బొద్దింక

*
నరసింహం,సింహాద్రి తో చెప్పి బాధ పడ్డాడు ,

"నేను బొద్దింకగానో , బల్లిగానో పుడితే బాగుండేది రా "

"అదేంట్రా , ఏం కష్టమొచ్చింది నీకు ? "

" ఏం చెప్పనూ, మా ఆవిడకి బొద్దికలు, బల్లులు అంటే చచ్చేంత భయం ,అందుకే "

సందేహం

*
తల్లి మల్లికతో కలిసి తిరుమలరాయుడి గుడికి వెళ్ళాడు చిన్నికృష్ణ.వెంకటాచలపతిని దర్శించారు.
ప్రసాదాన్ని పుచ్చుకొన్నారు .

గుడి ఆవరణ లో పురాణ ప్రవచన భీమ "శంకరవోలు చినసుబ్బారావు " గారి ప్రసంగం గంగా
ప్రవాహం లా సాగుతోంది,

"నాయనలారా ! భగవంతుని సృష్టి చాలా విచిత్ర మైనది .ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు
పిల్లలూ ఒకేలా ఉండరు .ఒకరు దొంగ అవుతారు .ఉంకొకరు జడ్జ్ అవుతారు "
అని ఒక్క క్షణం ఊపిరి తీసుకోవటానికి ఆగారు

ఖాళీలో వింటున్న చిన్నికృష్ణ లేచి నిలబడి తన సందేహం వెలిబుచ్చాడు ,

"ఏమండీ ,మరి జడ్జ్ గారు, తన అన్నకి శిక్ష వేస్తారా , వెయ్యరా ? "

టపాకాయలు

*
శివకాశీ లో ఉండే తంగవేలు కి ,తను తయారు చేసే టపాకాయల విషయం పూర్తిగా తెలియటం
వల్ల ఎప్పుడూ భీమా జోలికే పోలేదు.కానీ ప్రభుత్వం చేయక తప్పదని నిభందన పెట్టటంతో
అయిష్టం గానే భీమా చేయక తప్పట్లేదు .

రోజు విషయమై తనను కలిసిన భీమా ఏజెంట్ తో చెప్పాడు విసుగ్గా ,

" నా వంటికి భీమాలు, గీమాలు పడవు .నువ్వు ఇంకా అదృష్టవంతుడివి,గత వారం నుండీ
నన్ను చూడటానికి వచ్చిన పది మంది ఏజంట్ల మొహం కూడా నేను చూడలేదు "

భీమా ఏజంట్ చెప్పాడు వినయంగా ,

" విషయం నాకు తెలుసు . పది మంది ఏజంట్లు నేనేనండీ "

దుప్పటి

*
లత , తన భర్త గోపీ తో ,

" నిన్న వచ్చిన మోహన్ కి దొంగ బుద్దులున్నాయా " అంది

" లేవు , వాడు నిప్పు , అయినా నీకెందుకు వచ్చింది అనుమానం ? "

"నిన్నరాత్రి ఆయన మంచం మీద వేసిన కొత్తదుప్పటి,తన సంచీలో పెట్టుకుపోయాడు "

" కొత్త దుప్పటి ? "

" అదే , దుప్పటి అంచు మీద శరవణభవన్ అని రాసి ఉంటుందే , అది "

"సరే , వాడు మొన్నవారం లో శరవణభవన్ లో మేనేజర్ గా జేరాడులే "

నది లో బస్సు

*
అలవాటుగా ఆర్.టీ.సి. బస్సు నదిలో పడిపోయింది .అదృష్టంకొద్దీ నదిలో నీరు మొదటి
ప్రమాద హెచ్చరిక కు కొద్ది దిగువగా ఉంది .వేగం కూడా ఎక్కువ లేదు .

గజ ఈతగాళ్ళు రంగంలోకి దిగారు .ఒక్కొక్కరిని రక్షించి ఒడ్డుకి చేరుస్తున్నారు.

అలా పైకి చేరిన ధనకుమార్,మళ్ళీ వెంటనే నదిలోకి దూకేసాడు.పక్కనున్న స్నేహితుడు,
ఎదురుగా ఉన్న శిరీష్ ని అడిగాడు

"ఏరా ! ధన్ గాడు మళ్ళీ నదిలోకి దూకాడు ఎందుకు ? "

" బస్సు కండక్టర్ వీడికి రెండు రూపాయలు చిల్లర బాకీ పడ్డాడు , వసూలు చేసుకోవటానికి "

వీరికి కొద్ది దూరం లో ,


గజ ఈతగాడు , అప్పుడే ఒడ్డు కొచ్చి అలుపు తీర్చుకొంటున్నాడు.ఇంతలో ఒకామె ,

" నా పిల్లాడిని ఒడ్డుకి తెచ్చింది నీవేనా ? " అని అడిగింది

" అవును " అన్నాడు అతను

" అయితే వీడి జేబులో రెండు ఎక్లైర్స్ చాక్లెట్లు ఉండాలి , వాటిని ఏం చేసావ్ ,పిల్లాడి
చాక్లెట్లు తినటానికి సిగ్గు లేదూ " విరుచుకు పడింది ఆమె

ఇక నదిలో ,


ధన్
కుమార్ తన ముందున్న కండక్టర్ ని పట్టుకోవటానికి వేగంగా ఈదుతూ కేక
పెడుతున్నాడు ,

"కండక్టర్ , నువ్వు నాకు చిల్ల రెండు రూపాయలు ఇవ్వకుండా తప్పించుకో లేవు "

కండక్టర్ తన ముందున్న ప్రయాణికుని వేపు వేగం గా ఈదుతూ అరుస్తున్నాడు ,

"ఏమండీ , బస్సు వంతెన ఎక్కే ముందు ఎక్కి టికట్ తీసుకోకుండా ఎక్కడికి వెళతారు ? ,
టిక్కెట్ కొట్టేశాను , డబ్బులిచ్చి వెళ్ళండి " అంటూ

సస్పెన్స్

*
వెంగళరావు , పరమానందయ్య ని అడిగాడు ,

"పరమానందం!ఒక బుర్ర తక్కువవాడిని బాగా సస్పెన్స్ లో ముంచటం
ఎలాగో నీకు తెలుసా? "


"
తెలీదు , నీకు తెలిస్తే చెప్పచ్చు కదా "


" రేపు చెబుతాలే " అని వెంటనే వెళ్ళిపోయాడు వెంగళరావు .

పాటగాడు

*
క్యూ టీవీ వారి " పాటగాడు -పోటుగాడు" లో యాభై ఎపిసోడ్లు పాల్గొని , అందరిలో పోటుగాడిగా

ఎన్నికయ్యాడు త్రివిక్రమ్ .

అలాంటి వాడు , ఎందుకో తేడా చేసి , మానసిక వైద్యుడి దగ్గరకి వెళ్ళాడు .ఆయన అడిగారు ,

"మీ సమస్య ఏమిటీ ? "

" మధ్య ఎప్పుడు ఘంటసాల పాటలు పాడుతున్నా , నా చెవిలో ఎవరో "పాడద్దు,ఆపు "
అన్నట్లు వినిపిస్తోందండీ "

" గొంతు ఎవరిదో మీరు గుర్తుపట్టగలిగారా ? " అడిగారు డాక్టర్

" గుర్తుకొచ్చింది " అంటూ ఒక్క క్షణం ఆగాడు త్రివిక్రమ్ .

" ఎవరిదీ , చెప్పండి "

" అది ఘంటసాల గారి గొంతు " చెప్పాడు త్రి .

మిఠాయి

*
రాత్రి పది గంటలు దాటింది .తన మిఠాయి దుకాణం మూసేసి ఇంటికెళ్ళటానికి తయారయ్యాడు
గురవయ్య .

ఇంతలో వెక్కి వెక్కి ఏడుస్తూ చిన్నిపాప ,ఆవెనకే ఆమె తల్లి దుకాణం లోకి అడుగు పెట్టారు .

తల్లి అడిగింది ,

" మిఠాయి ఉందా ? "

గురవయ్య ఒక్క క్షణం ఆగాడు ,ఆలోచిస్తూ .ఇవాళ పొద్దున్న తన ముసలి తల్లి అడిగింది ,
వచ్చేటప్పుడు కొద్దిగా మిఠాయి తెమ్మని . తన మనవరాలు కూడా "నాతూ " అంది .ఇప్పుడు
అంతా అమ్ముడు పోగా , చిన్న అచ్చు మిగిలింది . అమ్మాలా ? , ఇంటికి తీసుకెళ్ళాలా ?

ఇంతలో పిల్ల ఏడుపు శృతి పెంచింది.తల్లి అరిచింది ,

" రూపాయి ఎక్కువ తీసుకొన్నా పరవాలేదు ,దీని ఏడుపు భరించలేక చస్తున్నా .ముందు
ఇవ్వు ".

గురవయ్య నెత్తికి డబ్బు ఎక్కింది .తన దగ్గరున్నది , తీసి తూకం వేసాడు .పావు
కిలో ఉంది .తల్లి అంది

" ఇంకాస్త పెద్దది ఉంటే చూడు "

ఆమెను కబుర్లలో పెట్టి గురవయ్య , మిఠాయి ని లోపల పెట్టి , మళ్ళీ అదే అచ్చుని బయటకు
తీసాడు .దాన్ని త్రాసులో పెట్టి బొటనవేలితో కనపడకుండా నొక్కి ఉంచాడు . ఈసారి తూకం
నాలుగు వందల గ్రాములుంది .

వచ్చినామే తల పంకించి ,

" సరే , ముక్క , చిన్నముక్క రెండు కలిపి ఇవ్వు ,దీని ఏడుపు చూడలేక చస్తున్నా "
అని , డబ్బులు బయటకు తీసింది .

మేకప్

*
అవినాష్ కారు హైటెక్ సిటీ వైపు వేగంగా దూసుకెళుతోంది . రోజు నిద్ర లేవటం లేటయ్యింది.
ఆఫీసుకి టైమయ్యింది.అతని కారు కి ముందు ఉన్న కారు , వేగంగా వెళ్ళటం లేదు ,అలా అని
దారి వదలటం లేదు. చూస్తే ,

ముందు కారుని నవల నడుపుతోంది .మాటిమాటికి అద్దంలో తన మొహం చూసుకొంటూ
మేకప్ వేసుకొంటోంది.

"
ఆడాళ్ళతో చచ్చే చావుగా ఉంది , ఎక్కడ పడితే అక్కడ అడ్డం పడిపోతారు.ట్రాఫిక్ లో
కూడా , ఇట్లా చెయ్యటానికి , సిగ్గు ఎందుకు ఉండదో వీళ్ళకి " అని తిట్టుకొంటూ
హటాత్తుగా బ్రేక్ వేసాడు కారు కి , షేవ్ చేసుకుంటున్న ,చేతిలోని జిలెట్ రేజర్
క్రింద పడి పోవటం తో

ఈడు ఒక ఏడు,నవ్వులాట కు నేటికి

*
మా పక్కింటి కుర్రాడు సిగరెట్లు తాగటం మొదలుపెట్టి మొన్నటికి సంవత్సరమైంది.

వాళ్ల నాన్న మందులో మంచినీళ్ళు మానేసి నిన్నటికి సంవత్సరం .

వాళ్ల అమ్మ తెలుగు సీరియల్స్ చూడటం మానేసి,వాటిలో నటించటం మొదలు పెట్టి కూడా
సంవత్సరమైయ్యింది .

కేతి గాడి బ్లాగు "నవ్వులాట " మొదలయ్యి సంవత్సరం పూర్తి అయ్యింది .


నేడే ఈనాడే మొదటి పుట్టిన రోజు


అరరే,బాధ పడకండి ,వీడు మనల్ని సంవత్సరం నుండీ కుళ్ళు జోకులు రాసి విసిగిస్తున్నాడా
అని . బాధకి అలవాటు పడండి , ఇక ముందు కూడా నాకు రాయక తప్పదు , అంతగా బానిస
నయ్యాను .

ఇంతకీ నాకెందుకీ బ్లాగు రాయాలన్న దురద పుట్టింది ?

నేను అన్నప్రాసన నాడు , పుస్తకం మీద చెయ్యేసి అలాగే పడుకుండి పోయానట. మావాళ్ళు
నాకు బాగా చదువు వస్తుందని ఆనంద పడ్డారు.కానీ నేను ఎప్పుడు పుస్తకం పట్టుకొన్నా
నిద్ర వచ్చేస్తుంది .

అది చూసి మా అమ్మగారు ,నాకు ఒక మంచి సలహా ఇచ్చారు ,

"నాయనా , పుస్తకం పట్టుకొంటే నీకు ఎలాగూ నిద్ర వస్తుంది కాబట్టి , కుదిరినప్పుడల్లా కొత్త
పుస్తకం పట్టుకో , నిద్ర వస్తే తలకింద పెట్టుకొని పడుకో " అని

తల్లి మాటను జవదాటకుండా ఈనాటి దాకా కొత్త పుస్తకాలు చేత బట్టుకొని నిద్రలోకి జారి
పోతున్నాను .

అలా సుమారు 20 వేల పుస్తకాల వరకు నిద్ర కి వాడుకొని ఉంటాను .

తెలుగు కవిత్వం , మతం , తత్వ శాస్త్రం ,మనో వైజ్ఞానిక శాస్త్రం,హాస్యం ,నవలలు,వ్యక్తిత్వ వికాసం,
జ్యోతిషం ,తంత్ర శాస్త్రం , యోగం అన్నీ వాటిలో ఉన్నాయి .చివరికి బజ్జీల కొట్టువాడు పొట్లం
కట్టిన కాయితం కూడా వదిలిన వాడిని కాదు .

అంతలో మా అమ్మ ,ముందుగా ఒక్క మాటైనా చెప్పకుండా మబ్బుల్లోకి మొహం చాటేసింది,
మళ్ళీ కనిపించనంటూ మొండికేసి తిరిగి రాలేదు , మొన్న 8-మార్చ్ -2008 .

అప్పటి నుండీ మనసంతా నిండిన వెలితి , తెలియని ఖాళీ ,ఆలోచనల చిక్కు ముడులు ,
మనిషి జీవితం గురించి ఎంత పుస్తకాల తెలివిడి ఉన్నా ,ఏమీ తెలియని తనం
అనుభవం లోకి వచ్చిందపుడే .

కాలం, కొంత కాలానికి మనసుకి కాస్త వూరట నిచ్చింది .జీవితం కొద్ది ,కొద్దిగా తెలియటం
మొదలయ్యింది .

"ప్రతి మనిషి , ఆఖరికి మూర్ఖుడు కూడా చేసే ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంటుంది .
ప్రయోజనం వారికి సంతోషాన్ని , ఆనందాన్ని ఇస్తుంది.కాబట్టి మనిషి పడే యాతన ,
దుఖం అన్నీ కూడా చివరికి వారికి ఎంతోకొంత స్వాంతనని, దాని ద్వారా పరిమితమైన
సంతోషాన్ని కలుగ చేస్తాయి . ఏడిస్తే మనసులో గూడు కట్టుకొన్న దిగులు కొంత పలచన
అవుతుంది కదా .అలాగే కొన్నిక్షణాలపాటు మనం నవ్వే నవ్వు , మన బాధలను దూరం
చేయలేక పోయినా కొద్ది క్షణాల పాటు మరపిస్తుంది "

భావంతో నా మనసు నిండి పోయింది.నా చుట్టూ ఉన్నవారిని కొద్ది క్షణాలైనా
సంతోషం గా ఉంచగలిగితే , నేను గానీ , వారు గానీ ఎప్పటికి ఇబ్బంది పడకుండా !

అలుపు రాని ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి ,అంతలో రెండు దీపాలు నాకు దారి
చూపించాయి . దీపాల పేర్లు "ఆంద్ర జ్యోతి , వల్లబోజు జ్యోతి " ,మే 2008 లో

వారు చూపిన బాటన కూడలి కొచ్చాను , జల్లెడ పట్టాను , 22-జులై -2008 .

అలా నా నవ్వులాట బ్లాగు మొదటి అడుగు వేసాను .

అడుగు లో అడుగు వేసుకొంటూ ఇక్కడకు చేరాను .

దొంగ వెధవ ఎవడు ? ,పిల్లిలా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు అని మీరు కూడా
నా వెనుక ఉండి , నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు .మొక్కుబడిగా రోజుకో జోకు రాసే నాకు
52000 హిట్లు నిచ్చారు .

అందుకు నేను సదా మీకు రుణపడి ఉన్నాను .

పయనం లో నా శ్రీమతి , నా పిల్లలు రోజూ నా జోకుల కధలు వోపిగ్గా వింటూ ,
నన్ను ఎంతో ఉత్సాహ పరిచారు .

నేనేదో పోటుగాడినని, జోకులు బాగా రాస్తానని , ఆంద్ర జ్యోతి వారు ఒకసారి మక్కీ కి మక్కీ
కాపీ కొట్టారు .మరోసారి నా బ్లాగు గురించి పొగుడుతూ రాసి నన్ను సంతోష పెట్టారు .

చివరాఖరికి చెప్పేదేమిటంటే ,

"నేనిలాగే జోకులు రాస్తూ ఉంటాను , మొహమాటానికైనా (సంవత్సరం పరిచయం మనది )
నవ్వుతూ , నాకు మీ అభిమానాన్ని , ఆశీస్సులను , అభినందనలను అందించండి ఎల్లపుడు "

ఇట్లు

మీ నవ్వులాట శ్రీకాంత్