చెక్క పాట

*
రాత్రి 11 గంటల సమయం.ఆఫీసులో ఒళ్ళు పులిసేలా పనిచేసిన కుటుంబరావు పడక్కుర్చీలో కునికిపాట్లు పడుతున్నాడు.అతని పక్కనే అర్ధాంగి ధనలక్ష్మి కీ-టీవీ " చెక్క పాట " ప్రోగ్రాం ను కళ్ళు ఆర్పకుండా,చెక్కలా బిగిసిపోయి తదేకంగా లీనమై చూస్తోంది.


ఇప్పుడో చిన్న బ్రేక్ అని యాంకర్ ,హనుమంతుని చూసి అరిచిన లంఖిణిలా మధ్యలో కేకపెట్టినప్పుడు ఉలిక్కిపడి లేస్తున్నాడు కుటుంబరావు.

ప్రోగ్రాం లో కొత్త పాటగాడు గోలబాలు స్టేజ్ ఎక్కాడు .అతన్ని ఒక కుర్చీలో కూర్చోపెట్టి కాళ్ళు చేతులు కదలకుండా రంగు తాళ్ళతో కట్టేసారు.తల కదలకుండా స్పాండిలైటిస్ కు వాడే పట్టీ ఒకటి మెడకు కట్టారు .

జడ్జిలు అందమైన అనుభవం సినిమా లోని "కుర్రాళ్ళోయ్ ,కుర్రాళ్ళూ "పాట తో ఆడుకోమన్నారు .

గోలబాలు అందుకుందామని ట్రై చేసాడు.గొంతులోంచి ఉత్త గాలే వచ్చింది .

ధనలక్ష్మి కి టెన్షన్ పెరిగింది.

అంతలో "బ్రేక్ ",అనుకోని పవర్ కట్ వల్ల.

తిక్కరేగిన ధనలక్ష్మి కరంట్ వాడిని అటు ఏడు తరాలు ,ఇటు ఏడు తరాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది.ఓ పది నిమిషాలకు మొగుడిచ్చిన మంచినీళ్ళు తాగి తలకి కూల్ కూల్ పట్టించి అంది,

"ఎవరో మహానుభావుడు టీవీ కనిపెట్టి మంచి పని చేస్తే,కరంట్ వాళ్ళు మన ప్రాణం తీస్తున్నారు "

"టీవీ కనిపెట్టిన వాడికంటే,మరో గొప్పోడు ఉన్నాడు " అన్నాడు కుటుంబరావు

"ఎవరు ? " ఆసక్తిగా అడిగింది ధనం

"దాన్ని కట్టేయటానికి స్విచ్ కనిపెట్టినవాడు "

"మీకెప్పుడూ రేడియో ,టీవీలు నచ్చవు.ఏమంత కోపం వాటిమీద ? "

"ఎందుకంటే అవి ఎప్పుడూ ప్రముఖుల మరణాల గురించి వార్తలు చెబుతాయి, ప్రముఖుల జననాల గురించి చెప్పవు "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం