ కుదరటం లేదు .వెంటనే ఆఫీసు కి
ఫోను చేసి తనకు ఒక హెలీకాఫ్టర్ కావాలన్నాడు .వాళ్లు అక్కడికి దగ్గరున్న గుట్ట మీద
పావుగంట లో హెలీకాఫ్టర్ ఉంటుందని చెప్పారు .

కవికిషోర్ గుట్ట దగ్గరికి ఆయాసపడుతూ జేరి ,అక్కడ సిద్దంగా ఉన్న హెలీకాఫ్టర్ ఎక్కి పైలెట్ కి
సూచనలు ఇచ్చాడు ,

" నువ్వు అలా ఉత్తరం వైపుకి పోనీయ్ , అక్కడ బాగా తగలబడుతున్న చోట కిందకి దింపు .
నేను వీడియో బాగా తియ్యాలి "

హెలీకాఫ్టర్ గాలిలోకి లేచింది .తగలబడుతున్న అడవి నడి నెత్తికి ఎక్కింది .అప్పుడు పైలెట్
అడిగాడు అనుమానంగా ,

" సార్ , మీరు వీడియో తియ్యాలంటున్నారుఎందుకు సార్ ? "

" నేను టీవీ 47 విలేఖరిని .వీడియో కాక ఏం తీస్తాను " విసుక్కోన్నాడు పైలెట్ పై కవికిషోర్

"మీరు మా పైలెట్ ట్రైనింగ్ ఆఫీసర్ కాదా ? " అడిగాడు పైలెట్ ఆందోళనగా

భయం

*
డాక్టర్ పూర్ణచంద్ ని , తొలి రాత్రి కబుర్లలో అడిగింది ,కొత్త పెళ్లి కూతురు కాత్యాయని ,

" ఏమండీ , మీ డాక్టర్లు , కొద్ది సీరియస్ కేసులకు కూడాఎరయై నాలుగు గంటలలో
ఆపరేషన్ చెయ్యాలని చెబుతుంటారెందుకు ? "

" దీంట్లో గొప్ప తర్కమేమీ లేదు , మేము ఒకవేళ రోగిని అలా వదిలేస్తే , వాడికి
మామూలు గానే తగ్గిపోతుందని మా భయం" నిజాయితిగా భార్య కు బదులిచ్చాడు పూర్ణచంద్

తెల్లగోడ

*
మహర్షి సదానందుల వారి ఆశ్రమం . ఈ మధ్యనే ఆశ్రమం లోని గోడలకు తెల్ల సున్నం వెల్ల
వేయించారు . వారికి ఇద్దరు శిష్యులు .ఒకరు శుకుడు ,అతనిది జ్ఞాన మార్గం .
మరొకరు రామదాసు, భక్తి మార్గానుయాయి .

ఒకరోజు ఉదయాన్నే శుకుడు ఆశ్రమం లోని తెల్లని గోడపై " సోహం " (అదే నేను ) అని
బొగ్గు తో రాసాడు . కాసేపటి తరువాత ఆ దారిన వెళుతున్న రామదాసు సోహం ముందు
"దా " కలిపాడు బొగ్గుతో .దాంతో ఆమాట " దాసోహం "(భగవంతునికి దాసుడను ) అయ్యింది .
ఆ తరువాత శుకుడు " స " కలిపాడు . ఈ సారి తన వంతుగా రామదాసు " దా " కలిపాడు .
అలా శుకుడు " స " ని , రామదాసు "దా " ని కలుపుతూ వెళ్ళారు . వారు బొగ్గు తో కొత్త
అక్షరం కలిపిన ప్రతిసారీ కొత్త కొత్త పదాలు , కొత్త అర్ధాలు పుట్టుకొచ్చాయి .

అవి :" సోహం " ,"దాసోహం " ," సదా సోహం " ," దాస దాసోహం ", సదా సదా సోహం ".

ఈ విషయాన్ని అంతా గమనించిన సదానందుల వారు ,శిష్యులిద్దరినీ పిలిచి చెప్పారు ,


"నాయన లారా , మీ పోటీలతో మీరు మసిబొగ్గుతో తెల్లని గోడని ఎందుకు పాడు చేస్తారు ?,
మీ మనసు మలినాలు అంటని తెల్లని గోడ లా ఉంటే ఏ మార్గమైనా మంచిదే .అలా కాక
మసిబొగ్గు పూసిన గోడలాగా ఉంటే అందులో జ్ఞానం గానీ , భక్తిగానీ ఏవీ నిలువవు "

అంతా నారాయణుడే

*
ఒక గురువు గారు తన శిష్యులతో అడవి గుండా పయనమై వెళుతున్నారు. వారి ఉపదేశం
ఇలా సాగుతోంది ,

" ఈ ప్రపంచంలోని ప్రతిదీ నారాయణ స్వరూపమే .నీలోనూ నారాయణుడు ఉన్నాడు ,
నాలోనూ నారాయణుడే ఉన్నాడు .పరమాణువు నుండీ పరమాత్మ వరకు అంతా
నారాయణుడే నిండి ఉన్నాడు .అందుచేత అన్ని జీవుల యందు సమ దృష్టి కలిగి ఉండాలి "

శిష్యులందరూ శ్రద్ధగా వింటూ నడుస్తున్నారు .ఇంతలో ఒక ఏనుగు భయంకరం గా ఘీంకరిస్తూ
అడవినంతటినీ అతకుతలం చేస్తూ వీరి వైపు దూసుకు రాసాగింది .

గురువు తో సహా అందరు శిష్యులూ పరుగెత్తి ఏనుగు బారిన పడకుండా దూరంగా దాక్కొన్నారు.
కానీ ఒక శిష్యుడు మాత్రం ఏనుగు కు ఎదురుగా అలాగే నుంచుని ఉండిపోయాడు.ఏనుగు అతన్ని
తొండంతో పట్టుకొని దూరంగా విసరివేసింది .ఏనుగు అక్కడ నుండీ వెళ్ళిన తరువాత మిగిలిన
శిష్యులు , గురువు గారు అతని చుట్టూ చేరి సపర్యలు చేశారు . కొంత తేరుకున్న అతను గురువు
గారిని అడిగాడు ,

"అయ్యా , మీరు అంతా నారాయణ స్వరూపమే అని చెప్పారు , నాలోనూ, ఏనుగులోను
నారాయణుడే ఉన్నపుడు ఏనుగు నన్ను ఎందుకు ఇలా చేసింది ? "

అప్పుడు గురువు గారు ఇలా బదులిచ్చారు ,

"నాయనా , నేను చెప్పింది నిజమే .నీలోను , ఏనుగు లోను నారాయణుడే ఉన్నాడు .నువ్వు
ఈ రెంటినే చూశావు .కానీ ఏనుగు వెనుక నుండీ "పారిపొండీ ,పారిపొండీ " అంటూ అరిచిన
మావటి నారాయణుడి మాటలు నీ చెవికెక్కలేదు . అందుచేతే ఇలా జరిగింది ."
(హిందూ వేదాంతము నుండీ గ్రహించబడినది )

షికారు

*
పరమపీనాసి పానకాలరావు, తన వయసొచ్చిన కొడుకు ఎవరో అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని
ఫైవ్ స్టార్ హోటల్ లోకి వెళ్ళటం చూశాడు .వాడు రాత్రికి ఇంటికి రాంగానే గుమ్మంలోనే
నిలేశాడు .

" ఏరా, ఎవత్తినో ఎక్కించుకొని ఫైవ్ స్టార్ హోటల్ లో దూరావు.డబ్బులెంత తగలేసి చచ్చావు?"

" ఐదువేలు నాన్నా "

" ఐదు వేలా ? " గుండె పట్టుకొన్నాడు పానకాలరావు .

" ఏం చెయ్యను నాన్నా , ఆ అమ్మాయి దగ్గర అంతే ఉంది మరి " చెప్పాడు పుత్రరత్నం .

నాస్తికుడు

*
మణిరత్నం బుర్ర మీసాలతో ,ఎర్ర కన్నులతో ఒక చిన్న సైజు రాక్షసుడిలా ఉంటాడు.
రమా బాల విద్యా మందిరం పిల్లల దురదృష్టం కొద్దీ , ఆయన వాళ్ళకి టీచరుగా
వచ్చాడు . ఒక రోజు క్లాసులో ,

" నేను నాస్తికుడిని. మీరు కూడా నాస్తికులేనా ? " అడిగాడు గంభీరమైన గొంతుతో
పిల్లల్ని .

పిల్లలకి నాస్తికుడు అంటే ఏమిటో తెలియదు .తాము కాదంటే ఏమంటాడో అని భయం.దాంతో
అందరి చేతులు ఒక్కసారిగా నింగికెగసే తారాజువ్వలలా పైకి లేచాయి . ఒక్క పిల్లవాడు
మాత్రం చెయ్యి ఎత్తలేదు .మణిరత్నం అడిగాడు వాడిని ,

" హరీ !నువ్వు నాస్తికుడివి కాదా ? "

" లేదు నేను నాస్తికుడిని కాదు , నేను హిందువుని "

" నువ్వు హిందువు వి ఎట్లా అయ్యావు ? "

" మా అమ్మ , నాన్న హిందువులు . వాళ్ళకి నేను పుట్టాను కాబట్టి హిందువునే "

" అది సరి కాదు . మరి మీ అమ్మ మూర్ఖురాలు,మీ నాన్న మూర్ఖుడు అయితే,

నువ్వు మూర్ఖుడివి అవుతావా ? " గద్దించాడు మణిరత్నం

" కానండి , అప్పుడు నేను నాస్తికుడిని అవుతాను " చెప్పాడు తొణక్కుండా హరి

సిగ్గు

*
అరవింద్ పనిపడి ఓ చిన్న టౌన్ కు వెళ్ళాడు. అక్కడ ఆకలేసి ఒక కాకా హోటల్ లో దూరి
భోజనం తెమ్మన్నాడు. భోజనం తెచ్చిన కుర్రాడి ముఖం లోకి చూస్తే ఏదో గుర్తొచ్చింది .కొంచం
పరిశీలనగా చూస్తే వాడు చిన్నప్పటి తన స్నేహితుడు గోపీ అని తట్టింది .వాళ్ల నాన్న వాడిని
" వేటగాడు " సినిమాచూసినందుకు కొడితే , ఇంటి నుండీ పారి పోయాడు .
అరవింద్ అడిగాడు ,

"ఏరా గోపీ , ఇట్లాంటి చోట పని చేయటానికి నీకు సిగ్గు అనిపించటం లేదూ ? "

"పనిచేయటానికి నేనేమి సిగ్గు పడటం లేదు, కానీ ఇలాంటి చోట భోజనం చేయటానికి మాత్రం
బాగా సిగ్గు పడతాను " చెప్పాడు గోపీ మనసులో మాట

కాడ్బరీస్ చాక్లెట్

*
రాత్రి భోజనం కడుపునిండా తిని భుక్తాయాసం తీర్చుకోవటానికి కాలనీ లో నడవటం
మొదలు పెట్టాడు నాగేశ్వరరావు. ఓ దీపస్థంభం క్రింద దేనికోసమో వెతుకుతూ కనిపించాడు
మిత్రుడు పరాంకుశం .

" అంకుశం , దేని కోసం వెతుకుతున్నావు ? "

" కాడ్బరీ ఫైవ్ స్టార్ చాక్లేట్ పడిపోయిందిరా "

" మనవడి కోసం కొనుక్కొని వెళుతున్నావా ? "

" లేదు , నేనే తింటూ వెళుతున్నా "

" డెబ్బై ఏళ్ళు వయసొచ్చి చాక్లెట్ తినటమేమిటీ ,కింద పడిపోయిందని వెతకటమేమిటీ,
నువ్వు మారవేరా ఎప్పటికీ ? "

" నేను వెతుకుతున్నది దాని కోసం కాదురా , దానిలో నా పళ్ళ సెట్టు ఇరుక్కొని
పడిపోయింది .దాని కోసం వెతుకుతున్నా "

సేల్స్ మాన్

*
రైళ్ళలో చిరుతిళ్ళు అమ్మటానికి మంచి తెలివి తేటలు , అనుభవం కల్గిన వ్యక్తులను ఎంపిక
చేస్తున్నాడో వ్యాపారి ,

వ్యాపారి : నీ పేరేమిటి ?

అభ్యర్ధి : వెంగళరావు

వ్యాపారి : నీకు అనుభవం ఉందా ?

అభ్యర్ధి : ఐదేళ్ళు నుంచీ ఈ పనిలో ఉన్నాను , కోస్తా లో అమ్మాకాలలో నేనే ఫస్ట్

వ్యాపారి : సరే , ఈ సంచీలో జీళ్ళు, ఆ సంచీలో బఠానీలు తీసుకెళ్ళి అమ్ముకురా .

అభ్యర్ధి : అలాగేనండీ

ఓ అరగంట తరువాత వెంగళరావు నీరసంగా రెండు సంచులు నిండుగా పట్టుకొని
తిరిగి తెచ్చాడు .అప్పుడు

వ్యాపారి : ఏరా, నువ్వు పోటుగాడిని అన్నావు , ఏం అమ్మలేక పోయావు ?

అభ్యర్ధి : నేను మీకు పొరపాటు చెప్పాను , నేను అమ్మటం లో రెండో వాడిని .
మీకు ఇవి అమ్మినవాడు మొదటివాడు నిజంగా .

దేవుడు లేడు

*
మహా శివరాత్రి నాడు , ఉరి మధ్య నున్న శివాలయం లో ,

" ఏరా రాఘవా ! నువ్వు ఈ మధ్య హేతువాదులతో చేరి దేవుడు లేడని అంటున్నావట,
నిజమేనా ? "

రాఘవ మాట్లాడలేదు. సుధాకర్ మళ్ళీ అడిగాడు ,

" ఇంతకీ నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా , లేదా ? "

రాఘవ మౌనంగా అక్కడనుండీ వెళ్లి పోయాడు . మరునాడు కూరల సంత లో కలిసాడు.
సుధాకర్ , రాఘవ ని నిలదీశాడు ,

" ఏరా , నిన్న నేనడిగిందానికి సమాధానం చెప్పకుండా వెళ్లి పోయావే ,ఇంతకీ నువ్వు
దేముడున్నాడని నమ్ముతున్నావా లేదా ? "

"నాకైతే నమ్మకం లేదు "

" మరి ఈ ముక్క నిన్ననే చెప్పచ్చు కదా ? "

" శివరాత్రి నాడు,ఆలయం లో దేవుడి ఎదుట నుంచుని ఆ మాట ఎలా చెప్పమంటావయ్యా ? "

డిన్నర్

*
రాఘవ రావు , లక్ష్మీపతి ఇంటికి మిట్ట మధ్యాహ్నంఅప్పుడు వెళ్ళాడు .వాకిట్లోంచీ కేకవేసాడు,


" లక్ష్మీపతీ , ఏం చేస్తున్నావు " అని


మూడేళ్ళ లక్ష్మీపతి పాప బయటకి వచ్చి ,


"అంకుల్ , నాన్న డిన్నర్ చేస్తున్నారు " అంది


" పాపా , నాన్న చేసేది లంచ్ , డిన్నర్ కాదు " అని అన్నాడు రాఘవ .

" మా నాన్న ఇప్పుడు తింటున్నది నిన్న రాత్రి వండిన అన్నమే అంకుల్, అందుకే అలా చెప్పాను"

విడాకులు వద్దు

*
సూరి , సుబ్బమ్మల విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది . జడ్జ్ గారు సుబ్బమ్మని అడిగారు ,

"సుబ్బమ్మా ! నువ్వు ఇంతకు ముందు వాయిదాలోనీ భర్త తో తెగతెంపులు చేసుకుంటానని
గట్టిగా చెప్పావు , ఇప్పుడేమో విడాకులు వద్దు , భర్తతో నోరు మూసుకొని కాపురం చేస్తాను
అంటున్నావు , ఎందుకు ఇంత మార్పు వచ్చింది ? "

" గత వారం మా ఇంట్లో టీవీ చెడిపోయింది . దాంతో సూరి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో
అర్ధమయ్యి బుద్ది వచ్చింది. "

హోటల్ బిల్లు

*
చిదంబరం , ఏకాంబరం కలిసి బేపార్క్ హోటల్ కు వెళ్ళారు .కడుపు నింపుకొని చేతులు
కడుక్కొంటూ చిదంబరం అన్నాడు ,

" అన్నా ,మనం ఎన్నిసార్లు హోటల్ కి వచ్చినా నువ్వే బిల్లు కడుతున్నావు.నాకు సిగ్గుగా
ఉంటోంది . ఈ సారి నేను ... "

" ఏంటీ, మన బిల్లు నువ్వు కడతావా ? " అచ్చెరువొందాడు ఏకాంబరం

" నా వాటా బిల్లు నేనే కట్టుకుంటాను "

క్షమ

*
వహిల్వాన్ భీమారావుని,పక్కింటాయన పలకరించాడు ,

" ఏం భీమారావు, వారం క్రితం నిన్ను ఘోరంగా పది మందిలో అవమానించిన ఆ సీతాపతిని
క్షమించి వదిలేశావని విన్నాను , నిజమేనా ! , అలా ఎందుకు చేశావు ? "

" వాడు నా కన్నా బలవంతుడు కాబట్టి " చెప్పి లోపలికి వెళ్లి పోయాడు భీమారావు .

మాతృ భాష

*
హరి వాళ్ల నాన్న ని అడిగాడు ,

" నాన్నా,మనం మాట్లాడే భాషని మాతృ భాష అంటారు, కానీ పిత్రు భాష అని ఎందుకు అనరు?"

" ఎందుకంటే , ప్రతి ఇంట్లో తల్లులే మాట్లాడు తుంటారు కాబట్టి "చెప్పాడు ఆ అనుభవజ్ఞుడు

జాతి గౌరవం

*
సైంధవ దేశం వారికి తామూ గొప్ప యుద్ధ వీరులమని గర్వం .దానికి తగ్గట్టు వారు చాలా
యుద్దాలలో గెలిచారు.విశాల దేశం వారితో యుద్ధంలో వారి ఖర్మ కాలి కాలికి బుద్ది చెప్పవలసిన
అవసరం పడింది వారికి .వారు అలా వెనుతిరిగి పారిపోతుండగా , వెనకనుండీ ఉపసేనాధిపతి,
సేనాధిపతికి అరిచి చెప్పాడు ,

" నేను విశాల దేశం సైనికులను ఐదుగురిని పట్టుకున్నాను, నాకు సహాయం చేయండి "

"మంచిది , వెంటనే వాళ్ళని నా ముందుకి లాక్కోనిరా "

"వాళ్లు రావటం లేదు , నువ్వే రావాలి "

" మనం ఆగటానికి వీల్లేదు,వాళ్ళని వదిలి పెట్టి నువ్వు వచ్చేయి "

"నేను వదిలినా వాళ్లు నన్ను వదలటం లేదు " అరిచి చెప్పాడు ఉప సేనాధిపతి .

టీవీ గది

*
క్రొత్తగా కాపురానికి వచ్చిన సుధకు , తన ఇంటి లోని గదులన్నీ చూపిస్తున్నాడు గంగాధర్ .

" సుధా , ఇది వరండా , ఇది హాలు , ఇదేమో టీవీ గది , ఇదిగో ఇది వంట గది "

" మరి టీవీ గదిలో టీవీ లేదు , కొత్తది కొనాలా " అడిగింది సుధ .

గంగాధర్ , సుధ చేయి పట్టుకొని టీవీ గదిలోకి తీసుకెళ్ళి చూపించి చెప్పాడు ,

"ఇదిగో , ఈ కిటికీ నుండీ చూస్తే పక్కింటి వాళ్ల టీవీ చక్కగా కనిపిస్తుంది "

దెయ్యం

*
సుమంత్,వాళ్ల నాన్న రావటం చూసి పరిగెత్తుకంటూ ఎదురు వెళ్ళాడు

" నాన్నా , నువ్వెప్పుడైనా దెయ్యాన్ని చూశావా ? "

" ఆ విషయం నీకెందుకురా ఇప్పుడు ? "

" మా క్లాసు lo శేఖర్ వాళ్ల నాన్న నిన్న రాత్రి చీకట్లో వస్తుంటే మర్రి చెట్టు దగ్గర
దెయ్యాన్ని చూశాడట .వాడు గొప్పగా చెప్పుకుంటున్నాడు "


అప్పుడు సుమంత్ చెవిలో చెప్పాడు వాళ్ల నాన్న ,

" రేపు మీ క్లాసు లో, మా నాన్న దెయ్యాన్ని చూడటమే కాదు ,దాంతో పదేళ్ళ నుండీ
కాపురం కూడా చేస్తున్నాడని చెప్పు "

వెంట్రుకలు

*

పరంధామయ్య మంచి ఆకలితో వచ్చి భోజనం ముందు కూర్చొన్నాడు .కంచం వంక చూసి ,

వెంటనే పట్టరాని కోపం తో భార్యపై అరిచాడు ,

"దేబ్యం మొహమా , నికేన్ని సార్లు చెప్పానే ,కళ్ళజోడు పెట్టుకొని వంట చేయమని ,కూర, పప్పు

నిండా అన్నీ వెంట్రుకలే "

"నేనూ మీకేన్ని సార్లు చెప్పాను ? కళ్ళజోడు లేకుండా అన్నానికి రావద్దని , అవి కొత్తిమీర

కాడలు ,చూసి ఏడవండి "

డబ్బు గోల

*
మా పక్కింట్లో నుంచీ ఈ రోజు సాయంత్రం ఈ మాటలు వినపడ్డాయి ,

"ఎప్పుడు డబ్బు , డబ్బు అని నా ప్రాణం తీస్తావేమిటే, ఒక్క రోజన్నా మంచి జ్ఞానం కావాలనో
బుద్ధి కావాలనో అడగవేమిటే

" ఎవరి దగ్గర ఏది ఉంటే అదే అడుగుతాము ,లేనిది అడిగి ఏమి లాభం ? "

ఆ తరువాత నేను మా ఆవిడని తప్పించుకు తిరిగాను , నా మీద స్వంత వాక్యాలలో
ప్రయోగిస్తుందేమోనని .

ఆలస్యం

*
స్కూల్ బెల్లు మోగింది .క్లాసులు మొదలై అరగంట అయ్యింది . మహేష్ బాబు పరిగెత్తుకుంటూ
నాలుగవ తరగతి రూం ముందు తలుపు దగ్గర ఆగిపోయాడు. మాస్టర్ గారు చూసి అడిగారు ,

"ఏరా ఎందుకు లేటు అయ్యింది ? "

" వస్తుంటే దారిలో ఒకాయన వెయ్యి రూపాయల నోటు పడిపోయింది. అందరూ వెతుకుతుంటే
అక్కడే ఉండిపోయాను."

" స్కూల్ ఉందని మరిచిపోయావా , బుద్దిలేని వెధవా "

" లేదు మాస్టారూ , ఆ వెయ్యి నోటు నా బూట్ క్రింద ఉండి పోయింది " నసిగాడు మహేష్ .

తాళి

*
రాము : సోమూ,నీకు ఎప్పుడూ పరీక్షల్లో అత్తేసరు మార్కులు వచ్చేవి గదా ?,
మరేంటి క్వార్టర్లీ లో అన్నింటిలో మంచి మార్కులొచ్చాయి !

సోము : మన హెడ్ మాస్టర్ గారితో , మా అక్క పెళ్లి ఖాయమయ్యింది క్రితం నెలలో


సౌందర్యం

*
సంగీత : " అనితా !నీకు గొప్ప అందగత్తె కనబడితే ఏం చేస్తావు ? "

అనిత : "అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతాను.అలా చూస్తూనే ఉంటాను .
విసుగొస్తే అద్దం తీసి పక్కన పెడతాను "

నవ్వులాట సాధించెన్ అరుదైన ఘనత

*
నేను నవ్వులాట గా జులై 2008 లో మొదలు పెట్టిన ఈ బ్లాగు నిన్నటిరోజున ఒక అరుదైన ఘనతని తన సొంతం చేసుకొంది.ఈబ్లాగులో నేను

03- అక్టోబర్ -2008 నుండీ నిన్నటి వరకు ఒక్కరోజు కూడా

విడువకుండా ఒక సంవత్సరకాలం ప్రతి రోజూ జోకులతో నా బ్లాగులో

టపాలని రాస్తూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు ఈప్రపంచంలో ఒక

సంవత్సరకాలం ఆపకుండా తెలుగుబ్లాగులలో టపాలను రాసిన

మొదటివ్యక్తిని నేనే.

బహుశా మిగిలిన భారతీయ భాషలలో చూసినా,నేను మొదటి


నలుగురిలో ఉంటాననే అనుకుంటున్నాను.

ఈ నా బ్లాగు ఘనత నాది మాత్రమే కాదు,నా బ్లాగు రోజూ చదివే మీ అందరిది.

మీ ప్రోత్సాహం లేకుంటే ఇది సాధ్య మయ్యేది కాదు.


నా అర్ధాంగి అన్నపూర్ణ,నా చిన్నారులు చిన్మయీ,హరి సహకారం


లేనిదే ఈ నాయాత్ర నిజంగా సఫలమయ్యేదే కాదు.

మీ అందరి అభిమానాన్ని,ఆదరణని,ఆశిస్సులను ఎల్లపుడూ కోరుకుంటూ,
మీ

నవ్వులాట శ్రీకాంత్

ఆదర్శ దాంపత్యం

*
రంగా రావు , రమణి దంపతుల వివాహం జరిగి యాభై ఏళ్ళు . వారి సంతానం , మనుమలు
మనుమరాళ్ళు అందరు కలిసి గొప్ప విందు ఏర్పాటు చేసారు ఆ సందర్భం లో .

ఆ విందులో "అదేదోటీవీ" యాంకర్ సురేఖ కూడా పాలుపంచుకుంది. రంగారావు దంపతులతో
ఇంటర్వ్యు ముందుగా రమణి గారిని ప్రశ్నించటం తో మొదలుపెట్టింది .

" రమణి గారూ , ముందుగా మీఇద్దరికీ నా అభినందనలు .యాభై ఏళ్ల కాలం భార్యాభర్తలుగా
ఆనందంగా,చిలకా గోరింకల్లాగా, ఇతరులకు ఈర్ష కలిగించేట్టు, చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా
కలిసి జీవించిన మీకు నా శతకోటి వందనాలు .మీరు ఏమీ అనుకోనంటే నాదో చిన్నప్రశ్న "

" అడుగమ్మా "

" మీరెప్పుడైనా ఈ యాభై ఏళ్ల కాలంలో , మీ వారికి విడాకులు ఇద్దామనుకున్నారా ? "

" లేదమ్మా , అలాంటి ఆలోచనే ఎప్పుడూ నా మనసులోకి రాలేదు.కానీ ఒక్క సారి మాత్రం
ఆయన్ని కాల్చిపారేద్దామనుకున్నా "

నిజం

*
కోర్టులో వాజ్యం నడుస్తోంది . ముద్దాయి బోనులో నిలబడి ఉన్నాడు . జడ్జ్ గారు అతన్ని ఇలా

అడిగారు ,

" ఏం రామయ్యా , నీ వైపు వాదించటానికి ఎవరన్నా వకీలు ని పెట్టుకోలేదా ? "

" లేదండయ్యా "

"ఏ నీకు వకీలు అవసరం లేదా ? "

" నేను నిజమే చెప్పాలనుకుంటున్నాను , నాకు ఏ వకీలు అవసరం లేదండీ " అన్నాడు
రామయ్య అమాయకంగా