హిట్లు సున్నా

*
" బ్లాగు మొదలుపెట్టి ఆరునెలలు అయింది రా .ఒక్క హిట్టు కూడా రాలేదు "

" ఇంతకీ ఒక్క టపా అయినా రాసావా "

కలిపి కూడితే

*
రేమాండ్స్ సూట్ లో పబ్ కు వెళ్ళే ఓ పేద యువకుడు , పబ్ ఓనర్ కూతుర్ని
ప్రేమించాడు .ఆమె కూడా సరేనంది .ఆమెను తనకిచ్చి పెళ్లిచేయమని అడిగాడు
కా.మా.(కాబోయే మామగారు ) ను ,

కా.మా . :" ముందు నీ సంపాదన ఎంతో చెప్పు నెలకు "

పే.యు . : " నెలకు 60 వేలు "

కా.మా . : "మా అమ్మాయి చేతి ఖర్చులకే నెలకు 50 వేలిస్తా ,తెలుసా ? "

పే.యు . : " అది కూడా కలుపుకొనే చెప్పానండీ "

నిచ్చెన

*
వినోద్ ,వంశీ ల సంభాషణ :

"మొన్న మా ఇంటికి రంగులు వేయిస్తుంటే , పని వాడొకడు 30 అడుగుల
నిచ్చెన పై నుండీ పడిపోయాడు రా "

"వాళ్ల వాళ్ళంతా వచ్చి గొడవ చేసి , నీ దగ్గర ఎంత లాగారేంటి"

"నేనొక్క పైసా కూడా ఇవ్వలేదు "

" ఎలా మానేజ్ చేసావు ? "


"అంత అవసరం ఏం లేదు .వాడు పడింది నిచ్చెన మొదటి మెట్టు పై నుండే "

కొత్త కాపురం

*
జానకిరామ్ కు కొత్త గా పెళ్లి అయ్యింది . అమ్మాయిని కాపురానికి దింపటానికి
తోడుగా వచ్చాడు తండ్రి .వచ్చి వారమైనా కదలలేదు .

"ఇంకెన్నాళ్ళు ఉంటాడు మీ నాన్న ?, పానకం లో పుడకలా మన మధ్య "

"పాపం ఆయననేమీ అనకండి .ఓ నెల రోజులుండి మీకు వంట నేర్పి రమ్మని
చెప్పి పంపింది మా అమ్మ"

పని -సుఖం

*
"రాజూ ! బాస్ అంత్యక్రియలకు బయలుదేరుతున్నావా నువ్వు ?"

"లేదు నేను రావట్లేదు "

" ఏం "

"ఆఫీసు పని చేస్తాను .నాకు పని ముందు , సుఖం తరువాత , అంతే "

అబద్దం ఆడరాదు

*
ఇద్దరు మందుబాబుల సంభాషణ :

"నువ్వెపుడైనా "లై డిటెక్టర్" ని చూసావా ? "

"చూడటమేమిటీ ?, ఒకదాన్ని పెళ్లి చేసుకుంటేనూ !"

రోజూ సినిమా

*
రాష్ట్రంలో పేరున్న పెద్ద మనుషులిద్దరు ,మందు కొడుతూ మాట్లాడుకుంటున్నారు.

"ఆర్నెల్ల నుండీ వచ్చిన ప్రతి సినిమా చూస్తున్నారా .దాంతో బుర్ర పిచ్చెక్కిపోతోంది ."

"సినిమాలు ఎక్కువ చూడనొడివి, హటాత్తుగా ఇలా ఎందుకు మారావ్ ?"

"నీ మతిమరపు మండా .సెన్సార్ బోర్డ్ మెంబర్ అయ్యింతరువాత చూడక తప్పదు గదా !"

తిరుగు లేని టపా


వర్ధమాన రచయిత్రి వాణి ,తన ఫ్రెండు పార్వతి తో మొరపెట్టుకుంది బాధగా ,

"ఈ మధ్య పత్రికల ఎడిటర్లందరూ మహా దుర్మార్గులైపోయారే బాగా. నా కథలు
నచ్చకపోతే ,వాళ్ళే ఎదురు స్టాంపులంటించి వెనక్కు పంపుతున్నారే "

"నీ రచనలు తిరిగిరాని మార్గం చెప్పనా ? " అనునయిస్తూ అంది పార్వతి .

"చెప్పవే " ఆశగా అడిగింది వాణి .

"టపాలు బ్లాగు లో పోస్ట్ చేయి , తిరిగిరావు "

గురువు వయస్సు

*
స్వామి సహస్రానంద హిమాలయాల నుండీ నేరుగా విజయవాడ వచ్చి ఓ
పెద్ద మనిషి ఇంట్లో మకాం వేసారు .కవరేజ్ కోసం వెళ్ళిన మీ TV 420
రిపోర్టర్ను అనుమతించలేదు.

ఆ రిపోర్టర్ ఓ కిటికి పక్కన మాటువేసి,గదిలో హడావిడిగా అటూ,ఇటూ
తిరుగుతున్న ఓ శిష్యుని చేతిని వొడిసి పట్టుకొని ,ముఖం మీద మైకు పెట్టాడు.
కళ్ళలో ఫ్లాష్ వేసి అడిగాడు ,

"స్వామీ !మీ గురువుగారి వయసు 1000 సంవత్సరాలని చెబుతున్నారు.
నిజమేనా ?"

"నాకు సరిగా తెలీదండీ . నేనొచ్చి 500 ఏళ్ళే అయ్యింది" అంటూ చెయ్యి లాక్కొని
హడావిడిగా వెళ్ళిపోయాడు ఆ శిష్యుడు.

కవలలు

*
మా ఫ్రెండ్ కు కవలలు పుట్టారని తెలిసింది .నాకు తీరిక దొరికి ఫోన్ చేసేసరికి
మూడు నెలలయ్యింది.

"కంగ్రాట్స్ రా కృష్ణా ! లేటైనా ఇద్దరిని ఒకేసారి కొట్టే శావు.అవున్రా !కవలలిద్దరు
ఒకే పోలికతో ఉంటారు కదా .ఎవరెవరో ఎలా కనిపెడుతున్నావు ? "

"ఏముందిరా ! హరీ కి చొక్కా తొడుగు తున్నాము .గౌరికి గౌను వేస్తున్నాము,
దాంతో మాకేం ఇబ్బంది లేదు."

దొంగ - పరుగు

*
ఉష , రాధికతో చెప్పింది బాధగా

"ఈ రోజు ఇంటి ముందు ముగ్గేస్తుంటే, ఓ దొంగ వెధవ నా మెళ్ళో ఉన్న
10 కాసుల బంగారం గొలుసు తెంపుకు పారిపోయాడే "

"నువ్వు పరుగులరాణివి కదా !, పట్టుకోలేక పోయావా ? "

" ఇంట్లోకెళ్ళి షూస్ వేసుకొని ,లేస్ కట్టుకొని వచ్చే సరికి మాయమై పోయాడే దొంగవెధవ "

రెండు వరాలు

*
డోసు బాబు గుర్రమెక్కాడు. కాలువలో పడ్డాడు .అతనికో సీసా దొరికింది .
మందనుకొని మూత తీసాడు .ఓ భూతం బయట కొచ్చింది .

"హాయ్ ! నీకు లక్ష నెనర్లు . 420 ఏళ్లకు నన్ను బయటకు తీసావు .
రెండు వరాలిస్తా, కోరుకో " అంది .

"ఎన్నటికీ ఖాళీ కాని బ్రాందీ బాటిల్ ఒకటి కావాలి " కోరాడు డోసుబాబు .

అడిగింది ఇచ్చింది భూతం . ఎత్తిన బాటిల్ దించలేదు బాబు.

మత్తులో బాబు ,గాలిలో భూతం , ఆరు రోజులు ఇది మారని సీను .

ఏడోరోజు కొంచం తల ఎత్తాడు బాబు ,ఇదే అదననుకొని రెండో వరం
కోరమంది భూతం .

" ఇలాంటిదే మరో బాటిల్ ఇవ్వు " అన్నాడు బాటిల్ ఎత్తి
తాగటానికి రెడీ అవుతూ డోసుబాబు .

బోరు

*
" T.V. చూస్తుంటే బోర్ గా ఉంది .బయటకు వెళ్దాం నాన్నా ! "

"ఏమండీ ! నాకూ T.V. చూడటం తో తలనెప్పి వచ్చింది .పార్క్ కెళ్ళి
రిలాక్స్ అవుదామండీ ."

" 24 గంటలూ T.V. చూస్తే అంతే మరి " అని విసుక్కుంటూ చొక్కా
తొడుక్కున్నాడు కుటుంబ రావు .

నల్లని కురులు

*
"దేవీ ! నీ నల్లని కురుల రహస్యమేమీ ? "

" రోజూ తప్పకుండా హెయిర్ డై వాడతాను స్వామీ ! "

బ్లాగు హిట్లు


*
బ్లాగు మిత్రుల సంభాషణ :

" నా బ్లాగుకు ఒక్క రోజులో 20 వేల హిట్లు వచ్చాయి . "

"ఎన్నింటికి వచ్చిందేమిటి కల ? "

మొదటి బహుమతి

*
"ఏమండీ ! ఫ్యాన్సీ డ్రెస్ పోటీ లో "కలకత్తా కాళి " వేషం వేస్తే రెండో బహుమతి
వచ్చిందండీ ! " గర్వంగా భర్తతో చెప్పింది భవాని

"మేకప్ లేకుండా వెళితే మొదటి బహుమతి వచ్చేది కదా " అన్నాడు భవాని పతి.

ఎవరు గొప్ప ?


ఆంధ్ర దేశం లో పూర్వం వీరభద్రుడు, కాళీ పుత్రుడు అనే గొప్ప మాంత్రికులు
ఉండేవారు. ప్రజలు తమ కష్టాలు పోగొట్టుకోవటానికి కాళీ పుత్రుని వద్దకు
ఎక్కువగా వెళ్ళేవాళ్ళు .అలాఅని వీరభద్రుడేమీ తక్కువ కాదు. అతని పేరు
చెబితేనే భూతాలు, దెయ్యాలు భయంతో వణుకుతూ పారిపోయేవి .

ప్రజలు కాళీ పుత్రుని ఎక్కువగా ఆదరించటానికి గల కారణాలు తెలుసుకోవాలని
వీరభద్రునికి అనిపించింది .

శాస్త్రవిషయాలలో తామిద్దరూ సమవుజ్జీలు .ఎంత ఆలోచించినా వేరే కారణాలేవీ
తెలియలేదు .ఈ విషయం కాళీపుత్రునే అడగాలని వెళ్ళాడు వీరభద్రుడు.

ప్రశ్న విని కాళీపుత్రుడు నవ్వుతూ ఇలా చెప్పాడు

"వీరభద్రా!నా కంటే నువ్వే ఎక్కువ దెయ్యాలను వదలగొట్టావు .కానీ నేను

ఒకదాన్ని కట్టుకొని ,20 ఏళ్ళ నుండీ కాపురం చేస్తున్నాను ."

వీరభద్రుడు వెంటనే దాసోహం అంటూ కాళీపుత్రుని కాళ్ళపై పడ్డాడు.

కష్టాలు


"రాధీ! నీ కళ్ళల్లోకి అలా చూస్తుంటే నా కష్టాలన్నీ మరచిపోతున్నా "

"మనకింకా పెళ్లి కాలేదు కదా ,అప్పుడే నీకు కష్టాలేంటి రాజూ !"

చేతినిండా పని"ప్రపంచం లోని స్త్రీ ,పురుషులందరికీ చేతినిండా పని కల్పించటం ఎలా ? "
అన్న విషయం మీద ఓ సైంటిస్ట్ ౩౦ ఏళ్ళు పరిశోధన చేసి ,కనుగొన్న
పరిష్కారం

"ప్రపంచం లోని స్త్రీ లందరినీ సముద్రానికి ఒకపక్క ,పురుషులందరినీ మరోపక్క
ఉంచితే ,అందరూ పడవలు తయారు చేసుకొనే పనిలో పడతారు ."

తెలీదు పాపం

పుణ్య దంపతులెవరో ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు .
ఆయన ఆవిడ కొప్పు పట్టుకున్నాడు .ఆమె ఆయన జుట్టు పట్టుకుంది .

అది చూస్తున్న రాణి మొగుడితో

"ఎంత మొగుడు కొప్పట్టుకుంటే మాత్రం ,అలా జుట్టు పట్టుకుందేంటి ?"

" ఆమెకు నీలాగా గొంతు పట్టుకోవటం తెలీదు పాపం " లోగొంతుకతో అన్నాడా భర్త .

మీరే కరక్ట్


భార్యా భర్తల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది .

"నువ్వు చాలా మంచి దానివని ,నన్ను ప్రేమిస్తున్నావనుకొని చేసుకున్నా నిన్ను "

" తెలివితక్కువదాన్ని ,నేను అట్టాగే అనుకున్నాను . మీరే కరక్ట్ "

ఆ మాత్రం తెలివి ....


"ఏమండీ ! అమ్మాయి పెద్దదైయింది .తొందరలో పెళ్లి చేయాలి.
సంబంధాలు చూడండి "

"నిదానంగా చూద్దాం.తొందరపడి ఏ సన్నాసి కో ఇచ్చి చేస్తే ,
పిల్ల కష్ట పడుతుంది ." అన్నాడు బద్దకపు మొగుడు .

"ఆ మాత్రం తెలివి మా నాన్నకు లేకపోయింది "సణిగింది ఆ ఇల్లాలు .

రోబోట్


రోబోట్ల ఎక్సిబిషన్ జరుగుతోంది .సేల్స్ మాన్ ఒక రోబోట్ గురించి

"ఈ రోబోట్ కదలకుండానే మీ ఇంట్లో ఉన్న దుమ్ము ,ధూళి ,బూజు అన్నీటి
గురించి మీకు చెబుతుంది .న్యూస్ పేపర్ చదివి వినిపిస్తుంది ."

"తనేం శుభ్రం చేయదా " అడిగిందో ఇల్లాలు .

"ఆ సదుపాయం దీంట్లో లేదు మేడం "

"ఆ మాత్రం దానికి ఇదెందుకు ?, ఆ పని మా ఆయనే చేస్తాడుగా రోజూ ,
కుర్చీలో కూర్చుని అరుస్తూ " పెదవి విరిచింది ఆ ఇల్లాలు .

తెలుగు పాట


ఈ రోజుల్లో అమెరికా లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ,ఆ గొర్రెల తోక పట్టుకుని
గుండు కొట్టిచ్చుకొన్న ఆర్ధిక సంస్థలు ఒక తెలుగు పాట లోని చరణాన్ని
బృందగానం చేస్తున్నాయి .


అది మీకు తెలుసా ?


"అంతా మట్టేనని తెలుసు , అదీ ఒక మాయే నని తెలుసు ,తెలిసీ తెలిసీ ..............."

గిరీష్ భార్య


చిన్నప్పటి మిత్రులు గిరీష్, రమేష్ చాలా కాలానికి కలుసుకున్నారు .

గిరీష్ తన భార్య గురించి చెపుతూ

"మా ఆవిడను చూసి , ఎంత పెద్ద మగాడైనా నోరు తెరవాల్సిందే ."

" మీ ఆవిడ అంత అందం గా ఉంటుందా ? " అడిగాడు రమేష్ .

"లేదు , ఆవిడ పళ్ళ డాక్టర్ " అసలు విషయం చెప్పాడు గిరీష్ .

పక్కింటి పిన్నిగారు


వారం రోజుల క్రితం ,తమ పక్క వాటా లో అద్దెకు దిగిన కొత్త పెళ్ళికూతురు కామాక్షి తో మీనాక్షమ్మ ,

"ఏమే కామాక్షి ! తప్పుగా అనుకోకపోతే ఓ చిన్న మాట.మీ ఆయన రోజూ కొత్త అమ్మాయిలను వెంటేసుకొని వూరంతా తిరుగుతూ ఉండటం మా ఆయన చూసారు . నీకు తెలుసా ?"


"తప్పదండీ పిన్నిగారు ,అంతా తెలిసే చేసుకున్నా .ఆయన టూరిస్ట్ గైడ్ మరి ." నవ్వుతూ చెప్పింది కామాక్షి .

బస్సు సంభాషణ


హైదరాబాద్ . అందరూ ఆఫీసులకు ,కాలేజీలకు ,స్కూళ్ళకు వెళ్ళే టైము .ఓ రష్ గా
ఉన్న బస్ లో వినిపించిన మాటలు ,

"తమ్ముడూ! అలా మీదపడి తగులు కుంటూ నుంచోపోతే ఇటు పక్కకు రా ."

"అక్కడ మీ అమ్మాయి ఉందిగా "

"పోనీ అటు నుంచో "

"మీ కోడలుంది కదా "

"సరే నా పక్కన నుంచో "

" అలాగే అక్కా !"

ప్రహ్లాదం


హిరణ్యకశిపుడు, తన ఆంతరంగిక మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు
చేసాడు .ప్రహ్లాదుని మార్చటం ఎలా? అన్నదాని మీద చాలా చర్చ జరిగింది .

ప్రహ్లాదుని బడి మార్చి , ఆంధ్రప్రదేశ్ లోని కార్పోరేట్ రెసిడెన్సియల్ స్కూల్ లో వేయాలని నిర్నయించారు .

అలాగే చేసారు . కాని హరి నామం విడువలేదు ప్రహ్లాదుడు .ఎందుకిలా జరిగిందని
అందరు తలలు పట్టుకొన్నారు.వాళ్ళలో ఒకడికి బల్బ్ వెలిగింది .

ప్రహ్లాదుని స్కూల్ పేరు " నారాయణ రెసిడెన్సియల్" అని .

పని లేని దెయ్యం


ఓ ఋషి ధ్యానం ముగించి కళ్లు తెరిచాడు . తనకు కొద్ది దూరం లో ఓ దెయ్యం నీరసంగా కూర్చుని కనిపించింది .

"ఓ దెయ్యమా !ఏ అల్లరి ,ఆగం చేయకుండా నీరసం గా ఉండిపోయావేమిటి ? " పలకరించాడు ఆయన .

"లోకం లో వందల కొద్ది బాబాలు, స్వాములు తామే దేవుళ్లమని చెప్పుకు తిరిగేస్తూ ఉంటే ,ఇంకా నాకేం మిగిలింది చేయటానికి ? " నిరాశగా పలికింది ఆ దెయ్యం .

ఉచితం

విజయవాడలో కొత్త వ్యాయామశాల(జిం) తెరిచాడు వీరాంజనేయులు. జిం ముందు ఇలా బోర్డ్ పెట్టాడు.

"మా జిం లో చేరిన ప్రతివారికీ ఈత పూర్తిగా ఉచితం "

అంకారావు అడిగాడు ఉత్సాహంగా "ఈత ఎక్కడ సార్ మరి ? "

"కృష్ణ లో " బదులిచ్చాడు వెంటనే వీరాంజనేయులు.