సగం సగం

*

సునీత, రాజేష్ లకు కోర్ట్ విడాకులు మంజూరు చేసింది . కొన్నాళ్ల తరువాత పక్క సీట్ అరుణ
సునీతను అడిగింది .

" మీరు అన్నీ సమానంగా పంచుకున్నారా మరి "

"పెద్దోడు నా దగ్గరకు చేరాడు ,వంశీ ఆయనతో ఉన్నాడు .పూల కుండీలు సమానంగా
తీసుకున్నాము "

"అది కాదే, మరి ఆస్తి కూడా సమానంగా పంచుకున్నారా "

"ఆ , ఆయన లాయరు , నా లాయరు సగం , సగం పంచుకున్నారు "

సరిపడే జీతం

*

అంజలి ప్రేమలో నిండా పీకల్లోతు మునిగి పోయాడు వసంత రావు . ఆగలేక వెంటనే వెళ్లి
ఆమె తండ్రిని కలిసి పెళ్లి చేయమని అడిగాడు .

తన బీదరికపు ఎడారిలో ఒయాసిస్సులా దొరికిన వసంతరావుని ఆయన వినయంగా అడిగాడు

"మీ సంపాదన ఒక సంసారాన్ని లాగటానికి సరిపోతుందా ? "

" భేషుగ్గా " నమ్మకంగా చెప్పాడు వసంతం

"మరోసారి ఆలోచించుకోండి , మా ఇంతలో పదిమంది ఉన్నారు " హెచ్చరికగా సూచించాడు
పెద్దాయన .

గయ్యాళి

*

"మా ఆవిడ నన్ను ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు .ఒక్కరోజూ సాధించలేదు "
చెప్పాడు కనకారావు , మిత్రుడు శరత్ తో.


"
అంత మంచి భార్య లభించటం నిజం గా నీ అదృష్టం " అన్నాడు శరత్

"అదేం కాదు , అది ఒట్టి గయ్యాళి "

"అంత గయ్యాళి అయితే మరి ఒక్క మాట కూడా అనకుండా ఎలా ఉంటుంది ?,
నవ్వులాట కి అంటున్నావా ? " అడిగాడు శరత్

"నా జీవితానికి నవ్వులాట కూడానూ, నన్నేమీ అనటానికి లేకుండా , అన్నీ ఆమె
చెప్పినట్లే తూచా తప్పకుండా చేస్తాను " చెప్పాడు కనకారావు

పెళ్ళికి ముందు

*

"మీతో పెళ్లి కాక ముందు , మా గవర్నర్ పేట లో ఎంత మంది నా వెనకాల పడి , నా ప్రేమ కోసం
పరితపించారో మీకు తెలుసా ? " గొప్పగా చెప్పింది ప్రమీల , భర్త అర్జున రావు తో .

"అలాగా " నిర్లిప్తంగా బదులు పలికాడు పతిదేవుడు

"అయినా వాళ్ళందరిని కాదని మిమ్మల్ని కట్టుకున్నా.మీరెంత అదృష్టవంతులో చూసారా "
గర్వంగా పలికింది ప్రమీల

"నేను వాళ్లు అదృష్టవంతులని అనుకుంటున్నానే " బుర్ర గోక్కుంటూ పలికాడు అర్జున్ శూన్యం
లోకి చూస్తూ .

ఉద్యోగం

*

వినయభూషణ రావు కి ఇది 20 ఇంటర్వ్యూ .వంద తిక్క ప్రశ్నలు వేసి , ఆఫీసర్ అతన్ని
ఎంపిక చేసినట్టు ప్రకటించాడు .

దాంతో ఉబ్బి తబ్బిబ్బై ఆఫీసర్ గారికి ధన్యవాదాలు చెప్పి , అడిగాడు

"సార్, ౩౦ మందిలో నాకే ఎందుకు ఉద్యోగం ఇచ్చారు సార్ ? "

"నీకు పెళ్లైంది , వాళ్లకు పెళ్లి కాలేదు కాబట్టి .పెళ్ళయిన వాళ్లు నేనెంత తిట్టినా పెద్దగా బాధ
పడరు కాబట్టి "

తెలివి

*

ఆదిశేషు ,భార్య రమాదేవి తో ,

"ఏమే,నా అనుభవాన్ని పట్టి చూస్తే,తెలివైన మగాడితో,తెలివితక్కువ ఆడది కాపురం చేయగలదు,
కానీ ,తెలివైన ఆడది ,తెలివి లేని మగాడితో మాత్రం వేగటం చాలా కష్టం .అటువంటి వాళ్ళకి
చేతులెత్తి దణ్ణం పెట్టాలి"

"ఏమండీ ,తప్పండీ ,భర్త భార్యకు దణ్ణం పెట్టకూడదు , ఆయుక్షీణం " అంటూ లెంపలేసుకుంది
రమాదేవి .

కొత్త బ్లాగరు

*

"అసలు బ్లాగులు రాయటం ఎంత కష్టమో తెలుసా ? ,అది తపస్సు లాంటిది .అందులో ఒకే
విషయం మీద నెలల తరబడి సీరియల్స్ రాయటం మరీ కష్టం .ఎంతో ఓపిక కావాలి "

రెండు గంటల నుండీ మిత్రుడి మెదడు తినేస్తున్నాడు కొత్త బ్లాగరు.


"అవును , నిజమే ,అవి చదివి కామెంట్ చేయటానికి ఇంకా ఎంతో ఓపిక కావాలి "

చెప్పాడు మిత్రుడు ,తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ .

గోళ్ళు కొరకటం

*

"మా అబ్బాయి గోళ్ళు కోరికే అలవాటు ని అతి కష్టం మీద మాన్పించ గలిగాను " చెప్పాడు
సమరం , కిషోర్ తో


"ఎలా సాధించావు ? " అడిగాడు కిషోర్


"వాడి పళ్లన్నీ రాల గొట్టాను " చెప్పాడు సమరం

లాఫింగ్ క్లబ్

*

ఉగ్ర నరసింహం తన మిత్రులతో కలిసి, కత్తుల పాలెం లో లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసాడు .

వారు వారానికి రెండు సార్లు కలుసుకుంటారు .

బుధవారం కలిసి, ఎవరి జోకులు వాళ్లు అందరికీ వినిపిస్తారు

మళ్ళీ ఆదివారం కలిసి , బుధ వారం నాటి జోకులకు నవ్వుకుంటారు

ప్రపంచ యాత్ర

*

"నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రపంచమంతా చూపిస్తా నన్నావు ? " అడిగింది , పెళ్ళయిన ఆరు
నెలలకు సరిత , వేణు ని

"నేనేం మరిచి పోలేదు " అంటూ కంప్యూటర్ లో గూగుల్ ఎర్త్ ఓపెన్ చేసాడు వేణు

కాఫీ ఖర్చు

*
"సార్! యాభై రూపాయలు ఇవ్వండి,కాఫీ తాగుతాను.దిక్కు లేనివాడిని.దయ చూపించండి "
అడిగాడు బిచ్చగాడు జాలిగా

"ఒక కాఫీ కి యాభై రూపాయలా ? " ఆరా తీసాడు డిటెక్టీవ్ యుగంధర్


"ధరలు పెరిగాయి కదండీ ,నేను , నేను కట్టుకోబోయే అమ్మాయి మంచి హోటల్ లో కాఫీ
తాగాలి కదండీ మరి " వినయంగా చెప్పాడు బిచ్చగాడు .

పొరపాటు

*
కోర్టులో శాంతా రావు పై భార్య ను చంపబోయాడనే అభియోగం మీద విచారణ జరుగుతోంది .
జడ్జ్ అడిగారు ,

"నువ్వు నీ భార్య ని కావాలని కాల్చలేదు , పొరపాటున కాల్చానంటున్నావు ,అవునా ? "


"అవునండీ "

" అయితే అసలు జరిగిందేమిటి " అడిగారు జడ్జ్

"మా అత్త గారిని తుపాకీ తో కాల్చ బోతుంటే , అనుకోకుండా మా ఆవిడ వచ్చి అడ్డు పడింది "
నిజం ఒప్పుకున్నాడు శాంతా రావు .

వజ్రాల ఉంగరం

*

" ఇది ఒక కల " సినిమా షూటింగ్ స్పాట్ లో హీరోయిన్ అరుణా కిన్లే పుట్టినరోజు వేడుకలు
జరుగు తున్నాయి .

సినిమా నిర్మాత ఆమెకు 20 లక్షలు ఖరీదైన వజ్రాల ఉంగరం బహుమతి గా ఇద్దాం అనుకున్నాడు


అది తెలిసి డైరెక్టర్ నిర్మాతతో ,

"అంత డబ్బెందుకు తగలెయ్యటం, దాని బదులు కారు కొని ఇవ్వచ్చు కదా ? " అన్నాడు

"కార్లలో నకిలీలు దొరకటం కష్టం కదా " చెప్పాడు నిర్మాత

ఎంతెంత దూరం

*

మచిలీపట్నం హిందూ హైస్కూల్ లో , 6 తరగతి గది ,

"ఏరా , రామూ ! వారం నుండి స్కూల్ కు రాలేదే ? " అడిగారు వరదాచార్యులు మాస్టారు.

"విజయవాడ వెళ్ళా నండీ "

"బెజవాడ లో వారం రోజులు ఏం అఘోరించావు , పరిక్షలు దగ్గర పడుతుంటే "

"విజయవాడ లో ఒక్క రోజే ఉన్నాను మాస్టారూ " చెప్పాడు రాము.

"అంటే ఉళ్ళో ఉండే రాలేదన్నమాట "

"లేదు మాస్టారూ , రోజు ఉదయమే వచ్చానండీ "

"బెజవాడ నుండి బందరు రావటానికి వారం పట్టిందా ?, పాక్కుంటూ వచ్చావా ? " గద్దించారు
మాస్టారు

"లేదు మాస్టారూ, మా బాబాయి రోడ్ రోలర్ మన ఊరు వస్తుంటే ,అది ఎక్కి వచ్చాను "

బకాసురులు

*
ఇద్దరు బకాసురులు ,బెజవాడ బీసెంట్ రోడ్ లోని మోడరన్ కేఫ్ కు రాత్రి ఏడున్నారకు వచ్చారు.

"ప్లేట్ మీల్స్ ఎంత ? ,ఫుల్ మీల్స్ ఎంత ? "

"ప్లేట్ మీల్స్ 27, ఫుల్ మీల్స్ 30 "

"మీ హోటల్ ఎన్నింటి వరకు ఉంటుంది ? "

"రాత్రి పదింటి దాకా "

"మా రైలు పదిమ్పావు కి ,ఫుల్ మీల్స్ వడ్డించు " అన్నారు బల్ల దగ్గర కూర్చుంటూ బకాసురులు

సరే అని హోటల్ వాడు ఫుల్ మీల్స్ వడ్డించాడు ,రాత్రి 09:45 కి మొదలు పెట్టి .

పాడు కల

*
గోడకివతల నిలబడి నరసింహం , వేణు తో ,

"నిన్న రాత్రి తిట్టి , బెదిరించి మా ఆవిడ తో వంట చేయించినట్టు కల వచ్చింది "

"కొంపదీసి ఆవిడతో గానీ చెప్పావా ? "

" , చెప్పి పొద్దున్నే క్షమాపణ వేడుకున్నాను " ముగించాడు నరసింహం

పనివాడు

*

"కిరణ్ ! నీకు తోట పని తెలిసిన పనివాడు ఎవరన్నా తెలిస్తే చెప్పవోయ్ " అడిగాడు గంగాధర్

"అదేంటి ,మీ ఇంట్లో ఆంజనేయులు చేస్తున్నాడుగా ? "


"అవును ,ఆంజనేయులు మంచి పని వాడోయ్,కానీ మొన్నటి నుండీ మానేసాడు "


"ఏమైంది ? "

"నన్ను తిట్టినట్లే నా పెళ్ళాం వాడిని కూడా తిట్టింది.దాంతో అవమానం భరించలేక మానేసాడు"
చెప్పాడు గంగాధర్

చీర

*

సుభద్ర అబిడ్స్ లోని చందనా బ్రదర్స్ లోకి అడుగుపెట్టింది.సేల్స్ మాన్ రాంబాబు చనువుగా
పలకరించాడు ,

" మేడం గారూ ! బాగున్నారా ? , ఏం చూపించమంటారు ? "


" కాటన్ చీరలు చూపించు " చెప్పింది సుభద్ర

రాంబాబు చీరలు చూపించటం మొదలు పెట్టాడు . చీర సెలక్ట్ చేసింది సుభద్ర .

"మేడంగారూ !నేను చూపించిన మొదటి చీరే,వెంటనే తీసేసుకున్నారేమిటమ్మ "అబ్బురపడుతూ
అడిగాడు రాంబాబు


'
అది మా అత్తగారికి లే " అంటూ సుభద్ర తన చీర కోసం అప్పటికి 73 చీరలు చూసింది .

పొగడ్త

*

" సుశీల వదినా ! నీ వంట చాలా బాగుంది " చెప్పింది కల్పన


"ఏమోనమ్మా ,నాకు నీలాగా పొగడటం అస్సలు చేతకాదు "నవ్వి మొహమాటంగా అంది సుశీల


"కనీసం నాలాగా అబద్దాలైనా చెప్పటం నేర్చుకో,లేకుంటే ఇబ్బంది పడతావు"మంచి చెప్పింది

కల్పన

బహుమతి

*

విశ్వేశ్వరరావు కి ఒక కోర్ట్ కేసుంది . దాని వల్ల కోట్ల ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది .
తన లాయరు పానకాల రావు ని అడిగాడు ,

"సార్ ! జడ్జ్ గారు , మనకు అనుకూలం గా తీర్పు చెప్పటానికి , వారికి పువ్వో, పండో
సమర్పించు కుందామని నా ఆలోచన . మీరేమంటారు ? "

" పని మాత్రం చేయకు . ఆయన యమా స్ట్రిక్ట్ . తనకు లంచం ఇవ్వబోయావని
కేసు పెట్టి జైలు లో తోస్తాడు కూడా "

ఆరు వాయిదాల తరువాత తీర్పు వెలువడింది .విశ్వేశ్వర రావు గెలిచాడు .

లాయర్ గారి నోట్లో , లడ్డూ కుక్కుతూ ,

"మీ ఋణం ఎప్పటికి తీర్చుకోలేనండీ . రోజు మీరిచ్చిన సలహా వల్ల కేసు అవలీలగా
గెలిచానండీ " ధన్యవాదాలు చెప్పాడు వి .రావు

" నేనేం సలహా ఇచ్చాను నీకు " బుర్ర గోక్కున్నాడు లాయర్

"నేను వారం క్రితం ,అవతలి వాడు పంపినట్లు వజ్రపుటుంగరం జడ్జ్ గారికి పంపానండి .
దాంతో తీర్పు మనకు అనుకూలంగా ఇచ్చారు ఆయన " ఆనందం గా చెప్పాడు విశ్వేశ్వరుడు .

చావు రోజు

*

"మా తాతగారికి , మా నాన్నగారికి వాళ్లు ఎప్పుడు చనిపోతారో సంవత్సరం ,నెల , రోజుతో సహా
ముందుగా తెలుసు " చెప్పాడు రమేష్ తన మిత్ర బృందంతో

" నిజంగానా ? " అబ్బురపడ్డాడు అరవింద్

"వాళ్లు నాడీ జ్యోతిషం వల్ల తెలుసుకున్నారా ? " అడిగాడు సురేష్


"వాళ్లు యోగా వల్ల ముందుగా తెలుసుకోగలిగారా ? " ప్రశ్నించాడు యోగేంద్ర

"ఇవేమీ కాదు " చెప్పాడు రమేష్

"విషయం చెప్పిచావు ,టెన్షన్ పడలేక చస్తున్నా " అరిచాడు ఆదిశేషు

"
చావు రోజుని,ఉరి శిక్ష వేసిన జడ్జ్ చెప్పాడు వాళ్ళకి "చావు కబురు చల్లగా చెప్పాడు రమేష్