సొంత నవ్వు

*
నా నవ్వుని ఎక్కడో పారేసుకున్నాను .నిజమేనండీ , అచ్చంగా ,అక్షరాలా నా సొంత నవ్వుని
ఎక్కడో పారేసుకున్నాను .రకరకాల నవ్వులని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను .భర్త నవ్వు ,
తండ్రి నవ్వు ,ఫ్రెండ్ నవ్వు ,బాసు నవ్వు ,దాసు నవ్వు ,ఇలా ఎన్నో జేబులో ఉన్నాయి .శతకోటి
బంధాలకు , అనంతకోటి నవ్వులు . ఆ కోటిలో "నాకోటి " ఉందా ?. ఏమో , పక్క వీధిలో
పోగొట్టుకున్న కాసు,వెలుగున్న ఈ వీధిలో దొరుకుతుందా?.ఇంతకీ నా నవ్వు ఏమైంది ?.
తెలియని వెతుకులాట , తెలివిడి కోసం సాగుతోంది . నాకో అనుమానం .తెలివిడి వల్ల ఆనందం
పెరుగుతుందా ? లేక అజ్ఞానం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందా ? లేక ఎదుటివాడి అజ్ఞానం
మనకి నవ్వునిస్తోందా ? రసాభాస (అనుకున్నది జరుగక చతికిలపడితే జరిగేది ) నవ్వుకి
కారణమా ? . ఏం జరుగుతోంది ఇక్కడ , నవ్వు గురించి ఆలోచిస్తూ నన్ను నేను మరిచాను.
ఇంతకీ నా నవ్వు ఎక్కడ , ఇప్పుడే తెలియాలి . ముగ్గు వేసి అంజనం వేయించనా ? ,చిలక
ప్రశ్న అడగనా ? ,వత్తులు వేసిన కళ్లు కాచేలా ఎదురు చూడనా ? .స్వామీజీ ఎవరైనా
దొరుకుతారా ?, నెట్ బదులిస్తుందా ?

ఏదో వెలుగు దగ్గరౌతోంది .వెలుగుతో పాటు ఓ మధుర స్వరం వినిపిస్తోంది
"తనని వదిలి అందరిని లెక్కించే పరమానందయ్య శిష్యులలా ఉన్నవే .కస్తూరి మృగానికి
బంధువువా? నిన్నునీవు మరిచావే.అద్దె నవ్వుల సవ్వడిలో తానున్న నీ సొంతనవ్వుని చూడవే?
బంధాలన్నీ నీవేగా .నీవు కాదంటే లేవుగా .అది మరచి, నీవు స్తంభాన్ని పట్టుకొని ,నన్ను
విడిపించండి అన్నట్టు ఉంది .అన్నీ నీవే .ప్రతి నవ్వు నీదే .పొద్దుతిరుగుడు పువ్వంత
కళ్లు చేసుకొని చూడు . నవ్వుల తోట నీదే అవుతుంది "

బ్లాగు అద్దెకు ఇవ్వబడును

*
నవ్వులాట బ్లాగు అద్దెకు ఇవ్వబడును ,దానికి వలయు షరతులు :

౧. ఈ బ్లాగు నందు సంసార పక్షమైన జోకులు మాత్రమే రాయవలెను. ఇతరములు
రాసినా జోకులుగానే జమకట్టబడును .

౨. రోజుకు కనీసం వెయ్యి హిట్లు , పది కామెంట్లు రావలయును. లేకున్నఅద్దె అడ్వాన్స్
తిరిగి చెల్లించబడదు.

౩. చివరిది , కానీ ముఖ్యమైనది ఏమిటంటే , మీరు రాసిన రాతలు నా పేరు తోనే
ప్రకటించబడును .మీరు అజ్ఞాతలు గానే ఉండి ఆనందించవలెను

పద చిత్రాలు

*
నీ జ్ఞాపకాలలో
నేనుండాలని
అనుకోవటం లేదు
నా జీవితమంతా
నీవే నిండాలని
కోరుకుంటున్నా
********
కవుల భావాలు
ఒంటరి రహదారులు
కవితలు దూరాల్ని
సూచించే మైలురాళ్ళు
**********
నీవెవరు ?
నేనెవరు ?
కలిశామా మనం (? )
లేకుంటే రణం
******

నా బుర్ర















.... ఖాళీ గా ఉంది .అందుకే జోకులు రాయట్లేదు .తెలుగు వాడిని కాబట్టి పక్కన వారి
బుర్రలు అరువు తెచ్చుకోను ,వాళ్ల బుర్రల్ని నమ్మను కాబట్టి .కాబట్టి ఇది చదివిన
వారందరూ నా బుర్ర లో నవ్వుల ముడి సరుకు ఉంచమని దేవుడిని కోరండి...

దురద సూత్రములు

౧. దురద పుట్టిన చోటే గోక్కోవాలి

౨. దురద పుట్టినపుడే గోక్కోవాలి

౩. గోక్కున్న చోట మళ్ళీ దురద పుడుతుంది

ఇవి బ్లాగు రాతలకు వర్తిస్తాయి ,షేర్లకు వర్తిస్తాయి ,జీవితం లోని అన్నింటికి వర్తిస్తాయి .
నాకు తెలుగు బ్లాగులను చూసిన తరువాత తెలుగులో జోకులు రాయాలని దురద పుట్టింది.
అదీ బ్లాగుల్లోనే రాయాలని పించింది . బాగా గోక్కున్నాను ,ఒక సంవత్సరం ఆపకుండా రాసి
ఒక రికార్డ్ తయారు చేసుకొన్నాను .ఒకసారి ఆగి చూసుకున్నాను,ఈ నెల మొదట్లో.నా జోకులు
రాశి ( శిరా ని తిరగేస్తే వస్తుంది .శిరా ఎక్కువ వాడితే రాశి పెరుగుతుంది ) లో ఎక్కువా ?,
వాసి (వాసనకి దగ్గరగా ఉండే పదం) కూడా ఉందా అని అనుమానం వచ్చింది .సరే ,
ఆచరణ లో చూస్తే పోలా అని అనిపించి నాలుగవ తారీఖునుండీ దూరంగా ఉండిపోయాను.
ఏమో మరి మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతానో ,దైవాధీనం నవ్వులాట ...........................

భోజనం

*
ఆదివారం ఉదయాన న్యూస్ పేపర్ చదువుతూ ఆదినారాయణ పెరట్లోని భార్యతో అరిచి చెప్పాడు,

"ప్రియా ! ఇవాళ మా కొత్త కొలీగ్ చిరంజీవిని మనింటికి మద్యాహ్నం భోజనానికి పిలిచానే "

అదివిన్న శ్రీప్రియ వరండా లోకి ఉరికి భర్తతో అంది ,

" ఎవరి నైనా భోజనానికి పిలిచేముందు నాతో ఒక ముక్క ముందే చెప్పమన్నానా ,లేదా ?

ఇల్లు చూశారా , ఎంత దరిద్రం గా ఉందో , ఇల్లంతా విడిచిన బట్టలు , సింక్ లో అంట గిన్నెలు ,
రంగి రాక మూడు రోజులయ్యింది, ఇంట్లో కురలేవీ లేవు .అసలే పని తెమలక చస్తుంటే
ఈ తద్దినం తెచ్చి పెట్టారు మీదకి "

"తెలిసే పిలిచాను , ఆ వెధవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు,చూసి మారతాడని "

లక్షాధికారి

*
రాజు షేర్స్ కంపెనీ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే పానకాలరావు , దామోదరం ఇంటికి
వెళ్ళాడు , తమతో అకౌంట్ తెరిస్తే ఎంత లాభమో చెప్పటం మొదలు పెట్టాడు ,

" సార్, మీరు మా సలహాలు విని షేర్లు కొనండి . ఖచ్చితం గా మీరు లక్షాధికారి అవుతారు ,
రెండేళ్ళలో "

అది విని దామోదరం కోపంగా లేచి చాచి పానకాల రావు ని లెంపకాయ కొట్టి "గెటౌట్ "
అన్నాడు .

చెంప తడుముకుంటూ పానకాల రావు దీనంగా అడిగాడు ,

" ఎందుకు సార్ కొట్టారు ? "

" నేను ఇప్పటికే కోటీశ్వరుడిని , నన్ను లక్షాధికారిని చేస్తావా ? "అంటూ మళ్ళీ కొట్టబోయాడు
దామోదరం .

ఏడుపు

*
హరి పిల్లి చనిపోయింది .దాంతో హరి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు .అది చూసి పక్కింటి దినేష్
ఒదార్చ సాగాడు .

"దాని కోసం నువ్వు ఎందుకు ఇంతలా ఏడుస్తావు ? , నన్ను చూడు , మా తాతయ్య చనిపోయాడు
నిన్న ,మరి నేనేమన్నా ఏడుస్తున్నానా ? "

" మీరు మీ తాతయ్య ని పెంచలేదు కదా ! , నేను ఈ పిల్లి ని పెంచాను "