పాపం పిల్లి

*
పద్మనాభరావు ,ఇరయై ఏళ్ల తరువాత తన ఫ్రెండ్ కుబేరరావు ఇంటికి వెళ్ళాడు,లోపలికి
వెళుతుంటే , ఒక చిన్ని బుజ్జి పిల్లి ఇల్లు తుడుస్తూ కనిపించింది .పద్మనాభం దాన్ని
కన్ను తిప్పుకోకుండా ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు .

ఆ చిన్ని పిల్లి ఇది గమనించి , అతని పక్కకి వచ్చి నెమ్మదిగా చెవిలో చెప్పింది ,

"అంతగా ఆశ్చర్య పోకండి సార్,ఇది నా పనిలో చాలా చిన్న భాగం "

ఈ సారి స్పృహ తప్పింది .పిల్లి మొహాన నీళ్లు చిలకరించింది .

"కుబేర రావు నిజంగా చాలా అదృష్టవంతుడు .నీలాగా పనిచేసే పిల్లి ,అంతే కాక మాట్లాడే
పిల్లి అతనికి దొరకటం నిజంగా చాలా గ్రేట్ " అన్నాడు తేరుకొని పద్మనాభం .


"అయ్యా ,దయచేసి నాకు మాట్లాడటం వచ్చని ఆయనకు చెప్పకండి .రేపట్నించీ నాకు
వచ్చే ఫోను కాల్స్ కి సమాధానం చెప్పే పని కూడా అంటగడతాడు , త్రాస్టుడు "

సతాయింపు

$
సోంబాబు,గిరిధర్ అంధేరీ బ్యాంక్ ఉద్యోగులు.కస్టమర్లతో బాగా బిజీగా ఉండే టైము లో వాళ్లు
క్యాంటిన్ లో కూర్చొని టీ తాగుతూ కబుర్లాడుకుంటున్నారు.సోంబాబు,

"గిరిధర్ , రోజు రోజుకీ నా జీవితం నరకమైపోతోంది. మా ఆవిడ పొద్దున్న లేచింది మొదలు
నిద్ర పోయేదాకా ఆపకుండా , ఏదో విషయానికి నస పెట్టేస్తునే ఉంటోంది.రోజు రోజు కి నా
మీద అనుమానం పెంచుకుంటోంది .ఓ వారం క్రితం ,నిద్దట్లో ఏదో కలవరించానట.తరువాత
రోజు పొద్దున వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ,నేనేం కలవరిస్తున్నానో ,అది అర్ధమయ్యే

విధంగా నేను పలికేట్టు మందు రాసిమ్మంది. ఇది ఒక్క రోజన్నా నోరు ముసుకు కూర్చుంటే
నాకు చాలనిపిస్తోంది "

" ఒక్క రోజు చాలా !.నేనయితే మా ఆవిడ నస ఇరయై ఏళ్ళు వినిపించుకోలేదు, తెలుసా ? "

"నువ్వు చాలా అదృష్ట వంతుడివి గురూ, ఆ తరువాత ఏమైంది ? "

"ఏముందీ , మాకు పెళ్లైంది "

పొరపాటు

&
ఆషాఅన్మోల్కర్ గొప్ప సహజ నటి .ఓ సినిమా కోసం కట్టెల పొయ్యి ముందు కూర్చొని వంట
చేసే సన్నివేశం లో అద్భుతం గా జీవిస్తోంది .ఇంతలో మంటలు పైకెగసి ఆమె వొళ్ళు బాగా
కాలిపోయింది .

వెంటనే ఆమెని ఆసుపత్రి లో జేర్చారు .ఒంటిపై స్పృహ లేదు.ఇంతలో ఆమెకు తను
ఎక్కడికో ఎగిరి వెళుతున్నట్లు అనిపించింది .కొద్ది క్షణాల తరువాత ఒక దేవ దూత
కనిపించాడు ,ఆమె ని చూసి కంగారు పడ్డాడు ,

"అమ్మా ! నువ్వు ఇప్పుడు ఇక్కడకు రా వలసిన దానివి కాదు .ఇంకా నీకు మూడు పదుల
ఆయువు మిగిలి ఉంది " అన్నాడు .

ఇంతలో ఆసుపత్రి బల్ల పై ఉన్నఆమె శరీరం కొద్దిగా కదిలింది .ఆ తరువాత ఆమెకి ప్లాస్టిక్
సర్జరీలు ఎన్నో చేసి , ఒక సంవత్సరం తరువాత డిశ్చార్జ్ చేశారు .

ఆమె కారులో ఆనందం గా ఇంటికి బయలుదేరింది . ఇంతలో రెండు వందల కిలో మీటర్ల
వేగం తో ఓ బుల్ డోజర్ వచ్చి గుద్దేసింది .ఈ సారి ఆమె నిజం గా చనిపోయింది .

పాత దేవదూత మళ్ళీ కలిసాడు . ఆషా అన్మోల్కర్ అతన్ని కోపంగా అడిగింది ,

"నా కింకా మూడు పదుల వయసు ఉందన్నావు .మరి అప్పుడే చచ్చానేమిటి ? "

"మీరా మేడం , ప్లాస్టిక్ సర్జరీ తరువాత ,మిమ్మల్ని గుర్తు పట్టలేక పోయాం "

పాలు

*
పింకీ బ్రష్ చేసుకున్నది మొదలూ,వాళ్ల అమ్మ వెనకాలే తిరుగుతోంది.నాన్నకి ఇచ్చినట్లు
తనకి టీ ఇమ్మని సతాయిస్తోంది.వినీ వినీ విసిగి వాళ్ల అమ్మ చెప్పింది ,

" పింకీ , నువ్వు కాంప్లాన్ పాలు తాగాల్సిందే. నువ్వు ఎంత ఏడ్చినా,సతాయించినా కూడా
టీ ఇవ్వను "

అయినా పింకీ హటం మాన లేదు .ఇంక చేసేదేమీ లేక తల్లి అనునయిస్తూ అంది ,

"పింకీ నీకు తమ్ముడు కావాలా ? , చెల్లి కావాలా ? "

"నాకు చిన్ని తమ్ముడు కావాలి "

"అయితే నువ్వు పాలు తాగు , టీ తాగితే చెల్లే పుడుతుంది "

" అమ్మా ! మరి కాఫీ తాగితే ఎవరు పుడతారు ? "

డిటెక్టీవ్

*
ఇంద్రుడు స్వర్గం లో మధ్య జరుగుతున్న అపరాధాలు అరికట్టటానికి ,డిటెక్టీవ్ యుగంధర్
ని శాశ్వతం గా స్వర్గానికి రప్పిద్దామని రహస్య మంత్రాంగం చేసాడు. విషయం యుగంధర్
కనిపెట్టేసాడు .తనకు వారసులుగా మంచి డిటెక్టీవ్ లను తయారు చేయటానికి ముగ్గురు
బాకుల్లాంటి చురుకైన కుర్రాళ్ళని ఎన్నికచేసి బాగా శిక్షణ నివ్వటం మొదలు పెట్టాడు .

కొన్నాళ్ల తరువాత ,

కుర్రాళ్ళు బాగా నేర్చుకున్నారా లేదా అని ఒక పరిక్ష పెట్టాడు . ముగ్గురిని వేరు వేరు గదుల్లో
ఉంచాడు .మొదటి వాడికి ఒక ఫోటో చూపించి అడిగాడు ,

"ఈమెని ఎలా పట్టుకొంటావు ? "

కుర్రాడు ఫోటోని పరిశీలనగా చూసి ,

" ఈమెని పట్టుకోవటం చాలా ఈజీ సార్, ఎందుకంటే ఈమెకి ఒక కన్ను మిస్సింగ్ సార్ "

యుగంధర్ మాట్లాడ కుండా అక్కడనుండీ కదిలి పక్క గదిలోకి వెళ్ళాడు.రెండో అతనికి
ఫోటో చూపించి,ఎలా పట్టుకుంటావని అడిగాడు ,

" సార్ ! పట్టుకోవటం యమా సులువు సార్ , ఈమెకి ఒక చెవి లేదు కదా సార్ "

యుగంధర్ వాడి వంక గుడ్లురిమి చూస్తూ, వాడిని నాతో రా అని మొదటి వాడి గదిలోకి
తీసుకెళ్ళి ఇద్దరిపైనా ఒక్కసారిగా అరిచాడు

"నేను మీకు చూపించింది అమ్మాయి సైడుఫోటో. అది చూసి అతి తెలివితేటలు ప్రదర్శిస్తారే ? "

అలా అని మూడో వాడి గదిలోకి వెళ్లి చెప్పాడు ,

"నేను చూపించే ఫోటో చూసి, సరిగా ఆలోచించి, కొద్దిగా టైము తీసుకొని అయినా సరే , ఎట్టా
పట్టు కుంటావో చెప్పాలి "

ఫోటో చూపించాడు , కుర్రాడు బాగా అన్ని కోణాల్లో శ్రద్ధ గా పరిశీలించి చూసి చెప్పాడు ,

" సార్ ! వ్యక్తి కి కాంటాక్ట్ లెన్సులు ఉన్నాయి "

యుగంధర్ అబ్బురపడి,తనకి కూడా తట్టని విషయం ఇతనికి ఎలా తట్టిందా అని ,కుర్రాడితో
అన్నాడు ,

"నాకు కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయో లేవో తెలీదు,ఒక్కసారి రికార్డ్ చూసి చెబుతాను" అన్నాడు.
లోపలికి వెళ్లి రికార్డ్ చూసాడు . కుర్రాడు చెప్పినట్లే అపరాధికి కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయి.

బయటకి వచ్చి ఆనందంగా చెప్పాడు ,

" నువ్వు రా ,నా వారసుడివి .నన్ను మించి గొప్ప డిటెక్టీవ్ అవుతావు. ఇంతకీ నువ్వు ఎలా
కనిపెట్టావు ? "

"ఏముంది సార్ దీంట్లో , యమా ఈజీ సార్ ,అమ్మాయికి ఒక కన్ను , ఒక చెవి లేనప్పుడు
కాంటాక్ట్ లెన్సులు కాక , మామూలు కళ్ళజోడు ఎలా పెట్టుకొంటుంది సార్ "

చావు బాధ

*
పాపం సంగమేశం అనుకోకుండా ,ఏమీ చెప్పా పెట్టకుండా ,తనకే తెలియని మత్తులో
చనిపోయాడు. అతని కుటుంబాన్ని పలకరించటానికి వచ్చిన పెద్దమనిషి ఒకాయన ,
సంగమేశం భార్యని ఓదారుస్తూ ,

"అమ్మా ! బాధ పడకు ,కాలం అన్ని గాయాలని మాన్పుతుంది .అన్నీ నెమ్మదిగా ఒక దారికి
వస్తాయిలే .ఏడిస్తే ఏమీ రాదు , ఒక్క కన్నీళ్ళు తప్ప " అని అన్నాడు . విన్న ఆమె ,

"బాబాయి గారూ ,ఆడు బతికున్నంత కాలం ఎప్పుడు ఇంటి కొస్తాడో, అసలు రాడో, ఏ గొడవలు
చేసి వస్తాడో,ఇంటికొచ్చి కొడతాడో ఏమీ తెలిసేది కాదు .ఇప్పుడు నాకు ఆ బాధ లేదు .
హాయిగా ఉంది "అంది

పడవ

*
బెజవాడ కనకదుర్గమ్మ ను చూసి , భవానీ ద్వీపం లో మర పడవని అద్దెకి తీసుకొని
కృష్ణానదిలో " లాహిరి లాహిరి లాహిరి లో " అని పాడుకుంటూ షికారు చేస్తున్నారు
వెంకటప్పయ్య దంపతులు .

నది మద్యలో పడవ ఇంజను విచిత్రంగా శబ్దం చేసింది. తరువాత పడవ బాగా అటూ ఇటూ
ఊగటం మొదలు పెట్టింది .దాంతో అలివేణి భయంతో బెంబేలెత్తి వణుకుతూ పూడుకుపోయిన
గొంతుతో అంది ,

" ఏమండీ ! పడవ మునిగిపోతోందండీ "

" పడవ వెధవ మన దగ్గర ఎక్కువ డబ్బులు గుంజాడుగా,వాడికి తగిన శాస్తి
జరుగాలి .బాగా మునగనీ " అన్నాడు కసిగా వెంకటప్పయ్య .

జలుబు

*
మొన్న డిసెంబర్లో కొత్తగూడెం కుర్రాడు రాజాబాబు ని వాళ్ల ఆఫీసు వాళ్లు పని మీదా కాశ్మీర్
పంపించారు .

అలా కాశ్మీర్లో దిగాడో లేదో ,పడిశం ఇలా వచ్చి ముక్కు పట్టేసింది . ముక్కు దిబ్బడేసి
గాలి కూడా ఆడటం లేదు . వెంటనే వెళ్లి డాక్టర్ క్రిషేన్ కౌల్ ని కలిసాడు .

ఆయన మందిచ్చారు .తగ్గలేదు .రాజాబాబు మరునాడు మళ్ళీ దర్శించాడు ,
వేరే మందు రాసి ఇచ్చాడు . అయినా ఉపయోగం లేదు .ముచ్చటగా మూడో రోజు
డాక్టర్ గారు ఏదో పసరు ముక్కు మీద పోసి మర్దన చేసాడు .అయినా ఏమీ మార్పు లేదు.
డాక్టర్ కాసేపు ఆలోచించి చెప్పాడు ,

"నువ్వు వెంటనే వెళ్లి బాగా సలసలా కాగిన వేడి నీళ్ళతో స్థానం చేసి ,ఒళ్ళు తుడుచు
కోకుండా అలాగే గది లోకి వచ్చి పూర్తి వేగం తో ఫ్యాను వేసుకొని , అన్ని కిటికీలు , తలుపులు
పూర్తిగా తీసి , ఓ పది నిమిషాలు నిలబడు "

" సార్ , అలా చేస్తే నేను న్యుమోనియా వచ్చి చచ్చిపోతాను " భయం గా, ఆందోళన తో అన్నాడు

రాజబాబు .

" ఏం పర్లేదోయ్,నాకు ఈ జిల్లా లోనే న్యుమోనియా బాగా తగ్గిస్తానని బాగా పేరు" ధైర్యం
చెప్పాడు క్రిషేన్ కౌల్ .

నా మాట

*
పరంధామయ్య గారికి షష్టి జరిగింది .ఆ రోజు రాత్రి వారి భార్య
అనసూయ అంది ,

"ఏమండీ!మనిద్దరం మళ్ళీ జన్మలో కూడా ఇలాగే భార్యా
భర్తలుగా పుడదామండీ "

"సరే, కానీ అప్పుడైనా నువ్వు నా మాట వింటావా " ఆశగా
అడిగాడు పరంధామయ్య .

నేను చేసింది

*
నేను రోజు నా శ్రీమతి వేపు బంధువుల ఇంటికి వెళ్లాను (నా శ్రీమతి తో కలిసే సుమండీ ,

లేకుంటే వారు నన్ను గుర్తించరు)

వారి ఇంటి గేటు లోపలికి అడుగు పెడుతుంటే , కొన్ని మాటలు చెవిన పడ్డాయి ,

" నేను రోజూ వంట చేసేది చాలదా,ఇంత చిన్న వయసులో రమా కూడా వంట చేయాలా ? "

"రేపు పెద్ద అయిన తరువాత వాడికి కూడా పెళ్లి అవుతుందిగా, నేర్చుకోవాలి గా "

ఆవేదన

*
హైదరాబాద్ లో గతవారంగా పడుతున్న వానలకి భయపడి వెంగళప్ప బయటకి రావట్లేదు.
ఇల్లాలి వక్కపొడి డబ్బా ఖాళీ అవటంతో ,దాని కోసం బయటకు రాక తప్పింది కాదు .
అడుగు లో అడుగు వేసుకొంటూ ,రోడ్డు ఎక్కడుందో , మాన్ హోల్ ఎక్కడుందో చూసుకొంటూ
భయం భయం గా అడుగులు వేయసాగాడు .

అతను భయపడ్డట్లే, కాలు జారి బురదలో పడ్డాడు. బట్టలు , ఒళ్ళు రెండూ ఒకదానితో ఒకటి
పోటీగా బురదతో మూడు కోటింగులు పెయింటు వేసుకొన్నాయి .

హటాత్తుగా ఆకాశం లో పెద్దగా మెరుపు మెరిసింది .అది చూసి ఆకాశం వంక చూస్తూ
బాధగా అరిచాడు వెంగళప్ప ,

"ఓరి దేవుడా !నా వొళ్ళంతా బురద అంటేట్టు చేయటమే కాకుండా,నన్ను ఫోటో కూడా తీశావా "

గుర్రాలు

*
హైదరాబాద్ రేస్ క్లబ్ పక్కనుండీ స్కూటర్ పై వెళుతూ హయగ్రీవరావు, వెనక కూర్చొని ఉన్న,
ఆంజనేయులు తో అన్నాడు ,

" నాకైతే మన కంటే గుర్రాలే ఎక్కువ తెలివైనవని గట్టి నమ్మకం "

"ఎందుకలా అనుకుంటున్నావు ? "

" ఇరవై గుర్రాలు క్లబ్ లో పరిగెడుతుంటే నలభై వేలమంది చూడటానికి వస్తారు .
కానీ వంద మంది మనుషులు పరిగెడుతున్నా ,ఒక్క గుర్రం చూడటానికి రాదు "

అధిక బరువు

*
డాక్టర్ గణపతి ఎదురుగా దిగులుగా పరిమళ కూర్చొని ఉంది. డాక్టర్ చెప్పింది ఆమెకు
నమ్మబుద్ధి కావటం లేదు.డాక్టర్ తో ,

"లేదు,నేను అంత బరువు ఉండను.నేను నా ఎత్తుకు తగ్గ బరువే ఉన్నాను " అంది .

" లేదమ్మా , నేను సరిగానే చూసాను. నువ్వు ఉండాల్సిన దానికంటే ముప్పై కేజీలు బరువు
ఎక్కువే ఉన్నావు "

" నేనొప్పుకోను , మీరు మళ్ళీ ఒక్కసారి సరిగా పట్టిక చూసి చెప్పండి "

డాక్టర్ పట్టిక మళ్ళీ చూసి చెప్పారు ,

" అమ్మా , నా దగ్గరున్న పట్టిక ప్రకారం, మీ బరువుకి మీరు 5 అంగుళాలు తక్కువ ఎత్తు
ఉన్నారు "

ఆమె కోర కోరా చూస్తూ లేచి వెళ్ళిపోయింది. వెంటనే డాక్టర్ స్నేహితుడు ఏకాంబరం
చాలా ఏళ్ళకి అతన్ని కలవటానికి వచ్చాడు . మాటలు మొదలయ్యాయి .

ఏకాంబరం అడిగాడు ,

" ఏరా గణపతీ , మధ్య ఎక్క విన్నా నీ పేరే చెబుతున్నారు .నీ దగ్గర కొస్తే ఏనుగైనా
మూడు నెలల్లో జింక పిల్లలా మార్చేస్తున్నావట. రహస్యమేమిటో నాక్కూడా
చెప్పరా, మా ఆవిడ మీద ప్రయోగిస్తాను "

"నా పేషెంట్లు రోజూ హాస్పటలికి రావాలి .నేను చెప్పినట్లు చేయాలి. నువ్వు గమనించే
ఉంటావు , నాది ఆరో అంతస్తు , లిఫ్ట్ లేదు , అంతే "

డబ్బు

*
కోర్టులో దొంగతనం కేసు విచారణ జరుగుతోంది. జడ్జ్ గారు ముద్దాయి

రాజన్నని ప్రశ్నిస్తున్నారు,


"నువ్వు ఆ ఇంట్లో ఆరోజు రాత్రి దొంగతనం చేసావా ? "


" పగలే ఇంట్లోకి దూరానండీ ,అన్నీ మూట గట్టుకొనే సరికి రాత్రి అయ్యింది "


"నువ్వు బీరువాలో ఉన్న డబ్బు మాత్రమే మూట గట్టావా ,లేక నగలు,

వెండి కంచాలు,ఇతర సామాన్లు కూడా కలిపి కట్టావా ? "


"నేను మా నాన్న మాట పాటించానండీ "


" మీ నాన్న ఏం చెప్పాడు నీకు ? " కొంచం కోపంగా అడిగాడు జడ్జ్


"మా నాన్న సన్యాసులతో కలిసి ఇల్లు విడిచి పోతూ,పోతూ మాఅమ్మని,

నన్నూచూస్తూ చివరిగా ఈ మాట చెప్పారండీ ,


" ఈ లోకం లో డబ్బు ఒకటే మనిషికి ఆనందాన్ని ఇవ్వలేదని "

అభిప్రాయం

*
బాపట్లలో అగ్రికల్చర్ బి.యస్సీ చదువుతున్న అరుణ , గీత , హరిణి , సుభాషిణి స్టడీ టూర్
కోసం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వెళ్ళారు .అక్కడ వారికి గైడ్ గా కుర్ర ప్రొఫెసర్ దేవానంద్
ని నియమించారు .

అమ్మాయిల స్టడీ టూర్ నెల రోజుల పాటు మూడు పొలాలు , ఆరు పంటలుగా సాగింది .వారు
బాపట్ల తిరిగి వచ్చే రోజు ,ప్రొఫెసర్ వారికోసం హోటల్ లో విందు ఇచ్చాడు .అమ్మాయిలు
అతన్ని "మా నలుగురి గురించి మీ అభిప్రాయం ఏమిటి " అని అడిగారు .

దేవానంద్ అన్నారు ,

"సుభాషిణీ ! నువ్వు బాగా కష్టపడి పనిచేస్తావు "

" గీతా ! నువ్వు చాలా తెలివైన దానివి "

"అరుణ మంచి చురుకైనది "

" హరిణీ ! నువ్వు మంచి మాటకారివి "

అమ్మాయిలు ధన్యవాదాలు చెప్పి అడిగారు ,

"మీ గురించి మీ అభిప్రాయమేమిటి ? "

" నేను ఒట్టి అబద్దాలకోరుని "

అలవాటు

*
భవానీపతిరావు పనిబడి ఆగిరిపల్లి నుండీ విజయవాడ వచ్చాడు.మధ్యాహ్నం ఆకలేసి బీసెంట్
రోడ్ లో మోడరన్ కేఫ్ లో అడుగు పెట్టాడు. ఫుల్ మీల్స్ టోకెన్ తీసుకొని టేబుల్ దగ్గర
కూర్చొన్నాడు. సర్వర్ వచ్చాడు ,కంచం లో అన్నీ వడ్డించాడు.

భవానీపతి అడిగిమరీ ఆయకాయ , గోంగూర పచ్చడులు కంచంలో వేయించుకొన్నాడు.
కానీ పావు గంటైనా తినటం మొదలు పెట్టలేదు. విషయం తెలుసు కొందామని సర్వర్ అడిగాడు,

"అయ్యా ! ఇంకేమైనా కావాలా ?, ఎందుకు తినటం మొదలు పెట్టలేదు ? "

" నాకు ఒక అలవాటు ఉంది ,అది ఉంటే గానీ నాకు భోజనం చేయబుద్ది కాదు "

" ముందు మందు ఏమైనా పుచ్చుకోవాలా ,రోడ్ చివర మందుల షాపు ఉంది "

"లేదు , అలాంటి అవసరం లేదు "

"మరి మీకు ఏం కావాలో చెప్పండి "

"బాగా సాధించే అమ్మాయి ఎవరన్నా ఉంటే పట్టుకురా ,నేను తింటున్న సేపు అది బాగా
నన్ను సాధిస్తూ ఉండాలి ,లేకుంటే ముద్ద గొంతు దిగదు.ఇంట్లో ముప్పై ఏళ్లుగా అలవాటు "

నాది కాదు

*

ఉదయం ఎనిమిది గంటలు ,

"పనిమనిషి రంగి కోసం బ్రూ కాఫీ కలిపి అప్పటికి గంట దాటింది .రోజూ ఏడింటికే వచ్చేస్తుంది .
దాని సెల్ కూడా ఎత్తట్లేదు.ఏం పుట్టిందో దీనికి , ముందుగా చెప్పి చావదు " అని మనసు లో
తిట్టుకొంటూ వీధి గుమ్మం వైపు ఆశగా చూస్తోంది ఆశ్లేష .

ఆమె సహనం పూర్తిగా కోల్పోయే లోపు రంగి నిదానంగా ఇంట్లోకి అడుగు పెట్టింది .మాట్లాడకుండా
చీపురు తో గదులు శుభ్రం చేయసాగింది.

ఆశ్లేష తన కోపాన్ని చూపించటానికి ,

"ఇక్కడ సోఫా క్రీడ చూడు ఎంత బూజు ఉందో, రెండు నెలలయ్యింది దులిపి, అదిగో ఫ్రిజ్ పైన
చూడు , ఎంత దుమ్ము పట్టిందో , మూడు నెలలయ్యింది కనీసం తుడిచి " అని అరిచింది

"అమ్మగారూ, దాంట్లో నా తప్పేమీ లేదు,నేను మీ దగ్గర పనికి జేరి నెలే అయ్యింది .ముందు
పనిచేసిన అనసూయదే బాధ్యతంతా "