ప్రార్ధన

*

చాలా ఏళ్ళకి , కరుణాకరం ఇంటికి బాబాయి ,పిన్ని వచ్చారు .పిల్లలకి కూడా సెలవలు .బెజవాడ కనకదుర్గమ్మని, మంగళగిరి పానకాల స్వామిని వాళ్ళకి మరునాడు చూపించటానికి ప్లాన్ వేసాడు.
ఖర్చుకి
లోభించి,పిల్లల్ని ఇంట్లోనే ఆడుకోమన్నాడు .

మరునాడు ఉదయం ,

బాబాయి ,పిన్ని లతో ,భార్య ,తను బయలుదేరారు .పిల్లలు బిక్కమొహాలేసుకొని నిలబడ్డారు.
మనసు
మార్చుకొని,వాళ్ళనీ రమ్మాన్నాడు . అడుగు బయట పెట్టారో లేదో కుండపోతగా వాన .

అది చూసి ఆఖరి పిల్ల సృజన చెప్పింది ,

"మమ్మల్ని తీసుకెళ్లటం లేదని ,మేము దేవుడిని పెద్ద వాన తెప్పించమని ప్రార్ధించాము .ఆయన మా కోరిక తీర్చాడు "

సీమంతం

*

పక్కింటి పంకజం , సీతామహా లక్ష్మికి బొట్టు పెట్టి చెప్పింది ,

"రేపు మా అమ్మాయి సీమంతం .మీరు తప్పకుండా రావాలి . మీ వారికి కూడా చెప్పండి "

"ఆడవాళ్ళ ఫంక్షన్ కి ఆయనెందుకు ? " అడిగింది సీతా మహాలక్ష్మి

"ఏం మట్టి బుర్రే నీది , ఆలోచించు " అంది పంకజం

"నువ్వు కట్టిన పట్టుచీర చూసి నప్పటినుండి,మా ఆయనతో ఎలా కొనిపించాలా అనే ఆలోచిస్తున్నా,నువ్వే చెప్పు "

"నువ్వు మా ఇంట్లో భోజనం చేయాలి కాబట్టి , ఆయన నీ వాటా వంట తగ్గించి వండుకోవాలిగా "

ముచ్చట

*

" పెళ్లి అయ్యి పదేళ్ళైనా నా ముచ్చట తీరట్లేదే ఆయనతో " అంది కళ్యాణి , సుమతో


"నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకొనే మీ ఆయన తీర్చని ముచ్చటా , ఏమిటే అది ? "
నోరుతెరిచింది
సుమ


"నిజమేనే ,నేను ఏదడిగినా, క్షణాలలో నా ముందు ఉంచుతాడు,కాని నా ముచ్చట మాత్రం తీరట్లేదే "
చెప్పింది కళ్యాణి .

"ఊరికే నాన్చక , ముచ్చటేదో చెప్పితగలడు, టెన్షన్ పడలేక చస్తున్నా " తొందర పెట్టింది సుమ

"ఆయన్ను నసపెట్టి , సతాయించే ముచ్చట తీరట్లేదే " ముక్తాయించింది కళ్యాణి

బద్ధకం

*
లంబోదర రావు ,ఆల్ ఇండియా బద్దకస్తుల సంఘం ప్రెసిడెంట్ . అనుకోకుండా ఒక రోజు అతన్ని తీసుకువెళుతున్న కార్ కి యాక్సిడెంట్ జరిగింది .సీను కట్ చేస్తే ,

ఆస్పత్రి పడకపై తను, పక్కన డాక్టర్ భుజంగరావు ,

డాక్టర్ అన్నారు ,

"లంబు గారూ , మీతో నేను రెండు విషయాలు చెప్పాలి .ఒకటి శుభవార్త, మరొకటి చెడ్డవార్త "

చెప్పండి అన్నట్లు ,కనపడి కనపడకుండా తల ఊపాడు లంబోదర రావు .

"మీ రెండు కాళ్ళు యాక్సిడెంట్ లో బాగా దెబ్బతినటం వల్ల మీరిక నడవలేరు " చెప్పాడు డాక్టర్

ఆనందంగా మొహం పెట్టి ," మరి చెడ్డ వార్త ఏమిటి ? " అడిగాడు లంబు .

దూకటం

*

సైనికులకు శిక్షణ లో భాగంగా , విమానాల నుండి పేరాచుట్ సహాయం తో క్రిందకు దిగటం నేర్పారు రమేష్ కి .


కమాండర్
అతని రికార్డ్ చూస్తూ అడిగాడు ,

"నువ్వు ఎన్ని సార్లు పారాచూట్ తో క్రిందకు దూకావు ? "

" ఒకసారి సార్ "

" రికార్డు లో పది సార్లు అని రాసి ఉంది ? "

"నేను ఒకసారే దూకాను సార్, మిగిలిన తొమ్మిది సార్లూ నన్ను నెట్టి వేసారు సార్ "

పర్స్

*

తన కొడుకు చింటూ తో ఆదినారాయణ ,

"నిన్న బస్ లో నా ముందు నుంచున్న మనిషి పర్స్ పాంట్ జేబులోంచి

కింద
పడిపోయింది.అతను గమనించలేదు.వెంటనే నేను దాన్ని అతనికి

ఇచ్చేశాను.
దీనివల్ల నీకు ఏం తెలిసింది ? "

"పర్స్ లో డబ్బులు లేవని తెల్సింది " తన అనుభవం తో చెప్పాడు చింటూ .

చివరి కోరిక

*
ఒక సర్కస్ లోని జోకర్ని హత్య చేసినందుకు బిల్లా , రంగా లకు మరణ శిక్ష పడింది .
శిక్ష అమలు రోజు ఇన్స్పెక్టర్ ,

" మీ ఆఖరి కోరిక చెప్పండి . చట్టానికి లోబడి తీర్చటానికి ప్రయత్నిస్తాము " అన్నాడు .

రంగా అడిగాడు ,

"నాకు మనసారా గొంతెత్తి నాకు ఇష్టమైన పాటలు వురి తిసేముందు పాడుకోవాలని ఉంది "

" సరే , బిల్లా మరి నీ కోరికేమిటి " అడిగాడు ఇన్స్పెక్టర్ .

" సార్ , నన్ను వాడికంటే ముందు వురి తీయండి " అభ్యర్ధించాడు బిల్లా

పని ఆగుతుందా ?

*
సుందర కుమార్ , ఓ పలకల కంపెనీ తయారీ విభాగంలో జనరల్ మేనేజర్ .ఆఫీసుకు
బయలుదేరుతుంటే, భార్య అడిగింది గోముగా ,రాత్రి నుండి 16 వ సారి ,

"పిల్లల పరీక్షలు అయిపోయాయి.ఓ నెల రోజులు సెలవు పెట్టండి .అమెరికా టూర్ వెళ్లివద్దాం "

"అన్ని రోజులు సెలవు పెట్టటం కుదరదు " చెప్పాడు సుందర్ 6 వ సారి .

" అంటే మీరు లేకపోతే కంపెనీ లో పని జరగదా "

" జరుగుతుంది , కానీ ఆ విషయం మానేజ్ మెంట్ కి తెలియకూడదు కదా ! "

పతిభక్తి

*
" నేను చేసిన తప్పుకి మా ఆయనకు కోపం వచ్చినప్పుడల్లా,నేను ఉపవాసముంటాను "
చెప్పింది సరళ , అరుణతో

" నీకు ఇంత పతి భక్తి ఉందా ? " అబ్బురపడింది అరుణ

" పతి భక్తా , నా బొందా ?, కోపం వచ్చిన రోజు వంట చేయటం మానేస్తాడాయన "
విచారంగా చెప్పింది సరళ .

నిద్ర

*
రవి బాబు అద్దె ఇంట్లోకి కొత్తగా దిగాడు . మొదటి సారి ఇంటికొచ్చిన రాజేష్ అడిగాడు రవిని ,

" ఏంట్రా ! మీ ఇంట్లోకి రాంగానే నిద్ర తన్నుకు వస్తోంది "

" ఈ ఇంట్లో ఇంతకు ముందు 10 ఏళ్ళు ప్రభుత్వ ఆఫీసు నడిచిందిలే " చెప్పాడు రవి

చిట్టి నవ్వులు

***
ఆమె చేతి
వంట
అతను
నోరులేని మనిషి
***
నేలపై
రాలిన పువ్వు
బోసిపోయింది
ఆమె జెడ
***
కల
నిజమైంది
అతనిక
లేడు
***
అలుపెరగని
అల
ఓడిపోయిన
ఇసుక గూళ్ళు
***
ఆకాశం లో
ఎర్రని చంద్రుడు
కాన్వాసు పై
ఒలికిన సింధూరం
***

కాలు విరిగింది

*
" కుడి కాలు విరిగి కాంతారావు ఆస్పత్రి లో చేరాడు .పలకరించటానికి ఆనందరావు వచ్చి ,

"కాలు ఎలా విరిగింది " అని అడిగాడు

"అరటి పండు తొక్క మీద కాలు వేయటం వల్ల ... "

"దాంతో గట్టిగా జారి పడ్డావా ? "

" లేదు , మా ఆవిడ పడింది , నేను నవ్వాను , అంతే "

పనమ్మాయి

*
" ఏమండీ ! మన కొత్త పనమ్మాయి మీద అనుమానంగా ఉందండీ " అంది రాధిక,
మొగుడు చలపతి తో

"నువ్వు నన్నే నమ్మి చావవు , అయినా ఏమైంది ? " విసుగ్గా అడిగాడు చలపతి

" మనం తాజ్ హోటల్ లో కొట్టేసిన నాలుగు సింహం బొమ్మ చెంచాలు కనిపించటం లేదండీ " బాధగా చెప్పింది రాధిక

కేతి గాడి నానోలు

***
కొండెక్కింది
కోతి
పట్టి తెమ్మంది
ప్రియురాలు
***
మొద్దు నిద్దురలో
విద్యార్ధి
దీపం చేసింది
నైటవుట్
***
మేకప్ లేని
తార
స్పృహ తప్పిన
అభిమాని
***
రాధ
వెతుకుతోంది
పొదలో కృష్ణుడు
గోపికతో
***
అతని చూపుల
బాణాలు
ఆమె వలలో
చిక్కుకున్నాయి
***

జడ్జ్ మెంట్

*

జడ్జ్ జగ్గారావు,జస్టిస్ చౌదరి పార్టీ లో కలుసుకున్నారు.జగ్గారావు గొంతు తగ్గించి అడిగాడు చౌదరిని,


" వాడే హత్య చేసాడని తెలిసినా , నిర్దోషి గా భావించి ముద్దాయిని విడిచి పెట్టావు , ఎందుకు ? "


"వాడు హత్య చేసింది ఎవర్నో కాదు,మా ఆవిడ సంగీతం మాస్టారుని"రహస్యం విప్పాడు జస్టిస్ చౌదరి.

పసివాడు

*

గోధూళి వేళ , పసివాడు , తన తప్పి పోయిన ఆవు కోసం ఏడుస్తున్నాడు .

దారిన పోతున్న సుబ్బన్న ,

" ఆవును నే వెతికి పెడతా " అన్నాడు .

"అక్కర్లే , అది మా ఇంటికి వెళ్లి పోయుంటుంది " ఏడుపు గొంతుతో చెప్పాడు చిన్న గోపన్న

" మరెందుకు ఏడుపు " అడిగాడు సుబ్బన్న

"మా ఇంటికి వెళ్లేదారి దానికి తెలుసు , నాకు తెలియదు " ఏడుపు శృతి పెంచాడు పసివాడు

ఎలాఉంది

*

"ఇంత లేటు వయసు లో పెళ్లి చేసుకున్నావు కదా .ఇప్పుడెలా ఉంది జీవితం " పలకరించాడు పద్మనాభం .



"తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించే తీరుతాడు అని అనిపిస్తోంది " చెప్పాడు కామేశ్వర రావు .

సద్దుబాటు

*

'"నా కొచ్చే 10 వేల జీతం తో నువ్వు ఎడ్జస్ట్ కాగలవా " ప్రియురాలు,

బంగారయ్య
కూతురు ధనలక్ష్మిని అడిగాడు హరినారాయణ .


" నేను ఎడ్జస్ట్ అవుతాను , మరి నీ సంగతి " ప్రశ్నించింది ధనలక్ష్మి .

బిచ్చం

*

"అయ్యా , రూపాయి ధర్మం చేయండి " జోలె పట్టాడు బిక్షపతి.


"ఈరోజుల్లో రూపాయి కి ఏమొస్తుంది , ఇంద ఐదు ఉంచు "

అంటూ
జోలెలో వేసి నాగయ్య ,

" ఇంతకీ నువ్వు బిచ్చగాడివి ఎందుకయ్యావు " అని జాలి గా అడిగాడు .


" మీలా రూపాయి అడిగిన వాళ్ళకి పది రూపాయలిచ్చి " బాధగా ఫ్లాష్ బాక్ విప్పాడు బిక్షపతి .

దూరం

*

ఇందిరా పార్క్ లో ,

"సుమా ! నా మీద నమ్మకం లేదా ? , ఎందుకంత దూరంగా కూర్చోన్నావు " అంటూ కొంచం దగ్గరకు జరిగాడు ఆనంద్ .


"అబ్బే , నమ్మకం లేక కాదు , నా చేతిలో ఉన్న పల్లీలు అయిపోగానే నీ దగ్గరకు వస్తా " అంటూ పల్లీ నోట్లో వేసుకొంది సుమ .

స్వర్గం

*

దేవాలయంలో పురాణ ప్రవచనం విని వచ్చిన సుభద్రమ్మ,

భర్తతో అంది బాధగా ,


"శాస్త్రులు గారు స్వర్గం లో భార్యాభర్తలు కలిసి ఉండటానికి కుదరదని చెప్పారండీ "


"పిచ్చిదానా ! అందుకే కదా దాన్ని స్వర్గమనేది " నవ్వుతూ అన్నాడు సోమయాజి
.

పోట్లాట

*

వర్ధని , సుజాత తో ,

"మీ అపార్ట్ మెంట్ కు ఎదురుగా కొత్తగా దిగిన సీతమ్మ గారితో,రోజూ
ఉత్తపుణ్యాన గొడవ పెట్టుకుంటున్నావు, ఎందుకే "


" ఆవిడ మొహం లో మా అత్తా గారి పోలికలు ఉన్నాయి, అందుకని"
నసిగింది సుజాత

బహుమతి

*

" ఏరా ! నిన్న పెళ్ళిలో పెళ్లి కొడుకు , పెళ్లి కూతురు ఇద్దరు నీకు దగ్గర చుట్టాలే
కదా.
వాళ్ళకి బహుమతి ఏమి ఇచ్చావు ? " అడిగాడు సుధీర్ , మనోజ్ ను



" పెళ్లి కొడుకు కు టీవీ , అమ్మాయి చేతికి రిమోట్ కంట్రోల్
ఇచ్చాను "


ఆనందం

*

"గడిచిన 20 సంవత్సరాలుగా నేను ,నా భార్య చాలా ఆనందంగా గడుపుతున్నాము " చెప్పాడు
సీతాపతి , నాగేశ్వరరావు తో


"20 ఏళ్ల నుండి మీ దంపతులు ఆనందంగా ఉన్నారా ? " నోరు తెరిచాడు నాగేశ్వర రావు .


"మరేం లేదు , 20 ఏళ్ల నుండి ఒకరికొకరు దూరం గా ఉంటున్నాము "

పోలిక

*

శీను , వేణు తో ,

"నిన్ను చూసినప్పుడల్లా ఆంజనేయులు గాడు గుర్తుకు వస్తుంటాడు "


"వాడికి , నాకు ఒక్క విషయం లో కూడా పోలిక లేదు కదా ! "


" వాడూ , నీలాగే నాకు పది వేలు బాకీ పడ్డాడు "

బస్ డ్రైవర్

*

విజయవాడ నుండి వెంకట్ , సురేష్ శిరిడీకి బస్ లో బయలుదేరారు . బస్ ఎక్కినప్పటి నుండీ
సురేష్ టెన్షన్ , టెన్షన్ గా బస్ డ్రైవర్ను పదే పదే చూడసాగాడు .ఇది చూసి వెంకట్ అడిగాడు ,


" డ్రైవర్ను ను చూసి ఎందుకలా టెన్షన్ పడుతున్నావు "



"వాడు హైస్కూల్ దాకా నా క్లాస్ మేట్ .క్లాస్ లో టీచర్ పాఠం చెబుతున్నంతసేపు నిద్ర పోయేవాడు "

బాధ

*

"ఏమే !రంగీ,నీ మొగుడు రోజూ అలా కల్లు తాగి , సారా తాగి ఇంటికొస్తుంటే ,నీకు బాధగా ఉండదా ? " అడిగింది ప్రసూన.

"ఎందుకుండదు అమ్మగారూ ! ఉంటుంది .నాకూ నా మొగుడు , ఆయ్యగారిలా రోజూ బ్రాందీ తాగోస్తే బాగుండని అనిపిస్తుంది " చెప్పింది రంగమ్మ .

బాకీ

*

అప్పారావు కు ఊరి నిండా అప్పులే . చాలా కాలానికి కిషోర్ కంట పడ్డాడు .

కిషోర్ వెంట పడ్డాడు . దొరికాడు అప్పారావు .

" నా బాకీ కట్టి కదులు ఇక్కడనుండి " కోపంగా అరిచాడు కిషోర్

" నన్ను ఈడ్చి తన్నినా ఒక్క పైసా లేదు " మొండిగా చెప్పాడు అప్పారావు .


"అయితే నువ్వు నా బాకీ మొత్తం కట్టేసావని మిగతా వాళ్ళతో చెబుతాను , ఇప్పుడే "
అంటూ కోపంగా వెళ్ళిపోయాడు కిషోర్ .

షాపింగ్

*

బిగ్ బజార్ లో మల్లిక, సుందరిని చూసి అచ్చెరువొంది మందలింపుగా ,

"సుందరీ ! మీఆయనకు రెండు రోజులనుండి ఒంట్లో బాలేక , హాస్పటల్ లో చేర్చి సెలైన్ ఎక్కిస్తుంటే , నువ్వేంటి ఇలా

షాపింగ్ కు వచ్చావు ? " అంది .


"ఇలాంటి టైం లో ఆయన్ని షాపింగ్ కు , సినిమాలకు రమ్మనటం బాగోదు కదా .అందుకే
నేనొక్కదానినే
వచ్చాను " సమాధాన మిచ్చింది సుందరి

శత్రుత్వం

*

"స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారెందుకు ? " భార్య మూడ్ బాగున్నపుడు చూసి అడిగాడు అప్పలస్వామి


"ఎందుకంటే ఆడదానితో శత్రుత్వం పెట్టుకొనే దమ్ము మగవాళ్ళకు ఉండదు కాబట్టి " తన అనుభవాన్ని మాటల్లో చెప్పింది రంగనాయకి .