ఒప్పుకోలు

*
విజయ్ ,మదన్ లుంబినీ పార్క్ లో పల్లీలు తింటూ మాట్లాడుకుంటున్నారు......

విజయ్ : నేను సరిత ని జీడీల పాకమంత గాఢముగా ప్రేమిస్తున్నాను.ఆమె లేక బతకలేను .
కానీ తనని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియట్లేదు .

మదన్ : లేడీ రౌడీనా?, ఈ విషయం లో నన్ను ఇరికించకు .

విజయ్ : నువ్వు నా ఫ్రెండువయితే ఓ సలహా చెప్పరా "

మదన్ : మీ ఇంటి ఎదురేగా, ఓ వంద చిల్లర ఉందేమో అడుగు ,అప్పుడు ఎవరూ
లేకుంటే నీ ప్రేమ విషయం చెప్పు

విజయ్ : నీ బోడి సలహా నిన్న ట్రై చేసి చూశాను .నా మనసులో మాట చెప్పాను .దాంతో
ఆమె నేనిచ్చిన వందని దొంగ నోటులా చూసి , కోపంగా "చిల్లర లేదు " అని
లోపలికి వెళ్లి పోయింది .

మదన్ : అలా జరిగిందా ?, అయినా నీకు 20 ఏళ్ళు, ఆమెకి 24. పర్లేదు మళ్ళీ ట్రై చేయి .
ఆమె ఒప్పుకుంటే ,ఆమె దెబ్బకి నాలుగేళ్ళలో,ఆమె కంటే ముసలాడిలా కనిపిస్తావు.

రహస్యం

*
ఓ ముఖ్యమంత్రి గారు, మేధావుల సభలో ప్రారంభోపన్యాసాన్ని ఇస్తున్నారు .వారి వాగ్ధాటి
ఆగకుండా సాగిపోతూనే ఉంది . ఇంతలో హఠాత్తుగా "పచ్చినిజం " దినపత్రిక విలేఖరి లేచి
ముఖ్యమంత్రి ని వేలెత్తి చూపుతూ " నువ్వొట్టి చవట దద్దమ్మ వి " అని అరిచాడు .

వెంటనే విషయం మన గొప్ప మీడియా ద్వారా ప్రపంచమంతా ప్రసారమయ్యింది
పోలీసులు అతన్ని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు . జడ్జ్ గారు విచారించి
లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

పాపం విలేఖరి జడ్జ్ గారిని ప్రాధేయపడుతూ అడిగాడు ,

" చిన్న పొరపాటు మాటకి లక్ష రూపాయల జరిమానానా సార్ "

జడ్జ్ చెప్పారు ,

" నువ్వన్న మాటకి జరిమానా పదివేలే .కానీ కాపాడ వలసిన రహస్యాన్ని ప్రపంచానికి

బయట పెట్టినందుకు మిగతా తొంభై వేలు "

రచన

*
హరికృష్ణ కథ "అల్లిబిల్లి" వార పత్రిక లో అచ్చు అయ్యింది .అది అతని వందో కథ,
అచ్చు అయ్యింది కాదు , ప్రచురణ కి పంపించినది.దాంతో ఆనందంగా మిత్రులకి పార్టీ ఇచ్చాడు .
పత్రిక వారి ప్రశంశా పత్రం కోసం ఎదురు చూడసాగాడు ,

ఓ నెల గడచిన తరువాత , మిత్రుడు రాజీవ్ అడిగాడు ,

" ఏరా , అల్లిబిల్లి వాళ్లు నీకు ఏమి పంపించారేమిటి బహుమతి ? "

"ఏం చెప్పనురా , నా చేతి రాత బాగు చేసుకోమని ఒకటవ నెంబర్ కాపీలు యాభై , రెండో
నెంబర్ కాపీలు యాభై పంపించారు రా "

వందేళ్లు

*
సంజీవరావు ని ఓ పదేళ్ళ క్రితం ఎవరో అడిగారు ,

" సంజీవరావు గారూ, మీకు ఇప్పటికి 9o ఏళ్ళు ,ఇలాగే ఆరోగ్యంగా ఎంతకాలం జీవించి

ఉండాలను కుంటున్నారు ? "

"వందేళ్ళ మూడు నెలల వరకు "

"అందరూ వందేళ్లు కోరుకుంటారు ,మీరు వందేళ్ళ మూడు నెలలు అంటున్నారు ,విశేషం
ఏమన్నా ఉందా ? "

" వందేళ్లు బతికి హఠాత్తుగా చనిపోతే బాగోదు కదా అందుకని , అంతే కాక వందేళ్లు
బతికినందుకు సన్మానాలు చేస్తారు గదా , అవి కూడా చేయించుకొని పోదామని "

నేడు సంజీవరావు గారికి సన్మానం జరుగుతోంది , వందేళ్లు పూర్తి అయిన సందర్భంలో .
సన్మానం తరువాత పత్రికా విలేఖరులు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు ,

యువత పత్రికావిలేఖరి అడిగాడు ,

"మీరు ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యం గా ఉండటానికి కారణం ఏమిటి ? "

" రాత్రి నడక , నా జీవితం లో అరవై ఏళ్ళు అలా నడిచాను "

"రాత్రి నడకా ? , అందరూ ఉదయపు నడక నడుస్తారు , మీరు విచిత్రం గా
చెబుతున్నారే "

" నిజమే , రాత్రి నడకే , నాకు , మాఆవిడకి గొడవ జరిగినప్పుడల్లా , మా ఒప్పందం ప్రకారం
తప్పు చేసిన వాళ్లు వరండాలో రాత్రంతా నడుస్తూ ఉండాలి .దాదాపుగా నేను రోజు విడిచి
రోజు అలా రాత్రి నడక నడుస్తూ అరవై ఏళ్ళు ఆమెతో కాపురం చేశాను "

లారీ డ్రైవర్

*
మంగళగిరి హైవే ప్రక్కన డాబా లో నులక మంచం మీద కూర్చొని పుల్కాలు తింటూ ఇద్దరు
లారీ డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారు ,

"ఒరేయ్ రాజు , మొన్న నేను హైదరాబాదు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా "
మొదలు పెట్టాడు గిరి .

" ఏం జరిగిందేటి "

" నేను వేగంగా కోఠీ లో వన్ వే లో వెడుతున్నా ,ట్రాఫిక్ పోలీసోడు కనీసం ఆపలేదురా "

"నువ్వు అదృష్టవంతుడివి .నా దగ్గర ఆడు సరైన దారి లో వెళ్ళినా,ఎన్ని సార్లు , ఎంత గుంజాడో
లెక్కే లేదు "

"అదృష్టం లేదు , ఏం లేదు , అప్పుడు నేను పరిగెత్తుకొని వన్ వే లో వెళుతున్నా , అంతే "

పోటీ

*
" గంగా కెమికల్స్ "లో రిసెర్చ్ లాబ్ మేనేజర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతోంది. రెండు
రోజుల వడపోత తరువాత బరిలో కవిత ,అనిత ఇద్దరు మాత్రమే మిగిలారు.అన్నింటిలో
ఇద్దరూ సమాన ప్రతిభ చూపించారు .దాంతో చివరికి ఓ ఐదుప్రశ్నలను ఇచ్చి సమాధానాలు
రాయమన్నారు . తరువాత ....

అరగంట కు ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన అనిత ని పిలిచి చెప్పారు ,

" మీరిద్దరూ నాలుగు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసారు , మేము కవిత ను
ఉద్యోగంలోకి తీసుకుంటున్నాము "

" సార్ ! మేమిద్దరం అన్నింటిలో సమానంగా ఉన్నపుడు కవితకి ఉద్యోగం ఇవ్వాలని
ఎలా నిర్ణయించారు ? " ప్రశ్నించింది అనిత

" మేము మీరు సమాధానం సరిగా రాయని ప్రశ్నలని బట్టి ఈ నిర్ణయం తీసుకొన్నాము "

" ఎలాగో తెలుసుకోవచ్చా ? "

"మీరిద్దరూ మూడవ ప్రశ్న కి సరైన సమాధానం ఇవ్వలేదు . కవిత సమాధానం
" నాకు తెలియదు " అని . నీ సమాధానం " నాక్కూడా తెలియదు " అని .
అర్ధం అయ్యింది అనుకుంటాను " చెప్పారు పెద్దాయన

చెరుకు గడ

*
చెరుకు గడలు తిని చాలా కాలం అవటం తో మనసుపడి ఓ అర్ధరాత్రి గజేంద్రుడు , అడవి
పక్కనే ఉన్న విరగపండిన చెరకు తోట లోకి తన కుటుంబం తో అడుగు పెట్టాడు .

ఆడ ఏనుగు , అతని రెండు గున్న ఏనుగులు పొలం లో పడి చెరుకు గడలను నమిలి పిప్పి
చేయసాగాయి .కానీ గజేంద్రుడు మాత్రం ఒక్క చెరుకు కూడా ముట్టుకోలేదు .

అతని భార్య అడిగింది ,

"రాజా ! ఏమైంది నీకు , ఒక్కటి కూడా ముట్టుకోలేదు ? "

గజేంద్రుడు చెప్పాడు ,

" నాకు చెక్కెర వ్యాధి ఉందని పొద్దున మన వైద్యుడు పరిక్ష చేసి చెప్పాడు "

మానవ వనరులు

*
కాంతిమతి గోవిందా ఇండస్ట్రీస్ లో మానవ వనరుల విభాగానికి మేనేజర్ గా పనిచేస్తోంది .

భూమి మీద నూకలు చెల్లి , ఒక యాక్సిడెంట్ లో హఠాత్తుగా ఆవిడ ప్రాణాలు పోయాయి .

ఆమె ఆత్మ పైకి వెళుతుంటే స్వర్గం-నరకంల మధ్య ఉన్నగేటు దగ్గర ఓ దేవదూత ఆపి చెప్పాడు,

"అమ్మా ! మీరు చేసిన పాప పుణ్యాల ననుసరించి స్వర్గ సుఖాలను , నరక యాతనలను

రెండింటిని అనుభవించాలి .మీరు ముందు ఎక్కడకు వెళతారో ఎన్నిక చేసుకోవచ్చు .

దానికి ముందు మీరు స్వర్గం , నరకం రెంటిలోనూ ఒక్కోరోజు గడపాలి "

కాంతిమతి ముందు నరకం చూస్తానంది. యమభటులు వచ్చి ఆమెను సాదరంగా

నరకానికి తీసుకెళ్ళారు .

నరకంలో , ఎక్కడ చూసినా పండగ వాతావరణం కనిపిస్తోంది .చాలా శుభ్రం గా ఉంది .

బాగా అలంకరించబడి ఉంది . ఆమె రాగానే పూర్వం ఆమెతో కలిసి పని చేసిన వారు ,

ఆమె పాత బాసులు ఘన స్వాగతం పలికారు . చక్కటి భోజనం పెట్టారు . ఆటా -పాటా

బాగా సాగింది . కాంతిమతి రోజల్లా ఆ సంబరాల్లో మునిగిపోయింది .

తరువాత రోజు ఉదయాన్నే , యమభటులు ఆమెను స్వర్గం లో ప్రవేశ పెట్టారు .

స్వర్గం చాలా ప్రశాంతం గా ఉంది ,ఆహ్లాదం గా ఉంది .రోజు ఎలా గడిచిందో తెలియలేదు .

పక్కరోజు ఉదయాన్నే దేవదూత అడిగాడు ,

" మీరు ఎక్కడికి ముందు వెళతారు "

కాంతిమతి ఒక్క క్షణం ఆలోచించి చెప్పింది ,

" నేను ముందు నరకానికే వెళతాను ,నా వాళ్లందరూ నా గురించి ఎదురు చూస్తుంటారు "

ఆమెని నరకానికి పంపారు ,

అడుగు పెడుతూనే భరించరాని దుర్గంధం,అంతా కుళ్ళిన చెత్త ,మనుషులంతా మహా మడ్డిగా

ఉన్నారు.

కాంతిమతి బుర్ర తిరిగిపోయింది .అక్కడ తనకు తెలిసిన వారిలో పెద్ద వారిని అడిగింది ,ఏమిటీ

తేడా అని . ఆ పెద్దాయన చెప్పారు ,

"మొన్న నిన్ను ఉద్యోగం లోకి తీసుకొన్నాము , ఇవాళ నువ్వు పనిలోకి వచ్చావు "

చివరి కోరిక

*
మృత్యుంజయరావు అప్పటికి ఆసుపత్రిలో జేరి పదవ రోజు. తనకు ఎంతో ఇష్టమైన తెల్ల బొచ్చు
కుక్క పిల్ల "డెవిల్" ముద్దుగా కరవటాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితమిది .డాక్టర్ వచ్చి నెమ్మదిగా
చెప్పాడు ,

" మీకు రాబిస్ బాగా ముదిరిపోయింది.మీరు ... ఎక్కువకాలం ..... కష్టం "

రావు ఓ రెండు నిమిషాలు మౌనంగా ఉండి, అడిగారు ,


"నాకు కొన్ని తెల్ల కాగితాలు , కలము ఏర్పాటు చేయగలరా ? "

"మీ వీలునామా రాయటానికా ? " అడిగాడు డాక్టర్

"లేదు , నేను ఎవరెవరిని కరవాలో మరచి పోకుండా ,లెక్క రాసుకుందామని " చెప్పారు
రావు .

ఎంతెంత దూరం

*
బాలకృష్ణ కొత్తగా రంగులేసే పనిలో చేరాడు.అతనికి నేషనల్ హైవే పై మధ్యలో తెల్ల గీతలు
గీసే పని అప్పచెప్పారు . బాలూ మంచి హుషారుగా పని మొదలు పెట్టాడు.

మొదటి రోజు పది కిలోమీటర్లు తెల్ల గీత గీసాడు . రెండో రోజు ఆరు కిలోమీటర్లు గీశాడు .
మూడో రోజు పాపం మూడే . నాలుగో రోజు ఒక్క కిలో మీటర్ .

దాంతో చిర్రెత్తు కొచ్చి అతని మేస్త్రీ అరిచాడు , అడిగాడు ,

" అరే , బాలూ రోజు రోజుకి కిలో మీటర్లు పెరగాలి గానీ , తగ్గుతున్నాయి ఏమిటి ? "

" పెయింట్ డబ్బా రోజు రోజు కి బాగా దూరం గా ఉంటోంది సార్ " అమాయకంగా చెప్పాడు
బాలకృష్ణ.

పరువు

*
భిక్షపతి,కుబేరరావుల మధ్య శత్రుత్వం వారసత్వం గా వచ్చింది మూడు తరాలుగా .ఎదుటి వాడ్ని
వెధవని చేసే అవకాశం , ఏ చిన్నది దొరికినా ఎవరూవదిలేవారు కాదు .

ఒకరోజు కుబేరరావు మిత్రుడు గంగరాజు తో,ఆవేశంతో వూగిపోతు కోపంతో జేపురించిన మొహంతో
అన్నాడు ,

"ఆ త్రాస్టుడు భిక్షపతి మొన్న పది మందిలో నా పరువు మొత్తం గంగలో కలిపాడు.వాడు నా
కళ్ళకి జీవితం లో మళ్ళీ కనిపించటానికి వీల్లేదు "

"మరి మన ఆస్థాన గూండా వినయ్ కి కబురు చెయ్యనా ? "

"అక్కరలేదు,నేనే వాడికి కనపడకుండా ఊరొదిలి వెళ్ళిపోతున్నాను"చెప్పాడు కుబేర రావు

నిద్రా భంగం

*
పొద్దున్నే సురపతిరావు ,నళినీ కాంతం కృష్ణానది ఇసకలో నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు .

సురపతిరావు ,

" మా ఇంట్లో కొత్త గా,పక్క వాటా లోకి అద్దెకి దిగారే,రామనారాయణ ,వాళ్లు ఈ రోజు తెల్లారి
మూడు గంటలకు పెద్దగా ఆవలిస్తూ , సనుక్కుంటు, చిరాకుగా అరుచుకుంటున్నారు "

" నీకు మరి నిద్ర చెడిపోయిందా ? " అడిగాడు నళినీ కాంతం .

"లేదు , నేను దీక్షగా నా మృదంగం ప్రాక్టీసు చేసుకుంటున్నాను "

పని

*
రాజేష్ కి " బిగ్ బజార్ " లో ఉద్యోగం వచ్చింది . మొదటి రోజు ఉదయాన్నే టక్ చేసుకొని
టిప్ టాప్ గా తయారై వెళ్ళాడు .

అక్కడి మేనేజర్ కి విష్ చేసి వినయంగా నుంచున్నాడు. మేనేజర్ పాపారావు అతనికి ఓ

బూజు కర్ర చేతికి ఇచ్చి దులపమన్నాడు .

బూజు కర్ర ని చూసి అసహ్యంగా మొహం పెట్టి దూరం జరుగుతూ రాజేష్ ,

"నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేశాను " అన్నాడు ఇబ్బందిగా

"సారీ , రాజేష్ , ఆ విషయం నాకు తెలియదు , ఆ బూజు కర్ర ఇలా ఇవ్వు , ఎలా దులపాలో
నేర్పిస్తా " అన్నాడు మేనేజర్ పాపారావు .

పోటీ

*
బెజవాడ బీసెంట్ రోడ్ లో అర్జునరావు , శేషగిరిరావు అనే టైలర్స్ ఎదురు బొదురు షాపుల్లో
ప్రశాంతంగా ఎవరి ఖాతాదారులకు వాళ్లు చక్కటి బట్టలు కుట్టి ఇస్తూ ఉండేవారు .కానీ
ఏమొచ్చిందో,ఏమో వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది .పోటీ విపరీతం గా పెరిగింది .
ఎదుటివాడు మన్ను కొట్టుకు పోవాలని , పోటీలు పడి ధరలు తగ్గించటం మొదలు పెట్టారు .

ఒకరోజు ,

తన షాపు తెరుస్తూ అర్జునరావు ఎదుటి షాపు వైపుకి చూశాడు .అతని కళ్లు
నమ్మలేనట్లు కదలకుండా ఉండిపోయాయి.శేషగిరి షాపు ముందు ఇలా బోర్డ్ రాసి ఉంది

" ఒక జత (ప్యాంటు,షర్టు ) కుట్టుకులీ యాభై రూపాయలు మాత్రమే "

తరువాత రోజు ,

అర్జునరావు షాపు ముందు బోర్డ్ ఇలా రాసి ఉంది ,

" యాభై రూపాయలకు కుట్టిన మీ బట్టలు చక్కగా సరి చేసి ఇవ్వబడును "

బాదం పప్పు

*
కోటేశ్వరరావు చాలా జాగ్రత్తగా బస్ నడుపుతున్నాడు.ఈసారి సంపూర్ణ దక్షిణ దేశ యాత్రలకు
అందరూ వృద్ధులే బయలు దేరారు. డ్రైవింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా , వాళ్ల సణుగుడు
తో చచ్చి పోతున్నాడు .ఇప్పటికి ఇది మూడో రోజు .ఇంకా పన్నెండు రోజులు గడవాలి .

నాలుగు రోడ్ల కూడలి లో మంచి ట్రాఫిక్ లో ఉండగా , ఎవరో వెనకనుండీ భుజం తట్టారు .
చూస్తే ఓ 80 ఏళ్ల ముసలావిడ,అతని చేతిలో బాదం పప్పులు పెట్టింది.బానే ఉంది అనుకుంటూ
ఒక్కొక్కటీ పంటి క్రింద నములుతూ బస్ నడుపుతున్నాడు డ్రైవర్ .

ఓ పావు గంట గడిచేసరికి,మళ్ళీ ఎవరో భుజం తట్టారు ,వెనక్కి తిరిగితే చేతినిండా బాదం పప్పు
పోశాడు ఓ డెబ్బై ఏళ్ల పెద్దాయన . ఇవాళ మన అదృష్టం బాగుందని , పప్పులు నములుతూ
బండి తోలాడు .

అలా ఆ రోజల్లా గడిచింది .దాదాపు ఓ ఇరవై సార్లు బాదం పప్పులు తిన్నాడతను.

రాత్రి బస దగ్గర ప్రయాణికులను ఆసక్తిగా అడిగాడు ,

" మీరు రోజల్లా నాకు బాదం పప్పులు పిలిచి మరీ పెట్టారు, మీరే తినచ్చు గదా ? "

పెద్దలు అందరూ ఒకే గొంతుతో చెప్పారు బృందగానం లా ,


"మాకు చాక్లెట్లు అంటే ఇష్టం,కానీ వాటిలోని బాదం పప్పు నమలటానికి మాకు పళ్ళు లేవు "

వినికిడి

*
డాక్టర్ సుబ్బారావు దగ్గరకి వచ్చాడు అంకాలరావు. తన బాధ చెప్పుకొన్నాడు ఇలా ,

"డాక్టర్ గారూ , ఈ మధ్య మా ఇంటావిడకి చెముడు వచ్చిందని అనుమానంగా ఉందండీ .
మీదగ్గరకి రమ్మంటే రానంటోంది.దానికి చిన్నప్పటి నుండీ కాస్త సిగ్గెక్కువ.నేనేటి చేయాలో
తమరు చెబితే "

"అయితే విను " అని డాక్టర్ అతనికి ఎలా పరిక్ష చేయాలో చెప్పాడు .అది విని ఇంటికి
వెళ్ళాడు అంకాలరావు.

మరునాడు పరిక్షా ఫలితాలు డాక్టర్ గారికి వివరించాడు ,

" మీరు చెప్పినట్లే మొదట ఇంటికెళ్ళ గానే గేటు దగ్గరనుండీ ప్రేమగా దాని పేరెట్టి పిలిచాను.
చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లు బయటకొచ్చి వింతగా చూశారు గానీ అది బయటకి రాలేదు .
వరండా లో నిలబడి మళ్ళీ పిలిచాను , అయినా దానికి వినపడలేదు. హాలులో నిలబడి

ప్రేమగా పిలిచాను మళ్ళీ ,దానికి వినపడలేదు .వంటింట్లో ఉంది కదా అని అక్కడకెళ్ళి
పిలిచాను విసుగ్గా,అయినా లాభం లేదు.దగ్గర కెళ్ళి దాని చెవిలో అరిచాను. దాంతో అది
ఒక్క సారిగా వెనక్కి తిరిగి ,

" ఎందుకలా చెవికోసిన మేక లా నన్ను పేరెట్టి ఐదు సార్లు పిలిచావు ,నీకేం కావాలో
చెప్పచ్చు కదా " అంది .

ఏమి చేయాలో తమరు చెబితే "

మృగం

*
దామోదరం , శాంతకుమారి పెళ్లి చేసుకొని ఏడు ఏళ్ళు అయ్యింది. గొడవలు ప్యాసింజర్ బండి
స్థాయి నుండి రాజధానీ ఎక్స్ ప్రెస్ స్థాయి కి పెరిగాయి .

ఒక రోజు దామోదరం , శాంతకుమారి ల మధ్య గొడవ తారా స్థాయి కి చేరుకుంది .దామోదరం
పట్టరాని కోపం తో అరిచాడు ,

"ఇన్నాళ్ళు నువ్వు నాలోని మనిషినే చూశావు .నా సహనం చచ్చి పోయింది .ఇప్పుడు నాలోని
మృగాన్ని నిద్ర లేపుతున్నావు. ఇంతకింతా అనుభవిస్తావు "

" అయినా కుందేలుకి ఎవరు భయపడతారు ? " అని చీర విదిలించుకుంటూ అక్కడ నుండీ
వాక్ అవుట్ చేసింది శాంత కుమారి .

ఖర్చు

*
వినయ్ బుద్ధిగా ఆఫీసులో పని చేసుకుంటున్నాడు .ఇంతలో అతని మొబైల్ మోగింది .

"హలో ! వినయ్ గారేనా మాట్లాడేది "

" అవును "

" నా పేరు విజయ్ , నేను శభాష్ క్రెడిట్ కార్డ్స్ నుండీ మాట్లాడు తున్నాను "

"చెప్పండి "

" మీరు మీ క్రెడిట్ కార్డ్ మీద జరిగే లావాదేవీలు సరిగా గమనించుకొంటున్నారా ? "

" చూస్తున్నాను , ఇబ్బంది ఏమీ లేదు "

" ఇటీవల మీ కార్డ్ పై చేసే వ్యవహారాలు ఒక దానికి ఒకటి పొంతన లేకుండా రకరకాలుగా
ఉంటున్నాయి , గమనించారా ? "

" రెండు నెలల క్రితం నా కార్డ్ పోయింది "

" ఐ యాం సారీ ,మాకు వెంటనే తెలియ జేయాలని మీకు తెలుసు కదా ? "

" తెలీదు , అయినా ఫరవాలేదు, కార్డ్ తో మా ఆవిడ చేసే ఖర్చు కంటే దొంగ చాలా
తక్కువ ఖర్చే పెడుతున్నాడు "

దోపిడీ

*
గజదొంగ గంగులు శ్రీశైలం రహదారిపై మాటు వేశాడు.దూరంగా మినుకు మినుకు మంటున్న
కారు హెడ్ లైట్ల కాంతి దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి పొడుచుకు వచ్చింది .అనుకోని అవాంతరం తో
డ్రైవర్ బ్రేక్ కొట్టి కారు ఆపాడు.గంగులు ముందు సీట్ లో కూర్చొని ఉన్న ఓ భారీ శాల్తీని
బయటకి లాగి మెడమీద కత్తిపెట్టాడు .అతని అనుచరులు మిగిలిన వారి పని చూస్తున్నారు.

గంగులు : " నీ దగ్గర ఉన్నదంతా బయటకు తీయి "

"నేనెవరో తెలుసా , పార్లమెంటు మెంబర్ని "

"అలాగా సార్ ! , అయితే నా డబ్బులు మర్యాదగా నాకివ్వండి "

వాటా

*
నగరం లోనే పెద్ద ధనవంతుడు కనకారావు , తన ఒక్కగానొక్క కూతురు అలివేలు ని ,
వేంకటాచలపతి కి ఇచ్చి రంగ రంగవైభోగం గా వివాహం చేశాడు .

తన ఇంటికి మొదటి సారిగా వచ్చిన అల్లుడిని అన్ని మర్యాదలతో సత్కరించి ,
కనకారావు అన్నారు ,

" అల్లుడు గారూ , నాకు కొడుకైనా , అల్లుడైన మీరే .నేను ఈ రోజు నుండీ నా వ్యాపారంలో
మీకు సగం వాటా ఇస్తున్నాను .మీరు రోజూ మన ఫ్యాక్టరీ లకి వెళ్లి అక్కడ జరిగే పనులను
గమనిస్తూ ఉండండి "

"నాకు ఫ్యాక్టరీలు అంటే అస్సలు పడవు . మిషన్ల శబ్దాలు నేను అసలు భరించలేను "

"సరేనండీ , పోనీ మన సాఫ్ట్వేర్ ఆఫీసుకి వెళ్లి అక్కడి పనులను అజమాయిషీ చేయండి "

"నాకు సాఫ్ట్వేర్ ఆఫీసులంటే చచ్చేంత బోరు .కంప్యూటర్ వంక చూసుకుంటూ ,అన్ని గంటలు
కదలకుండా కూర్చోటం నా వల్ల కాదు "

" మరి , మీకోసం ఏ పని చేయాలి నేను ? "

" మామయ్యా గారూ ! నా వాటా మొత్తం మీరు కొనుక్కోండి , చాలు "

ఆరోపణ

*
నీటిపారుదల శాఖలో ఎప్పటిలాగే ప్రాజెక్ట్ ల విషయం లో అవినీతి వరదలైపారుతోంది. బొత్తిగా

అనుభవంలేని ఒకడు పొరపాటున దొరికిపోయాడు . తనని కాపాడమని ప్రధాన
కార్య నిర్వాహణాధికారి మధుసూధన్ ని కలిసి కొంత సమర్పించుకున్నాడు . అందరి ఖర్మ
కాలి ఈ విషయం ప్రత్యేక కోర్టు లో విచారణ జరుగుతోంది ,

ప్రభుత్వం తరుఫున లాయర్ ,మధుసూధన్ ని ప్రశ్నించాడు ,

"కేసు మాఫీ చేయటానికి మీరు ఇరయై లక్షలు తీసుకుంది నిజమేనా ? "

మధుసూధన్ నుండీ సమాధానం లేదు .అతను కిటికీ లో నుండీ బయటకు చూస్తున్నాడు .

" మీరు కేసు మాఫీ చేయటానికి ఇరయై లక్షలు తీసుకున్నది నిజమేనా ? " మళ్ళీ
అడిగాడు లాయర్ . సమాధానం లేదు .

అప్పుడు జడ్జ్ గారు,

"మధుసూదన్ ! మీరు ఇరయై లక్షలు తీసుకోన్నారా ? " అని అడిగారు ,కొంచెం అతనివైపు
వంగి

మధు ఉలిక్కిపడి ,

" జడ్జ్ గారూ! లాయరు అడిగేది మిమ్మల్ని కాదా ? " అన్నాడు

లాయర్ తెలివి

*
ముద్దాయి వీరయ్య కోర్టు బోనులో నిలబడి ఉన్నాడు .ఆది శేషుని హత్య చేశాడని అతనిపై
అభియోగం .ఆదిశేషు శవం దొరకలేదు ,కానీ వీరయ్యే హత్య చేసినట్లు బలమైన సాక్ష్యాలు
ఉన్నాయి .అతని లాయర్ నిజాయతీగా వాదించి ,వీరయ్య ని నిర్దోషిగా విడుదల చేయించాలని
చూస్తున్నాడు .

ఆ రోజు చివరి వాయిదా , లాయర్ జడ్జ్ గారితో ఇలా చెప్పాడు ,

" మీరు మరణించారని భావిస్తున్న ఆదిశేషు , సరిగ్గా రెండు నిమిషాల తరువాత , తూర్పు
వైపు తలుపు ద్వారా కోర్టు లోకి వస్తాడు, దయచేసి చూడండి "

ఈ ప్రకటన విని కోర్టు లోని వారు ఒక్క సారిగా నివ్వెరపోయి , ఆదిశేషు కోసం తూర్పు
ద్వారం వంక కళ్లు ఆర్పకుండా చూడసాగారు .రెండు నిమిషాలు అయిపోయాయి .
మరో రెండు నిమిషాలు గడిచాయి . ఏమీ జరగలేదు .

జడ్జ్ గారు కోపంగా లాయర్ ని చూసి "ఏం పరాచికాలాడుతున్నావా " అన్నారు .

లాయర్ " క్షమించాలి , నేను ఆదిశేషు వస్తాడని చెప్పగానే , మీరందరూ అతనికోసం
కళ్ళప్పగించి ఎదురుచూశారు.దాని వల్ల , మీ మనస్సులో అతను బతికే ఉన్నాడని
ఏ మూలో అనుమానం ఉంది . అందుచేత మీరు ముద్దాయిని అపరాధిగా భావించ
కూడదు "

జడ్జ్ ఓ పది నిమిషాలు బాగా ఆలోచించి వీరయ్య కి ఉరి శిక్ష ఖాయం చేసారు .

లాయర్ అడిగాడు వినయంగా,

" మీరు మీ మనసు మార్చు కొనక పోవటానికి కారణం ఏమిటి ? "

" వీరయ్య తన చూపు తలుపు వైపు అసలు తిప్పనే లేదు కాబట్టి " చెప్పారు
జడ్జ్

కంటి అద్దాలు

*
నాగ లోకంలో నాగ పంచమి సంబరాలు బాగా జరుగుతున్నాయి . కానీ కోడె తాచు తక్షకుడు
మాత్రం ఆనందంగా లేడు. అక్కడ జరిగేది ఏమీ అతనికి కనబడటం లేదు .క్రితం ఏడు కూడా
ఇలాగే గడిచి పోయింది .ఇన్నాళ్ళు చెప్పుకోవటానికి సిగ్గు పడి వైద్యుడి దగ్గరకి వెళ్ళలేదు .
ఇప్పుడు వెళ్ళకతప్పట్లేదు .

నాగధన్వంతరి వద్దకు వెళ్ళాడు .ఆయన కళ్లు పరీక్షించి మంచి కళ్ళద్దాలు రాసి ఇచ్చి

రెండు రోజులాగి మళ్ళీ కనపడమన్నాడు .

తక్షకుడు రెండు రోజుల తరువాత చాలా విచారంగా తల వేళ్ళాడేసుకొని వచ్చాడు .
ధన్వంతరి అడిగారు ,

"ఏమి తక్షకా ! ఏం అద్దాలు సరిగా లేవా ? "

"బాగానే ఉన్నాయి .ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నప్పటినుండీ నాకు చాలా బాధగా ఉంది "

" బాధా , ఎందుకు ? "

" నేను రెండేళ్ళ నుండీ ఓ బురద కొయ్య తో కాపురం చేస్తున్నానని తెలిసింది "

పాపం రవి

*
బుజ్జి పరిగెత్తుకుంటూ,పక్కింటి లోకి దూసుకెళ్ళింది."హరీ ,హరీ , ఎక్కడున్నావు ? "అంటూ
అన్ని గదుల్లోకి కలయతిరిగింది .ఇంతలో హరి ఇంట్లోకి వస్తూ కనిపించాడు .

"ఎక్కడికి వెళ్ళావ్ " అడిగింది బుజ్జి

"మీ ఇంటికే " చెప్పాడు హరి

" సరే , నీకు తెలుసా , మీ క్లాసు లో ఎత్తుగా ఉంటాడే , రవి గాడు పాపం వికలాంగుడు
అయి పోయాడు "

" వాడికి ఏం జరిగింది ? " అడిగాడు హరి ఆతృతగా

" ఏమో నాకు తెలీదు ,ఇందాక మేము మా ఊరినుండీ బస్సు లో వస్తుంటే ,వాడు వికలాంగుల
సీట్ లో కూర్చొని కనబడ్డాడు .పాపం పలకరిద్దామంటే బస్సు బాగా రద్దీ గా ఉంది "
చెప్పింది ఆరేళ్ల బుజ్జి .

వంట

*
ఎదురింట్లో జరిగిన పుట్టినరోజు పార్టీకి వెళ్లి,ఇంటికి తిరిగి వచ్చారు రామానందం దంపతులు.

కిళ్ళీ నములుతూ రామానందం భార్య తో అన్నాడు ,

"ప్రమీల మొగాడై పుట్టాల్సింది , కర్మ కాలి ఆడదై పుట్టింది "

"అదేంటి అంత మాటన్నారు ?, పిల్ల మహాలక్ష్మి లా ఉంటుంది.అంతే కాక వాళ్ల కాలేజి
బ్యూటీ కూడా "

"నేను మాటకు కట్టుబడతాను "

"పడితే పడండి, కానీ కారణం చెప్పండి "

"పిల్ల వంట నల భీమపాకం లా అమోఘంగా చేస్తే , ఇంకేమంటారు ? "

పంపకం

*
నగరం లో ఒక గొప్ప ధనవంతుడు సేట్ అన్సారీ లాల్ హటాత్తుగా చనిపోయాడు.చివరి
కార్యక్రమాలు పూర్తి అయినాయి .

తరువాత ఆయనపిల్లలు మహేష్ , రజనీష్ ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు తమదే అని
ప్రకటించుకోసాగారు .అది కొట్లాట దాకా వెళ్ళింది .

హత్య జరిగిన తరువాతే లాయర్ అవసరం అని నమ్మిన వాళ్ల బాబాయి, వాళ్ల గొడవల్ని
చూస్తూ ఉండిపోయాడు .

వాళ్లకి విసుగొచ్చి , చేవ చచ్చి చివరకు తమ లాయర్ బాబాయి దగ్గరికి చేరి పరిష్కారం
చుపించమన్నారు . ఆయన "నేను చెప్పింది మీరు వింటానంటే చెబుతాను "అన్నాడు .

మహేష్ ,రజనీష్ ఇద్దరూ అంగీకరించారు . ఆయన ఆలోచించి చెప్పారు ,

"మహేష్ ఆస్తిని వాటాలు వేసే పని నీది . మొదటగా తనకు వాటా కావాలో కోరుకునే
హక్కు రజనీష్ ది "

శంకరాభరణం

*
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానకచేరీ "త్యాగరాయ గాన సభ " లో అద్భుతంగా
జరిగింది. వారిని అభినందించటానికి ఓ పెద్దా మనిషి ,వారి కాళ్ళకి నమస్కారం చేసి
అన్నారు ,

" అయ్యా ! మీరు శంకరాభరణ రాగంలో పాడిన కీర్తన బ్రహ్మాండంగా ఉందండీ "

బాలమురళీకృష్ణ గారు

"నేను ఈ రోజు శంకరాభరణం లో పాడనే లేదు " అన్నారు

అది విని వచ్చినాయన ,

" నా పక్కన కూర్చున్నవాడు శంకరాభరణం అనే అన్నాడు ,బొత్తిగా కనీస సంగీత జ్ఞానం

లేని వాళ్లు ఈ సభలకి ఎందుకొస్తారో " అంటూ పక్కకి జారుకొన్నాడు .

అరువు బాధ

*
గడప మీద కూర్చొని అప్పుల అప్పారావు ,చుట్టూ మెట్లపై అతనికి అప్పులిచ్చిన వాళ్లు .
వాళ్ల చేతులలో అప్పు పత్రాలు .అన్ని చూపులు అప్పారావు పైనే ఉన్నాయి .

అప్పారావు పైకి చూసాడు , పక్కకి చూసాడు , చుట్టూ చూసాడు .ఒక పరి నిట్టూర్చాడు .
తలదించాడు.సాలోచనగా తల పైకెత్తాడు .ఒక్కసారిగా అరిచాడు

" ఇందుమూలముగా నేను అందరికి తెలియజేయునది ఏమంటే , ఈ అప్పుల వల్ల నేను
పడే బాధని , ఎవరైనా తన బాధగా చేసుకుంటే , వారికి నేను పది వేల రూపాయిలు
ఇస్తాను "

గుంపులోనుండీ రామారావు పైకి లేచాడు .అతను అప్పారావు కి ఐదువేలు అప్పు ఇచ్చాడు .
వడ్డీతో పెరిగి అది తొమ్మిది వేలు అయ్యింది నేటికి .పది వేలు వస్తే వెయ్యి అదనం అని
ఆశ పడి

" అప్పారావు! నేను నీ బాధంతా పడతానోయ్,ఇంతకీ పదివేలేక్కడ ? " అడిగాడు .

అప్పారావు శాంతంగా బదులిచ్చాడు

" ఇదే నా వైపు నుండీ నీ మొదటి బాధ "

విషం

&
హరేరాం, సుఖానంద స్వామి దగ్గరకి వచ్చి మొర పెట్టుకున్నాడు ,

" మా ఆవిడ దుర్గ నాకు విషమివ్వటానికి చూస్తోంది.నన్ను మీరే కాపాడాలి "

స్వామీజీ నమ్మలేనట్లు చూసారు ,

"నిజమే స్వామీ , మీ మీద ఒట్టు " అన్నాడు హరేరాం

"సరే , నేను ఆమె తో మాట్లాడి ,తరువాత నీకు ఏం చెయ్యాలో చెబుతా , అంతవరకు
ఆశ్రమం లో ఉండు " అన్నారు స్వామీజీ .

మూడు రోజులు గడిచాయి. స్వామీజీ హరే రాంని పిలిచి చెప్పారు

"నేను నిన్న ఆమె ని పిలిచి మూడు గంటలు మాట్లాడాను ".ఒక్క క్షణం ఆగారు స్వామి .
ఆలస్యం తట్టుకోలేని రాం ఆతృతగా అడిగాడు,

"స్వామీ ,మీకేమనిపించింది ? , నన్నేమి చేయమంటారు ? "

"నా సలహా విని విషం పుచ్చుకో "

పంచ కళ్యాణి

*
రేస్ కింగ్ రమేష్ కిలార్ కి గుర్రాలంటే తగని పిచ్చి .ప్రపంచమంతా తిరిగి మేలు జాతి గుర్రాలని
సంపాదించి తన పెరట్లో సాకు తున్నాడు వాటిల్లో తెల్లని మేని ఛాయా తో ఉండే పంచ కళ్యాణి
అంటే పంచ ప్రాణాలు .

దరిద్రుడు ఒకడు, పంచ కళ్యాణిని చూసుకోవటానికి ఆయన దగ్గర చేరాడు .పగలు,రాత్రి చాలా
జాగ్రత్త గా కంటి పాపలా కనిపెట్టుకు చూస్తున్నాడు.రమేష్ కి అలాగే సేవ చేస్తున్నాడు,ఆయన

దయ కోసం .

రమేష్ కి భూమి మీద నూకలు , టీవీ సీరియళ్ళు, ఫోను మాటలు అన్నీ చెల్లి పోయాయి .
తన వీలునామా రాయిస్తున్నాడు ,మంచం మీద పడుకొని లాయర్ తో . అన్ని రాతకోతలు
అయిపోయాయి.చివరిగా గుర్రాల విషయం చెబుతున్నాడు ,


"పాపం ఆ దరిద్రుడు రంగయ్య ఐదు ఏళ్ల నుండీ,పంచ కళ్యాణి ని,నన్నుబాగా చూసుకున్నాడు.
ఒక్క రోజూ డబ్బు కోసం కక్కుర్తి పడలేదు .నా పంచ కళ్యాణి ని వాడికి ఇచ్చెయ్యండి .బాగా
చూసుకుంటూ ఆనందపడతాడు "