నా ప్రపంచం ---10,000 హిట్స్

నా ప్రపంచం 10,000 హిట్స్ సాధించటం చాలా మంచిదే . కాని 10,000 వ పాఠకుడు అదృష్ట వంతుడు అని అన్నారు C.B.RAO గారు. అదృష్టాన్ని వారు నమ్ముతున్నారన్న మాట. మిగిలిన 9,999 హిట్స్ ఇచ్చిన వారు ఏమిటి ? .అనుకోకుండా జరిగిన విషయాలు మన కొలబద్ద తో చూడటం వల్ల అదృష్ట, దురదృష్ట లని పేరు పెడతాం .ఇలాంటి కొన్ని వేల విషయాలు కొన్నాళ్ళకు ఆచారంగా , మతం గా మారిపోతాయి .కొన్ని సంకేతాలు ఏర్పడతాయి . మూఢనమ్మకాలను వదిలించే బ్లాగు కు కూడా " అదృష్టం" పట్టింది .అందువల్ల మనకు తెలిసే విషయం ఏమిటంటే ఎల్లపుడు మనిషి rational గా ఉండటం సాద్యం కాదు. కొంత వింత ,వినోదం కూడాఅవసరమే. అవి మన ప్రగతి కి అడ్డు పడనంతవరకు .

పలుకని చిలుక


దుర్గా రావు ఎంతో ముచ్చటపడి బాగా మాట్లాడే చిలకను కొన్నాడు .దాన్ని ఇంట్లో పెట్టి పని మీద బయటకు వెళ్లి వచ్చాడు. భోజనం చేస్తుంటే చిలక జ్ఞాపకం వచ్చింది .భార్యను అడిగాడు .

"మీరు ఇప్పుడు తింటున్నది దాని కూరేనండీ " అంది భార్య .

"ఎంతపని చేసావే ?, దానికి పదహారు భాష లొచ్చు." అరిచాడు కోపం,బాధ కలసిన గొంతుతో దుర్గారావు .

" ఆమాట దాన్ని పట్టుకొని కోసేటప్పుడు ఒక్క భాషలోనైనా చెప్పిచావలేదే మరి !" అడిగింది ఆశ్చర్యంగా అతని భార్య.

పుట్టినరోజు కానుక


కొత్త పెళ్ళికూతురు ఊర్మిళ ,తొందరలో వచ్చే భర్త పుట్టినరోజు న అద్భుతమైన కానుక తో ఆశ్చర్య పరచాలనుకుంది.మెగా గిఫ్టు షాపీ కి వెళ్ళింది .మూడు గంటల పాటు సేల్స్ మెన్ అందరిని విసిగించింది .ఏవీ అద్భుతం గా లేవంది.


అప్పుడు,ఆమెతో విసుగెత్తిన 21 వ సేల్స్ మాన్ " మేడం ! మీకు ఒక కానుక గురించి చెబుతాను .అది మీ భర్త ను బాగా ఆశ్చర్య పరుస్తుంది " అన్నాడు .ఆమె శ్రద్ధ గా వినసాగింది .


"మీ భర్త బయట నుండి ఇంటికి రాగానే ,మీరు తలుపు వెనకనుండి ఒక్కసారిగా హ్యాపీ బర్త్ డే అంటూ అతని ముందుకు ఉరకండి " కసిగా ముగించాడు సేల్స్ మాన్ .

చదువా ? పెళ్ళా ?


కుటుంబ రావు P.G. లో యూనివర్సిటి గోల్డ్ మెడల్ సంపాదించిన తన కూతురు సుజాత తో " నువ్వు ఇంకా చదివితే , నీ చదువు కు తగ్గ వరుణ్ణి తేవటం కష్టం .పెళ్లి చేద్దామంటే నా స్థితి కి గుమాస్తా ను మాత్రమే తేగలను. నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా ! "



"నేను P.H.D. చేస్తూ పెళ్లి చేసుకుంటా నాన్నా .మీకు ఆర్ధికంగా భారం కల్గించను."

బూతు చిలక


వెంగల రావు మంచి చిలకను కొనటానికి షాపుకు వెళ్ళాడు .ఓ చిలకను చూపించి షాపువాడు " ఇది చాలా మంచిది సార్ , చక్కగా , గౌరవంగా మాట్లాడుతుంది, తెలివైనది,విశ్వాసంగా ఉంటుంది సార్. " అని చెప్పాడు .


ఆ చిలక ను కొని ఇంటికెళ్ళాడు వెంగళరావు .మరుసటి రోజు ,వాళ్ల ఆఫీసర్ ఇంటి కొచ్చారు.చిలక నోటినుండి "బూతు , బండ బూతు" లు .

వెంగల రావు వెంటనే వెళ్లి , షాప్ వాడి చొక్కా పుచ్చుకున్నాడు.

"సార్ ! నాకే పాపం తెలియదు సార్, రెండు రోజుల క్రితం దీన్ని ఓ తాగుబోతాడు కొనుక్కెళ్ళాడు.ఈ బూతులు వాడి దగ్గర నేర్చుకొని ఉంటుంది." అన్నాడు షాపువాడు .

కాఫీ లో

కాంతారావు తనకిచ్చిన కాఫీ ని త్రాగబోతూ , కోపం గా వెయిటర్ ను పిలిచాడు
"ఈ కాఫీ లో దోమ పడింది ,కనపడట్లా ? "

"మీ కాఫీ లో దోమ పడలేదు సార్ " వినయం గా అన్నాడు వెయిటర్ .
"దోమ పడితే పడలేడంతావా ?,నీ విషయం ఇప్పుడే తేలుస్తా " అంటూ కాఫీ గ్లాస్ తో ఓనరు దగ్గరకు వెళ్ళాడు కాంతారావు .అంతా విని ఓనరు " మా వెయిటర్ చెప్పింది నిజమే సార్ .మా హోటల్ లో ఒక్క దోమ కూడా లేదు. " అన్నాడు.

కాంతారావు కోపం నషాళానికి అంటింది .హెల్త్ ఆఫీసర్ కు ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాను అంటూ విసురు గా బయటకు నడిచాడు.

"ఇచ్చే కంప్లైంట్ సరిగా ఇవ్వండి .మీ కాఫీ లో పడింది దోమ కాదు , ఈగ " వెనక నుండి అరచి చెప్పాడు హోటల్ ఓనరు .

తాగుబోతు కొంప

పానకాల రావు తప్పతాగి తూలుతూ అర్ధరాత్రి ఓ ఇంటి తలుపు కొట్టాడు . తలుపు తెరుచుకోలేదు . "ఏమే ! మొగుడొస్తే తలుపు తీయవేంటే, ఎక్కడ చచ్చావు " అరిచాడు .

ఆ ఇంటి ఇల్లాలు ఓరగా తలుపు తీసి, " ఇది మీ ఇల్లు కాదు, గొడవ చేయకుండా వెళ్ళండి " అంటూ తలుపు వేసేసింది .

ఇదంతా చూస్తున్న ఆమె నాలుగేళ్ల పాప "అమ్మా , నాన్న కు అలా అబద్దం చెప్పి తలుపు వేసేసా వేమిటి " అని అడిగింది .

" ఓ 3 గంటలాగి మత్తు దిగిం తరువాత వస్తాడులే , మనం అప్పడిదాకా హాయ్ గా పడుకోవచ్చు " అంది ఆ ఉత్తమ ఇల్లాలు .

స్వర్గం


సూర్య కాంతం చనిపోయింది .యమ భటులు ఆమెను లాక్కెళ్ళటానికి వచ్చారు. దేవదూతలు వారిని అడ్డుకుని, తమ దగ్గర వున్న పతివ్రతల లేటెస్ట్ లిస్టు లో ఆమె పేరు ,వివరాలను చూపించారు. అవి :

పేరు : సూర్యకాంతం

వయసు : 78

స్వర్గం లభించటానికి కారణం :భర్త కు సదా ఆనందాన్ని ఇచ్చిన , 18 వ ఏటా అలిగి చనిపోయే వరకు సాగించిన " మౌన వ్రతం " యొక్క పుణ్యం.

పేక మేడలు


పేకాట పాపా రావు ఓ పెళ్లి లో అప్పుడే పరిచయమైన ఆయనతో " పేకాట తో నేను మూడంతస్తుల భవనం కట్టాను" అన్నాడు, ముక్కలు కలుపుతూ .

"పేకాడి నేనూ కట్టాను , ఓ చిన్న ఇల్లు, పెద్ద మహల్ అమ్మి " అన్నాడాయన దూరం గా జరుగుతూ .

ఏ చేయి ?


శ్రీకృష్ణుని విశ్వరూపం బొమ్మ చూపిస్తూ తన రెండేళ్ళ పిల్లవానికి అన్నం పెడుతోంది తల్లి .

"కన్నా, చూడు ఈ దేవుడికి వేయితలలు , వేయి చేతులు , వేయి కళ్లు ,వేయి కాళ్ళు "

"అమ్మా! ఈ దేవుడు వాళ్ల అమ్మ అన్నం పెడితే ,ఏ చేత్తో అన్నం తింటాడే ? " ముద్దుగా అడిగాడు చిన్న గోపన్న .

ఏ పార్టీ ?


రోజుకో పార్టీ మార్చే మారుతి రావు ఇంటి తలుపు కొట్టారు కార్యకర్తలు .


అతని నాలుగేళ్ల పాప తలుపు తీసింది .


"పాపా ! మీ నాన్న తెలుగు దేశం లో వున్నాడా ? , కాంగ్రెస్ లో వున్నాడా ? , తెరాస లో వున్నాడా ? " అడిగారు కార్యకర్తలు .


"మా నాన్న ఇప్పుడు బాత్రూం లో వున్నా డండి " అమాయకం గా జవాబు ఇచ్చింది పాప .



ఎర్ర కారు


డాక్టర్ పిచ్చేశ్వర రావు పేషెంట్ ను ,

" కుమార్ , ఎర్ర కారు అంటే మీకు అంత భయం ఎందుకు ? "

" ఏడు సంవత్సరాల క్రితం మా ఆవిడను ఎర్ర కారు వాడొకడు తీసుకువెళ్లి పోయాడు డాక్టర్ "

" ఓ.కే. , మరి భయం దేని గురించీ ? "

"మళ్లీ వాడు మా ఆవిడను తీసుకొచ్చి అప్పగిస్తా డేమో అని డాక్టర్ "

నీకు నాకు మధ్య

మౌన గీతం ,
ఉదయరాగం ,
కుంచెగీత ,
అక్షరచిత్రం ,

హృదయాల అద్వైతం ,

ఇంకేం వున్నాయ్ చెప్పు ?

ఉంటే అవి కూడా ........... .

వస్తాదు



"అందర్నీ తన కండలు చూపి భయపెడుతుంటాడే , ఆ వస్తాదు భీమారావు ఆ పెద్దావిడను చూసి అలా తలదించుకొని వెళ్లి పోయడే " అడిగాడు రాము ఆశ్చర్యంగా .

"ఆ పెద్దావిడ అతని అత్తగారులే " విషయం చెప్పాడు కిరణ్ .

అప్పుడే



అప్పా రా వు తన భార్య అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి బయలుదేరాడు.అంతలో ఉరుములు , మెరుపులతో పెద్ద వర్షం మొదలయింది .

" అప్పుడే అక్కడకు చేరిందా ?," మా ఆవిడ అని ఆశ్చర్యపోతూ ఆకాశం వంక చూసాడు కళ్లు పెద్దవి చేసుకొని .