ఏమి ఇవ్వాలి ?

*
"చెలీ ! నీ చిన్న ముద్దు కోసం,నీకేం ఇవ్వాలి నేను " అడిగాడు సరదా బుల్లోడు.

" క్లోరోఫాం " బదులిచ్చింది కరాటే రాణి

టీ నెప్పి

*
"నేను టీ తాగిన ప్రతిసారీ నా కుడి కంట్లో కత్తి గుచ్చినట్లుగా
నెప్పి వస్తోంది , ఏం చేయాలంటారు డాక్టర్ ? "

"కప్పు లో చెంచా తీసేసి టీ తాగండి "

హీరోయిన్

*
ఓ సినిమా హీరోయిన్ చచ్చి దెయ్యమయ్యింది. పరిచయాలైనాక
పాత దెయ్యం అడిగింది

"ఎంత వయసు లో బాల్చీ తన్నేసావు ? "

" 20 ఏళ్ల మీద కొన్ని నెలలకు "

" ఎన్ని నెలలు ? "

" 363 నెలలు "

పాడు కల

*
రూంమ్మేట్లు ఆంజనేయులు ,యాదగిరిల సంభాషణ :

"తెల్లవారుజామున పాడు కలొచ్చింది రా "

" ఏంట్రా అది "

"చార్మి,ఇలియానా ,నయనార,త్రిష, శ్రియ,అసిన్ అందరూ మా ఇంటి కొచ్చారు .
నా చుట్టూ కూర్చొని నాతో మాట్లాడారు "

"ఇది పాడు కలేంటి "

"నేనప్పుడు అమ్మాయిలా ఉన్నాను , అంజని నా పేరు "

నా తెలివితేటలు

*
మొన్న భోజనాల దగ్గర మా 7 ఏళ్ల బాబు "నేను మీలాగా ఓ చిన్న జోకు
చెబుతా నాన్నా " అన్నాడు .నేను మురిసిపోయి నా శ్రీమతితో,

"ఏమోయ్ ! హరిగాడికి అన్నీ నా తెలివితేటలే వచ్చాయి ,చూడు "అన్నాను
గర్వంగా .

"కరక్టేనండీ, నా తెలివితేటలు నా దగ్గరే ఉన్నాయి "

విడాకులు

*
అరుణ, కరుణ ల సంభాషణ :

"పెళ్ళైనప్పటి నుండీ నిన్ను కాల్చుకు తింటున్న ఆ వెధవకు, వాడే అడుగుతుంటే
విడాకులివ్వటానికి, నీకొచ్చిన ఇబ్బందేమిటే ? "

"ఆ దుర్మార్గునితో 15 ఏళ్ళు కాపురం చేశాను ,విడాకులిచ్చి వాణ్ని
సుఖ పడనివ్వటం నాకిష్టం లేదు "

కొంచం ముందుగా

*
"నిన్ను పెళ్లి చేసుకున్న తరువాతే అర్ధమయ్యింది, నువ్వెంత మూర్ఖుడివో "
ముక్కు చీదింది వనజ.

" "నన్ను పెళ్లి చేసుకుంటావా ?" అని నేను అడిగినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది
నువ్వు " అన్నాడు దివాకర్ చిరాగ్గా .

పెళ్ళైన వాళ్ళతో

*
శైలజ, కృష్ణమూర్తి ఉల్లాసంగా ,ఉత్సాహంగా ప్రేమించుకొని స్వీట్ వాడికి ,
చాట్ వాడికి ,సినిమా వాడికి , పోలీస్ కు ,పెట్రోల్ బంక్ కు చదివించాల్సింది
చదివించుకొని ఒక ఇంటి వారయ్యారు.

కొన్ని రోజులకు శైలజ " ఒంటరి" పోరు మొదలు పెట్టింది.

"క్రిష్ ! పెళ్లయింతరువాత అన్ని చోట్లకు నువ్వొక్కడివే వెళుతున్నావు .
నన్నసలు తీసుకెళ్ళటం లేదు. నీకేమైంది ? "

" పెళ్ళైన ఆడవాళ్ళతో తిరిగే అలవాటు లేదు నాకు " అంటూ బయటకు
వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి .

దలాల్ స్ట్రీట్ లో పోయింది

*
"మీ నాన్న కష్టార్జితం అంతా దలాల్ స్ట్రీట్ లోనే పోయిందటగా ,పాపం ! "

"అవును ,రిటైర్మెంటు డబ్బులు అన్నీ డ్రా చేసి దలాల్ స్ట్రీట్ లో వెళుతుంటే ,
దొంగలెత్తుకెళ్ళారు . "

లేడీ డ్రైవర్

*
హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్ళే టైము .రద్దీగా ఉన్న ఓ రోడ్డు.
కారు నడుపుతూ కుమార్ , అతని పక్కనే ఫ్రెండ్ ప్రవీణ్ .

"అరేయ్ ! ముందు కారు చూడరా ,పద్దతి లేకుండా ఎవత్తో నడుపుతోంది "

"డ్రైవర్ అమ్మాయేనని ఎలా చెప్పగలవురా "

" వాళ్ళే అంత చెత్తగా డ్రైవ్ చేస్తారు "

చౌరాస్థా లో సిగ్నల్ పడింది .చూస్తే, ముందు కారు డ్రైవర్ మగాడే .

"ఇప్పుడేమంటావు " అడిగాడు ప్రవీణ్ .

"వాడికి కారు డ్రైవింగ్ వాళ్ళమ్మ నేర్పి ఉంటుంది " వెంటనే జవాబిచ్చాడు కుమార్.

చేపల కూర

*
"ఏమే ! చేపలు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయని పేపరోడు రాసాడు,
ఇప్పుడే వెళ్లి చేపలు పట్టుకొస్తా . "

"మీ కోసం సొరచేప(Whale) దొరుకుతుందేమో పట్టుకురండి "
---------------------------------
ఈ రోజు ఆంధ్ర జ్యోతి లో నా జోకులు కొన్ని మక్కీ కి మక్కీ కాపీ కొట్టి
నవ్య లో "నవ్వు ఒక యోగం " శీర్షిక క్రింద ప్రచురించారు .
http://www.andhrajyothy.com/navshow.asp?qry=/2008/nov/20navya9

ఏం తెలివి ?

*
సారధి తన ఫ్రెండ్ వినోద్ ఇంటికి వెళ్ళాడు .వినోద్ వాళ్ల టామీతో చెస్
ఆడుతూ కనిపించాడు . ఆశ్చర్య పోయిన సారధి ,

"వినోద్ !నీ కుక్క ఎంత తెలివి గలదిరా .చెస్ ఆడుతోంది" అన్నాడు

"ఏం తెలివి ?,ఇప్పటికి నాలుగు గేములు ఆడితే ,మూడు గేములు నేనే గెలిచా"

వయసెక్కువ

*
టీచర్ : " మగవాళ్ళకు తల మీద జుట్టు నెరిసిన తరువాతే , మీసం
తెల్లబడుతుంది .ఎందుచేత ? "

హరి : "జుట్టు కు 16 ఏళ్ళు వయసెక్కువ ,మాస్టారూ ! "

కొత్త కవి

*
" నా ఆలోచనల అడవిలో అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటాను "
అన్నాడు కొత్త కవి .

" తెలియని చోట , కొత్తవారు దారి తప్పటం లో ఆశ్చర్యమేముందీ "
పెదవి విరిచాడు విమర్శకుడు .

కాకతాళీయం

*
" కాకతాళీయం అంటే ఏంట్రా గోపీ ? "

"నేనూ నిన్ను అదే ప్రశ్న అడుగుదామని ఇప్పుడే అనుకున్నా "

(కాకతాళీయం = co-incidence )

మార్పు

*
రిటైరైన ఇద్దరు మిత్రుల సంభాషణ :

"నేను 20 ఏళ్ల వయసులో ధీరుభాయ్ అంబాని లా కావాలని మనసులో
గట్టిగా నిర్నయించుకొన్నాను "

" కానీ ఇప్పటికీ నువ్వు ఆయనకు 1000 కిలోమీటర్ ల దూరం లో కూడా
లేవు కదా ! "

"నేను మనసు మార్చుకొన్నాను , తేలిక గాబట్టి ."

గాటు

*
మంగలి : "నేను మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా గడ్డం చేసానా సార్ ? "

సైనికుడు : "లేదు , మొహం మీద ఈ గాటు యుద్ధం లో పడింది "

శని పట్టింది

*
"రామూ ! ఏలినాటి శని పట్టిందంటే ఏడేళ్ళు బాధలు పెడుతుందంటారు ,
నిజమేనా ? "

"మా బాబాయి కి ఏలినాటి శని పట్టింది ,కానీ ఏడేళ్ళు బాధ పడలేదే ! "

"నిజంగానా ?"

"అవును ,మొదటి రోజే లారీ ఆక్సిడెంట్ లో పోయాడు పాపం "

గోళ్ళు కొరకటం

*
" చివరాఖరికి మావాడి చేత గోళ్ళు కొరకటం మాన్పించాను "

"ఎలాగేంటీ"

" షూస్ విడవకుండా తొడుక్కోవటం అలవాటు చేశాను "

నాకు రాదు

*

"మూర్ఖుడిలా నటించకు .నువ్వు చాలా మాయగాడివని నాకు తెలుసు"

అన్నాడు ఓ బడా నేత ,చోటా నేత తో .



" నాకు నటించటం రాదండి , మీరే నాకు గురువండి "



తప్పులు

*
"ఒక్క మనిషి ,ఒక్క రోజు లో ఇన్ని తప్పులు చేయటం ఎలా సాధ్యం ? "
విసిగిపోయిన మేనేజర్ అరిచాడు క్లర్క్ మీద .

" రోజూ ఆరింటికి నిద్ర లేచేవాడిని ,ఇవాళ నాలిగింటికే లేచానండీ "

ఎవరికి ఎవరు ?

*
తెలుగు బుర్రకు పదును పెట్టి కత్తిలా కరక్ట్ సమాధానం చెప్పండి :

తండ్రీ కొడుకు లిద్దరూ కలిసి పొలంలో పనిచేసు కుంటున్నారు .అత్తాకోడళ్ళు
వాళ్లకు భోజనాలు పట్టుకొచ్చారు . ఎవరి అన్నలకు వాళ్లు తినిపించారు .

ఎవరికి ఎవరు ఏమౌతారు ?

చక్కని నిర్ణయం

*
"నువ్వెంతైనా వాదించు రమా ! క్లిష్ట పరిస్థితులలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే
సరియైన నిర్ణయాలు తీసుకోగలరు ."

" నేనూ మీ పార్టీనేనండీ శ్రీవారూ ! అందుకే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు,
నేను మిమ్మల్ని చేసుకున్నాను ."

పరిచయం

*
"గోపీ ! నువ్వు పుట్టినప్పటి నుండీ చూస్తున్నా .చాలా మంచి పిల్లాడివి .
మీ నాన్న చొక్కా జేబులోంచీ ఓ పది రుపాయలివ్వరా .పొగాకు కొనుక్కోవాలి ."
అడిగింది సూర్యకాంతం ,7 ఏళ్ల పక్కింటి అబ్బాయిని .

"నేనివ్వను , చిన్నప్పటి నుండీ నేనూ నిన్ను చూస్తూనే ఉన్నాగా "

పిసి"నారి"

*
"మా ఆవిడ చాలా పెద్ద పిసి"నారి" చెప్పాడు శేషగిరి, యాదగిరి తో

"అదేం "

"మేము ఇద్దరు పిల్లలు కావాలనుకున్నాం.ఒకే కాన్పులో ఇద్దర్నీ కనేసి
హాస్పటల్ ఖర్చులు మిగిల్చింది మా ఆవిడ ."

వంట

*
లోకంలో చాలామంది వంట వచ్చినా చేయరు .

కానీ నా శ్రీమతి చేస్తుంది ,

రాకపోయినా

దేవుడి తొందర

*
టీవీలు చూడటం ,బ్లాగులు రాయటం ,చాట్ చేయటం,పబ్ కెళ్ళటం ఆపి ,
హటాత్తుగా మన్మధరావు తలకిందులు గా తపస్సు చేసాడు .

ఇంత చేసిన తరువాత , కనపడక పోతే బాగోదని, దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

" భక్తా ! ఏమి నీ కోరిక ? "

" మీరొచ్చారేమిటి స్వామీ !" .

దేవుడు కంగుతిన్నాడు.అయినా సద్దుకొని

"తొందరగా విషయం తేల్చు ,ఇంకా పది చోట్ల కెళ్ళాలి "
మళ్ళీ అడిగాడు సౌమ్యం గా

"మీరు మరీ తొందర పడ్డారు .రంభ నో ,మేనకనో పంపితే
ఎంజాయ్ చేద్దామనుకున్నా ముందు " నసిగాడు మన్మధరావు .

నిజంగా .....

*
"ఓ లక్ష ఉంటే ఇస్తావా ? , రెండు రోజుల్లో ఇచ్చేస్తాను "

" నేనివ్వను "

" ఉత్తినే అడిగా నేను "

"నేను నిజంగానే చెప్పాను "

స్నేహితులు xxx

*
కాలం స్నేహితులను విడదీస్తుంది.

డబ్బు కూడా ,

మరచిపోకురోయ్ ! పెళ్లి కూడా !

ఇంద్ర-యమ సంవాదం

*
స్వర్గానికి, నరకానికి మధ్య నున్న గోడ ఓ రోజు హటాత్తుగా కూలిపోయింది.

ఇంద్రుడు ,యముడు నువ్వు కట్టాలంటే ,నువ్వు కట్టాలని వాదులాడుకున్నారు .

గొంతు బొంగురు పోయేదాకా ఒకరిపై ఒకరు నిరసన పద్యాలు పాడారు.

అయినా తేలక పోయేసరికి ఇంద్రుడు తన పక్షాన వాదించటానికి
గట్టి లాయర్ కోసం బయలుదేరాడు .

"ఎక్కడికి వెళుతున్నావు నీవు ఇంద్రా ! , వాళ్లందరూ నా నరకంలోనే ఉన్నారు "
అన్నాడు వెటకారంగా యముడు .