దేవుడు చూస్తున్నాడు

నిత్యానంద యోగ సభ వారు కొత్తగా చేరిన యువ సన్యాసులకు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం వారందరికీ ఒక పెద్ద మర్రిచెట్టు కింద భోజనాల ఏర్పాటు .యువ సన్యాసులందరూ
ఒకరి వెనుక ఒకరు నెమ్మదిగా కదులుతూ అక్కడ ఉన్న పండ్లు, పచ్చి కూరలు,కందమూలాలు
తీసుకొని తింటున్నారు. మామిడి పళ్ళ బుట్ట దగ్గర ఇలా రాసి ఉంది

" ఒక్కరికి ఒక మామిడి పండు మాత్రమే,దేవుడు చూస్తున్నాడు ".

అది చూసి సదానందుడు, భోగానందునితో

" మిత్రమా ! ఆపిల్ పళ్ళు చెరో పది అందుకో.మామిడి పళ్ళు మాత్రం రెండే తీసుకో.

దేవుడు వాటినే చూస్తున్నాడు "

తాగుబోతు

*
రంగమ్మ ని ఉదయలక్ష్మి అడిగింది ,

"ఏమే రంగీ, మీ ఆయన రోజూ ఇంటికాడే పూటుగా పీకల్దాకా తాగుతాడుటగా "

"ఆ ఎదవ గురించి పట్టించుకోవటం మానేసా నమ్మగోరూ "

" ఆడి చొక్కా పట్టుకొని అడగపోయావా ? "

" ఎన్నోమార్లు అడిగా ,ఒక్క చుక్కైనా ఇచ్చి చావలా చచ్చినోడు "

సుఖం

*
ఆండాళ్ ,భర్త బతికున్నంత కాలం పట్టించుకొనలేదు .ఈ మధ్యనే పైకెళ్ళి పోయాడు శ్యామసుందరం. అప్పటి నుండీ ఆమెకు ,సుందరం లేని లోటు బాగా అనుభవం లోకి వచ్చింది.తను చేసిన తప్పులకు బాధ పడింది.ఎలాగైనా సుందరాన్ని క్షమించమని అడగాలనుకొంది. ఉగ్రానంద స్వామి వారి సహాయంతో సుందరం ఆత్మతో మాట్లాడ గలిగింది ,

" ఏవండీ, నేను ఆండాళ్ ని, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను,క్షమించండి.నాతో ఒక్కసారి మాట్లాడండి"

" చెప్పు ఆండాళ్ళు , ఎలా ఉన్నావు ? "

"మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ నాకు ఏమీ బాగా లేదు .మీరెలా ఉన్నారు ? "

"నేను బానే ఉన్నాను "

" ఇక్కడ ఉన్నప్పటి కంటే బాగున్నారా ? "

"నాకు ఇక్కడ చాలా బాగుంది "

" అంటే మీరు స్వర్గం లో ఉన్నారా ? "

" లేదు , నరకం అంధకూపం లో "

తాళం చెవి

*
అర్ధరాత్రి రెండు గంటలకు, డాక్టర్ పద్మనాభం ఇంటి సింహద్వారంను ఎవరో దబదబా కొడుతున్నారు. ఆవలిస్తూ తలుపు తీసాడు ఆయన. ఎదురుగా .............

" సార్! మాఅబ్బాయి మా ఇంటి తాళం చెవి మింగేసాడు.దాన్నిఎట్టాగైనా బయటకు తెప్పించండి" అన్నాడు ఓ పెద్దమనిషి తన కొడుకుని చూపిస్తూ బాధగా .

" ఎప్పుడు మింగేసాడు " అడిగాడు డాక్టర్

" ఓ పదిరోజుల క్రితం "

" అప్పుడు మింగితే ఇప్పుడు తీసుకొచ్చావేమిటి ? " కంగారు పడ్డాడు డాక్టర్ .

" రెండో తాళం చెవి పోయింది ఇవాళే , అందుకే ... " నసిగాడు పెద్ద మనిషి

హెల్మెట్

*
ఓ పని లేని తెలుగు టీవీ ఛానల్ వారు ఓ పరమ బిజీ గా ఉన్న చౌరాస్తా లో నిలుచుని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న సింగినాదం ను చుట్టుముట్టి ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు ,

" ఒక మనిషి గాడిద పై కూర్చొని వెళుతుంటే ,హెల్మెట్ లేనందుకు అతన్ని ఆపుతారా ? లేదా ? "

" లేదు " చెప్పాడు సింగినాదం

" ఎందుకు ఆపరు ? " అడిగారు పని లేని ఛానల్ వారు

" ఎందుకంటే , నాలుగు చక్రాల బండి కి హెల్మెట్ అక్కర లేదు "

నిచ్చెన

*
" అమ్మా ,అమ్మా ! ఒక్కసారి పెరట్లోకి రా " అరుస్తూ వంటిట్లోకి పరిగెత్తుకొని వచ్చాడు బంటీ

" మళ్ళీ ఏం నాశనం చేశావు రా ? "

" అమ్మా , నా కాళ్ళకి అడ్డంపడి గోడకానించిన నిచ్చెన పడిపోయింది కింద "

" నాకు పని ఉంది. వెళ్లి నాన్న కి చెప్పు "

" నాన్నకి తెలుసమ్మా "

"తెలిసినాయన ఆయనే సరిగా పెట్టచ్చు కదా ? "

" నాన్న చూరు పట్టుకొని వెళ్ళాడుతున్నారమ్మా "

నాస్తికుడు

*
వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారిలో ఇద్దరు వయసు మళ్ళిన బిచ్చగాళ్ళు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ,

" ఏరా అప్పిగా ! భిక్షం గారి ఇంటి సందు లోకి రావటం మానుకున్నావేరా ? "

" ఆ సందు మా కొత్త అల్లుడికి కట్నం క్రింద ఇచ్చాను. వాడే వస్తున్నాడు "

" సరే గానీ , మీ కొత్తల్లుడు పండగకి కూడా గుడి కాడికి రాడెందుకు ? "

" ఆడొట్టి నాస్తికుడు , గుడి కాడికి రాడు "

పరుగు

*
హైదరాబాద్ లుంబినీ పార్క్లో ఒక తెలుగు బ్లాగరు వేగంగా పరిగెడుతున్నాడు. అప్పుడే లోపలికి అడుగు పెట్టిన మరో బ్లాగరు అతన్ని ఆపి అడిగాడు ,

" ఎందుకు పరిగెడుతున్నారు ? "

" ఇద్దరు తెలుగు బ్లాగర్ల మధ్య పెద్ద కొట్లాట జరిగేట్టుఉంది. దాన్ని ఆపటానికి పరిగెడుతున్నాను "

" ఎవరు వాళ్ళు ? "

" ఒకటి నేను , రెండు నన్ను పట్టుకోవటానికి పరిగెడుతూ వస్తున్నాడే వాడు " అని మళ్ళీ పరుగు లంకించుకున్నాడు మొదటి బ్లాగరు .

ప్రేమ పెళ్లి

*
సుజాత బెడ్ కాఫీ తాగుతూ కైలాష్ తో అంది ,

" కే !, కొత్తగా పక్క ఫ్లాట్ లో దిగిన జంటది ప్రేమ పెళ్లి అనుకుంటా "

" అతని మొహం చూస్తే ఆ తప్పు చేసిన వాడిలా కనిపించలేదే "

" లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది "

" ఏమిటో అది "

" రాత్రి తోడుకని మజ్జిగ కోసం వెళితే, ఆ పిల్ల చలిలో అతని కోసం వేడి నీళ్ళు పెట్టి ,దగ్గర కూర్చొని
మరీ అంట్లు తోమిస్తోంది "

అమ్మాయి ఒప్పుకుంది

*
" అమ్మా ! కొత్త వంటవాడిని తెచ్చుకుందాం. రోజూఒకటే వంట తిని బోరు కొడుతోంది " తల్లి పక్కన చేరి అడిగింది అర్చన .

కాంతం ఆనందం తో అరిచింది ,

" ఏమండీ ! మనమ్మాయి పెళ్లి కి ఒప్పుకుంది. ఆ చేత్తోనే మైసూరు పాక్ కూడా కలియ బెట్టండి "

అన్యాయం

*
కీర్తన ఏదోగా ఉండటం చూసి కవిత అడిగింది ,

" ఏమైంది కీర్తీ ! బాగా డల్ గా ఉన్నావు ? "

"పరిస్థితులు చూస్తుంటే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే రాంబాబుకి అన్యాయం చెయ్యక తప్పేట్టు లేదు . అదే బాధ గా ఉంది . "

" ఏం జరిగిందే ? "

" మా వాళ్ళు నా పెళ్లి నిశ్చయం చేశారు రాంబాబు తోనే " కలవరపడింది కీర్తన .

పెళ్లి వద్దు

*
పరంధామయ్య గారు తన జీవితపు చివరి క్షణాలలో బుద్దిమంతుడైన తన ఏకైక పుత్రరత్నాన్ని పిలిచి చెప్పారు ,

" రామం ! నేను జీవితంలో చాలా తప్పులు చేశాను.అన్నింటికంటే పెద్దతప్పు పెళ్లి చేసుకోవటం.ఆ తప్పు నువ్వు ఎన్నటికీ చెయ్యకు "

" రెండోదా,మూడోదా నాన్నా ? " అడిగాడు సకలగుణాభిరామం.


జేబులో పది

*
పట్టణం లోని గొప్ప కోటీశ్వరుడు రత్నాకరంని ఇంటర్వ్యూ చేస్తున్నాడు " మీ " టీవీ ఛానల్ విలేఖరి ఏకదంతం .

" మీరు బందరు ఎలా వచ్చారు ? ,వ్యాపారం ఎలా మొదలు పెట్టారు ? "

" నేను నా 16 వ ఏటా నా కాళ్ళ మీద నేను నిలబడాలని ,ఇల్లు వదిలి దొరికిన రైలెక్కాను.చివరి స్టేషన్ బందరు కాబట్టి నన్ను ఇక్కడ దించేశారు .అప్పుడు నా వంటి మీద కట్టు బట్టలు ,చొక్కా జేబులో పది రూపాయిలు మాత్రం ఉన్నాయి " జ్ఞాపకాలను నెమరు వేసుకొంటూ ఒక్క క్షణం ఆగాడు రత్నం .

వెంటనే ఏకదంతం ,

" అయితే మరి మీరు ఆ పది రూపాయలను మొదటిగా ఏ వ్యాపారం లో పెట్టుబడి పెట్టారు ? " అడిగాడు ఆత్రంగా

" ఆ పది రూపాయలతో మా నాన్నకు ట్రంకాల్ చేసి వెంటనే డబ్బు పంపమని చెప్పాను "

పునర్జన్మ

ఇందిరా పార్క్ లో తన కోసం ఎదురుచూస్తున్న సుజన వైపు , ఎంతో భారంగా ,ఏదో కోల్పోయిన వాడిలా
అడుగులు వేసి నీరసంగా ఆమె పక్కన కూలబడ్డాడు సిద్ధార్ధ .

"ఏమైంది సిద్దూ ! అలా ఉన్నావు ? "

" నీకు పునర్జన్మల మీద నమ్మకం ఉందా సుజీ ? "

" ఉంది, అయినా ఎందుకలా అడిగావు ? "

" ఈ జన్మకి మనం ప్రేమికులు గానే మిగిలిపోతామనిపిస్తోంది.వచ్చే జన్మలోనైనా పెళ్లి చేసుకుందాం "

" సిద్దూ ! ఎందుకలా ? " కన్నీళ్ళు ఆపుకొంటూ అడిగింది సుజన

" క్రితం జన్మ లోని ప్రేయసితో నాలుగు రోజుల క్రితం నా నిశ్చితార్ధం జరిగింది " వివరించాడు సిద్దు.

మళ్ళీ తీపి

*
పెళ్లి రోజు సరదాగా భార్య సుజాతతో కలిసి బయలుదేరాడు పురుషోత్తం.నడుస్తుంటే పుల్లారెడ్డీ స్వీట్స్ కనిపించింది .

భార్యని అడిగాడు ప్రేమగా " ఇంకో బందరు లడ్డు తింటావా ? "

సుజాత అచ్చెరువొంది " ఇంకా ఒకటే తినలేదు , రెండోదేంటి ? " అంది

" నీ మతిమరుపు మండా , పెళ్ళైన కొత్తలో మొదటి లడ్డు ఇక్కడేగా ఇప్పించా నీకు " గుర్తుచేశాడు
పీనాసి పురుషోత్తం .

కారు కష్టాలు

సీతామహాలక్ష్మి చికాకు పడుతూ, భర్త అరవింద్ కి ఫోను చేసింది ,

"మన కారు వల్ల పక్కింటి పంకజం దగ్గర నా పరువు పోయింది.దాంతో
కలిసి సినిమాకు
వెళుతుంటే మధ్యలో ఆగి పోయింది "

" కారుకేమైయ్యింది ? "

" కార్బోరేటర్లో నీళ్ళున్నాయి "

"కార్బోరేటర్లో నీళ్ళు ఉండటమేమిటి ? వెటకారం, నిజం చెప్పు "

"నిజంగా నిజం ,నీళ్ళున్నాయి "

" సరే , నీకు తెలిసిచ్చావదు గానీ , నేను చూస్తా, కారేక్కడుంది " విసుగ్గా అరిచాడు అరవింద్

" మన ఇంటి రోడ్డు దాటి కుడి వైపు ముందు కెళితే సాగర్ రోడ్డు వస్తుందే, దాని పక్కనున్న చెరువులో "

దత్తత

ఎన్నో నిద్ర లేని నెలలు ,సంవత్సరాలు గడిపి, ఆగలేక తన డెబ్భై ఏళ్ల తల్లి సుందరమ్మని
అడిగాడు సుదర్శనం ,

"అమ్మా ! నాకు యాభై ఏళ్ళు .తమ్ముడికేమో నలభై, చెల్లికి 38.నాకు ,వాళ్లకి రూపంలో
పోలిక లేదు ,అలవాట్లలో కూడా లేదు .నన్నేమైనా దత్తత కి తీసుకున్నారా ? "

"నీ ఆరో ఏటా దత్తత జరిగింది.కానీ వెనక్కి పంపించేసారు ,భరించలేక నిన్ను" చెప్పింది
తల్లి బాధ పడుతూ .

పుణ్యం

*
చిత్రగుప్తుడు చిట్టా తిరగేసి ,తన ఎదురుగా ఉన్న మనిషిని అడిగాడు ,


"నిన్ను కొంత కాలమైనా స్వర్గానికి పంపటానికి నీ ఖాతా లో ఒక్క పుణ్యం

కూడా కనబడటం లేదు "


"లేదు సార్, నేను ఒక ముసలమ్మా ని రౌడీ బారి నుండీ కాపాడాను "


" నా రికార్డ్ లో లేదు ,వివరం చెప్పు "


"ఒక డెబ్బై ఏళ్ల ముసలమ్మ బాంక్ లో పించెను తీసుకొని వెళుతోంది ,

ఒక రౌడీ ఆమె ను కొట్టి డబ్బు లాక్కు పోతుంటే నేను అడ్డగించి వాడిని

కొట్టి ఆమె డబ్బు తిరిగి ఇప్పించాను ."


" ఇది ఎప్పుడు జరిగింది ? " ఆసక్తి గా అడిగాడు చిత్రగుప్తుడు

" ఒక పది నిమిషాల క్రితం "

సంగీత పాఠం

*
సరస్వతి విద్యార్ధులకు జంట స్వరాలు నేర్పుతోంది. ఇంతలో ఓ పెద్దాయన ఆమెని

కలిసి అడిగాడు ,

" మీరు నాకు తప్పకుండా సంగీతం నేర్పాలి .ఇంతవరకు నేర్చుకున్న చోట

ఆరేళ్ళైనా ఒక్క ముక్క నాకు అబ్బలేదు "

" ఎక్కడ నేర్చుకున్నారు ? "

" సామగానం సంగీత దగ్గర "

" అది ఒట్టి మూర్ఖురాలు .దాని పొట్ట కొస్తే అక్షరం ముక్క కనపడదు.అది పాడని

అపస్వరం లేదు.పాడిన సుస్వరం లేదు. ఇంతకీ ఏం చెప్పింది ? "

" మీ దగ్గరకు వెళ్ళమని చెప్పింది "

త్యాగమయి

*
నరమాంస భక్షకులు ఇద్దరు లొట్టలు వేసుకొంటూ భోజనం చేస్తున్నారు. అతిధిగా వచ్చినవాడు
తన మిత్రునితో ,

" నువ్వు చాలా అదృష్టవంతుడివి. వదిన వంట అద్భుతంగా వండుతుంది "

" నిజమే, కానీ తను ఇక లేదన్న విషయం గుర్తొస్తే నాకూ బాధగానే ఉంది " అన్నాడు
మిత్రుడు విస్తట్లోకి విచారంగా చూస్తూ .