పీనాసి పుణ్యం

*
పాపారావు, తన ఆస్తి కాపలాకు వేరే మనిషిని పెడితే డబ్బులు ఇవ్వవలసి
వస్తుందని ,దాని కోసం బతకటానికి రోజుకో ముద్ద అన్నం తినే పరమ పీనాసి .

ఓ పిల్లకాకి,చిన్నారావు తన ఫ్రెండ్స్ తో పందెంకట్టి,శ్రీరామనవమి చందావసూలు
చేయటానికి పాపారావు ఇంటికి వెళ్ళాడు .అంతా విని పాపారావు ,

"చిన్నా ,నాకున్న కష్టాలు నీకు తెలీవు .అందుకే చందా అడిగావు .
మా అమ్మ ఆయాసం తో 10 ఏళ్ల నుండి బాధ పడుతోంది .మా నాన్నకు
పక్షవాతం .చిన్న చెల్లి పెళ్లికుంది . తమ్ముడు వ్యాపారం లో 20 లక్షలకు
దివాళా తీసాడు .వీళ్ళ అవసరాలకే రోజుకు 3 వేల రూపాయలు అవసరం "

విని కరిగాడు , కరుణ నిండిన స్వరంతో పలికాడు చిన్నారావు ,

"మీకు ఇంత డబ్బు అవసరం ఉందని నాకు తెలీదు ,ఫ్రెండ్స్ మాటలు
నమ్మి మీ దగ్గర చందా వసూలు చేస్తానని సవాలు చేశాను .నన్ను
క్షమించండి "

"బాబు చిన్నా ! తప్పుగా అర్ధం చేసుకున్నావు. అంత కష్టం లో ఉన్న నా వాళ్ళకే
పైసా కూడా విదిలించ లేదు .నీకు ఇస్తానని ఎలా వచ్చావు ? "

దాంతో చిన్నారావు చిన్న మెదడు దెబ్బతిని ,వసూలు చేసిన చందా డబ్బులు
ఆసుపత్రి ఖర్చులకు వాడుకున్నాడు .

సరైన ఆహారం తినక , పాపారావు మరణించాడు కొన్నాళ్ళకు .

మేఘాల గుండా వెళ్లి స్వర్గం తలుపు తట్టాడు .దేవదూత తలుపు తీసి
అడిగాడు

"ఎవరు నువ్వు ? , ఎందుకొచ్చావు ? "

"నేను పుణ్యం చేశాను ,స్వర్గం లోకి వెళ్ళాలి ,దారి ఇవ్వు "

"నువ్వు చేసిన పుణ్య మేమిటో " సందేహంగా అడిగాడు దేవదూత .

"ఓ బిచ్చగాడికి పది పైసలు దానం చేశాను "

" అలాగా , ఇప్పుడే కనుక్కొని వస్తాను లోపలికెళ్ళి " అంటూ తలుపేసి వెళ్ళాడు
దేవదూత.కంప్యూటర్లో చిత్ర గుప్తునితో చాట్ ఓపెన్ చేసి విషయం చెప్పాడు .

చిత్రగుప్తుడు చెప్పాడు ,

"వాడు చెప్పింది నిజమే .పది పైసలు వాడి చేతిలో పెట్టి ,వెంటనే నరకంలో
తోసేయ్ పాపిష్టి వెధవను "

కారులో హుషారుగా

*
శశాంక్ , తన ఆకుపచ్చ కలర్ అంబాసిడర్ కారులో ,జోరుగా హుషారుగా
పాటను హమ్ చేసుకుంటూ రోడ్డున పడ్డాడు ,ఉదయం 9 గంటలప్పుడు .

హటాత్తుగా దారిలో బస్ స్టాప్ లో ఒక మెరుపు మెరిసింది .చూపు నిలిచింది .
కారు బ్రేక్ పడింది .

కారు విండో నుండి మొహం బయట పెట్టి

" హలో ప్రియా ! ఇక్కడ నుంచున్నావే " పలకరించాడు శశాంక్ .

" బస్సు కోసం " అంది ఆ ప్రియ .

" నేను తీసుకెళతాను .ఎక్కడికి వెళ్ళాలో చెప్పు "

"పరవాలేదు ,నేను బస్సెక్కి వెళతాను " కొద్దిగా ఇబ్బంది పడుతూ చెప్పింది

వెంటనే శశాంక్ కారు లోంచి దూకి ,చొరవగా ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్ళి
కారు లో పడేసాడు . కారు కదిలింది .

"మరీ అంత భయపడుతున్నావే " అడిగాడు శశాంక్ .

"నా భర్తకు కోపం వస్తుంది " భయపడుతూ అంది ప్రియ.

"ఈ విషయం నీ మొగుడుకి ఎవరు చెబుతారు? "

"నా ప్రక్కన బస్ స్టాప్ లో ఎర్రగళ్ళ చొక్కా వేసుకొని,బుర్ర మీసాలతో నిలబడ్డాడే,

అతనే నాభర్త"

లేటు వయసులో

*
సుకన్య ,శ్రీనివాస్ తలమునకలయ్యేలా ప్రేమించుకొన్నారు.

పార్కులో వేరుశనగకాయలవాడు,వీళ్ళకు డిస్కౌంట్ ఆఫర్ తో
పాటు,మరో ఇద్దరు కుర్రాళ్ళను పనిలో పెట్టుకొన్నాడు
వీళ్ళకమ్మిన వాటి డబ్బులతో .

వీళ్ళ ప్రేమకు ఏ అడ్డంకులు రాలేదు,ముందే చూసుకొని

ప్రేమించటం వల్ల.ఒక్క విషయంలో తేడా వచ్చి విడిపోయారు.
అతనికి నటశేఖరుడు ఇష్టం.ఆమెకు రాజబాబు ఇష్టం.

వారికి పెళ్ళిళ్ళు అయినాయి.40 ఏళ్ళు గడిచాయి.ఈమధ్య కాలంలో
ఒకరినొకరు చూసుకొనే సందర్భం రాలేదు .

అనుకోకుండా ఒక రోజు ఒకరికొకరు ఎదురు పడ్డారు
ఉటీ రైల్వే స్టేషన్ లో

శ్రీనివాస్ : బాగున్నావా సుక్కు

సుకన్య : బాగున్నాను వాసు

శ్రీనివాస్ : ఇన్ని ఏళ్ల తరువాత నిన్ను చూసి మాటలు రావట్లేదు

సుకన్య : నాకు అంతే

మౌనం .........................

సుకన్య : వస్తాను , మా ఆయన అనుమానం గా చూస్తున్నాడు

శ్రీనివాస్ : సరే , మా ఆవిడ కూడా నన్ను అట్లాగే చూస్తోంది

రక్షణ

*
సతీష్, శంకర్ 4 వ తరగతి చదువుతున్నప్పటి నుండి స్నేహితులు .
సతీష్ స్లిప్పులు పెట్టి పరీక్షల్లో కాపీ కొడితే , శంకర్ సతీష్ ఆన్సర్ షీట్
తీసుకొని తన పేరు రాసుకోనేవాడు .దస్తూరి తేడా రాకుండా ఎన్నో నిద్రలేని
రాత్రులు ప్రాక్టీస్ చేసి ,అచ్చం సతీష్ లాగానే రాసేవాడు శంకర్.అలా వారి
స్నేహం మూడు స్లిప్పులు -ఆరు ఆన్సర్ షీట్లుగా సాగిపోతోంది .వోటర్
గుర్తింపు కార్డులో కనిపించే ఫోటో తమదో కాదో అని చూసుకోవాల్సిన
వయసొచ్చింది వారికి .

తన చదువును గట్టేక్కిస్తున్న సతీష్ అంటే అభిమానం వయసుతోపాటు
పెరిగి పెద్దదైంది శంకర్ లో . ఆ అభిమానం సతీష్ చెల్లెలు భవాని పట్ల
ప్రేమగా మారింది . ఏ సమస్యా లేకపోవటం తో తప్పనిసరై వాళ్ల పెళ్లి
చేసారు తల్లితండ్రులు .

భవాని , శంకర్ ల మొదటి పెళ్లి రోజుకు సరిగ్గా వారం తరువాత ,

సతీష్ : "ఏరా శంకు ! పెళ్లి కి ముందు వరకు భవానిని కంటికి రెప్ప
వేయకుండా కాపాడే వాడివి .నీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొనేవాడివి

ఇప్పుడేమయ్యింది నీకు ? "

శంకర్ : "ఆమెను అర్ధం చేసుకొని "ఆత్మ రక్షణ "లో పడ్డానంతే "

నేనే బెటరు

*
ఆనంద్ ఇండస్ట్రీస్ యం.డి.లక్ష్మీపతి వయసు మీద పడటంతో కొడుకు
అరవింద్ చేతికి పగ్గాలిచ్చి పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకొంటున్నాడు .

అరవింద్ ఊరికే కూర్చోకుండా , ఆడిటర్లను పెట్టి అన్ని లెక్కలను సరిచూడ
మన్నాడు . వారు తీసుకొన్న 5 లక్షలకు నిజాయతీగా పనిచేసి ,
గత మూడు ఏళ్లుగా 25 లక్షల రూపాయల నగదు దారి మళ్ళినట్లు
కనుగొన్నారు.ఆ దారి సీనియర్ మేనేజర్ కుమార్ చొక్కాజేబు దగ్గర ఆగింది .

"వెంటనే ఆ కుమార్ ను పిలవండి " అరిచాడు కోపంతో అరవింద్ .

తన ఎదురుగా తలవంచుకొని నిలుచున్న కుమార్ తో ,

"నువ్విలా చేస్తావనుకోలేదు "

"మౌనం "

" నిన్ను పూర్తిగా నమ్మాము "

"మౌనం "

"నీ తప్పు ఒప్పుకొంటున్నావా ? "

"అవును " పూడుకుపోయిన గొంతుతో బదులిచ్చాడు కుమార్

"నువ్వు మా దగ్గర 15 ఏళ్ళు పనిచేసావు కాబట్టి దయ తలచి పోలీస్
కంప్లైంట్ ఇవ్వటం లేదు . నిన్ను ఉద్యోగంలోంచి ఇప్పుడే పీకేస్తున్నాను "
చెప్పాడు అరవింద్ .

"సార్ ! నన్ను ఉద్యోగంలోంచి తొలగించే ముందు ఒక్కసారి ఆలోచించండి .
నేను చేసింది తప్పే .ఒప్పుకుంటున్నాను .కొట్టేసిన డబ్బుతో నేను మంచి ఇల్లు,
కారు కొనుక్కున్నాను .నాకు ఇంకా డబ్బుల అవసరం ఎక్కువ లేదు .
ఇల్లు కానీ , కారు కాని లేని కొత్త వాడిని తీసుకోవటమెందుకు ? "

కోయ జోస్యం

*
జయంత్ , లాలస హీరో ,హీరోయిన్లుగా "బంతాట " సినిమా షూటింగ్
అరకులోయలో చేస్తున్నాడు డైరెక్టర్ సోంబాబు .15 రోజులలో పూర్తి
చేయాలని కోరిక .

మొదటి రోజు షూటింగ్ గాప్ లో మేకప్ తుడుచుకొంటూ యూనిట్
సభ్యులతో ముచ్చట్లాడుతోంది లాలస ,

" మీకు తెలుసా ?, మొన్న సాధన కరక్ట్ టైములో తెలివిగా
ఆలోచించి రేప్ కాకుండా తప్పించుకోగల్గింది "

యూనిట్ సభ్యులు ఆసక్తిగా నోరు తెరిచారు " ఎలా ? " అంటూ.

"మొన్నఅర్ధరాత్రి షూటింగ్ నుండి ఒంటరిగా కారులో వెళుతుంటే తప్పతాగిన
కొందరు కుర్రాళ్ళు గుర్తుపట్టి ,కారాపి బయటకు లాగి మీద పడ్డారు .
ఆమె వెంటనే తెలివిగా మేకప్ తుడిచేసుకుంది .దాంతో ఆ కుర్రాళ్ళ మత్తు
పూర్తిగా దిగిపోయి క్షణాల్లో పరారయ్యారు "

ఇంతలో లాలసను చూడాలని వచ్చిన ఓ వీరాభిమాని మేకప్ లేని ఆమెను
చూసి అడవి దారి పట్టాడు ,అన్నల లాగా తుపాకి పట్టి మేకప్ మాన్ లు
లేని ప్రపంచాన్ని సృష్టించాలని కలలు కంటూ ,బాధతో ఏడుస్తూ .

తరువాత షూటింగ్ సాయంత్రం వరకు జరిగింది .పేకప్ టైముకు
ఓ కోయదొర సోంబాబు దగ్గరకెళ్ళి "రేపు పెద్ద వర్షం వస్తుంది జాగర్త "
అని చెప్పి వెళ్ళిపోయాడు .

అతను చెప్పినట్లే రెండోరోజు పెద్ద వర్షంపడి షూటింగ్ ఆగిపోయింది .

మూడోరోజు షూటింగ్ జరుగుతుంటే మళ్లీ కోయదొర వచ్చి
"రేపు పెద్ద గాలి తో వాన వస్తుంది " అన్నాడు .

మూడో రోజు అతను చెప్పింది నిజమై షూటింగ్ ఆపేయాల్సివచ్చింది.

దాంతో సోంబాబు కోయదొర పై గురి కుదిరి , వెతికి ,వెతికించి అతన్ని
తన దగ్గరకు గౌరవంగా రప్పించాడు .అన్ని సదుపాయాలు కల్పించాడు.


అతను చెప్పినదాని పట్టి , వాన పాటలు ,తుఫాను సీనులు ,
మామూలు షూటింగ్ ప్లాన్ చేసుకొని వారం రోజులు హాపీగా పూర్తి
చేసాడు .

అప్పుడు కోయదొర నడిగాడు " రేపు ఎట్టా ఉంటుంది ? "

కోయదొర మాట్లాడ లేదు .మళ్లీ అడిగాడు .సమాధానం లేదు .

మరోసారి గట్టిగా అడిగాడు .

"నాకు తెలీదు,నేను చెప్పలేను " గొణిగాడు కోయదొర.

"ఎందుకు ? " అరిచాడు సోంబాబు

" నా రేడియో పోయింది " అంటూ తప్పించుకుపోయాడు కోయదొర.

పాత వార్త

*
కుటుంబరావు భార్య పోరు పడలేక,ఆఫీసులో బాగా పని ఉన్నరోజు సెలవు పెట్టి
ఇంట్లో "శుభ్రత -పరిశుభ్రత " కార్యక్రమం చేపట్టాడు .

పైన గిన్నె పెట్టగానే ఆరిపోయే గ్యాస్ స్టౌవ్ బర్నర్లు రిపేర్ చేయించాడు .
పిల్లల స్కూల్ షూస్ లేసులు కొత్తవి కొన్నాడు.దసరాల్లో పట్టిన ఇంటి బూజు
దులిపాడు .ఇంకా ఎన్నో ఒళ్ళు వంచే పనులు చేసాడు .చివరిగా పాత న్యూస్
పేపర్లు వెనక పెట్టుకొని అటుఇటు -ఇటుఅటు వంచి స్కూటర్ స్టార్ట్ చేసి,
షాపుకు వెళ్ళాడు .

అంతలో పెద్ద గాలి .షాపు ముందు ఉన్న పాత పేపర్లు ఎగిరాయి .చూస్తున్న
కుటుంబరావు కళ్ళలో దుమ్ముతో పాటు ,ఓ పేపర్ లోని చిన్నన్యూస్ ఐటం
కూడా పడింది . ఆ పేపర్ ను చేతిలోకి తీసుకొన్నాడు అపురూపంగా.

కళ్లు మిలమిలా మెరిసాయి.ఆనందంగా వెలిగాయి.

గమనిస్తున్న షాపువాడికి ,కుటుంబరావు మొహంలో
కావాల్సింది దొరికిందన్న తృప్తి ,ఏదో చేయాలన్న ఆలోచన కనిపించాయి.

ఉబలాటం చంపుకోలేక ," ఆ పాతకాగితంలో మీకంత ఆనందం కలిగించే
వార్త ఏముంది సార్ ? " అని అడిగాడు .

రావు చదివాడు ఉత్సాహంగా

"జేబులో చేయి పెట్టినందుకు భార్యను హత్య చేసిన భర్త "

"దీంతో మీకేం ఉపయోగం ? " అయోమయంగా అడిగాడు షాపువాడు

"రోజూ దీన్ని జేబులో పెట్టుకుంటాను , లామినేషన్ చేయించి " ఆనందంగా
అరిచాడు కుటుంబరావు.

చివరి కోరిక

*
మల్టీ మిలియనీర్ కుబేర రావు తన చివరి రోజులు లెక్క పెట్టుకొంటున్నాడు.
తన లాయర్ని పిలిచి చెప్పాడు

"మీకు తెలుసు .నాకు సంతానం లేదని . మీరు విల్లు తయారు చేయండి "

"అదెంత సేపు పని .ఒక్క రోజులో పూర్తి చేస్తాను "

"ఎవరి పేరో తెలుసా ? "

" మీ ఆవిడ గారి పేరునేగా ? "

"అవును ,నా వ్యాపారం ,ఇళ్ళు ,కార్లు , షేర్లు ,నా ఇతర ఆస్తులన్నీ , మా
ఆవిడకే దక్కేటట్లు జాగర్తగా విల్లు ప్రిపేర్ చేయండి "

మరుసటి రోజు విల్లు కాగితాలతో వచ్చిన లాయర్ తో

"దానిలో ఒక మాట కలుపు .నేను మరణించిన ౩ నెలల లోపు నా భార్య

మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే ఈ విల్లు చెల్లుబాటు అవుతుంది అని "

"మీ షరతు చాలా విచిత్రంగా ఉంది "

"నేను చచ్చానని బాధ పడేవాడు ఒక్కడైనా ఉండాలని నా చివరి కోరిక "

నా కోరిక తీర్చొద్దు

*

కార్తీక్ , రమణి లకు కొత్తగా పెళ్లి అయ్యింది .ఇద్దరు కలిసి గడిపే సమయం

తక్కువ కావటం వల్ల కాపురం అన్న్యోన్యంగా సాగుతోంది .కార్తీక్ లేచేసరికి

రమణి మార్నింగ్ షిప్ట్ కు వెళ్ళిపోతుంది.ఆమె తిరిగొచ్చే టైముకు నైట్ షిప్ట్ లో

ఉంటాడు కార్తీక్ .వాళ్ల కాపురం చూసి ఆనందిద్దామని ,రమణి అత్తగారోచ్చి

ఓ నెలరోజులుండి వెళ్ళింది .తనూ ఏం తక్కువ కాదు కాబట్టి ,కార్తీక్ అత్తగారు

వచ్చి ఓ రెండు నెలలు గడిపింది .

వాళ్లు అటు వెళ్ళగానే వీళ్ళిద్దరి మధ్య కలతలు మొదలైనాయి .కలహంగా

మారాయి .మాటలు ఆగాయి .కక్షలు పెరిగాయి .

కార్తీక్ దేవుని ప్రార్ధించాడు :

"ఈ క్షోభ నేను భరించ లేను . నన్ను తీసికెళ్ళిపో "

అది విన్న రమణి , దేవుని ఇలా కోరింది :

"అతన్ని తీసుకెళ్ళటానికి ముందే ,నన్ను అతనికి దూరం చేయి "

వెంటనే కార్తీక్ దేవునితో అన్నాడు :

"ఆమె కోరిక తీర్చు చాలు .నా కోరిక తీర్చొద్దు "

రాజుకు మూడు వరాలు

*
బలాదూర్ ,బేవార్స్ ,అచ్చోసిన ఆంబోతు ,జల్సా రాయుడు లాంటి
పదాలు రాజు ముందు దిగదుడుపే .కన్నతల్లి పోపు సామాన్ల డబ్బాలో
దాచిన చివరి పావలా వాడేశాడు .ఆఖరికి పోపు డబ్బా కూడా అమ్మేసి
పండగ చేసుకొన్నాడు .

తన బాధ పంచుకోవటానికి, బాగు పడతాడన్న ఆశతో ఓ పిల్లను తెచ్చి
అతని చేతిలో పెట్టింది తల్లి .

అయినా రాజు బాగుపడే రోజు పొలిమేర దాకా కూడా రాలేదు.

అనుకోకుండా ఒక రోజు ,

ఎప్పటిలాగే తప్పతాగి సీసా విసిరికొట్టాడు రాజు. అది వెళ్లి తుప్పల్లోని
మరో సీసాకు తగిలింది .

మరో సీసా పగిలింది .


ఓ మంచి భూతం బయటకు వచ్చి మూడు వరాలిస్తా, కోరుకోమంది.

రాజు మొదటి కోరిక కోరాడు "నేను ప్రపంచం లోనే గొప్ప అందగాడిని కావాలి "

భూతం చెప్పింది "సరే ,కాని ఒక షరతు ఉంది .నీకేం లభిస్తే దానికి 20 రెట్లు
మీఆవిడకు లభిస్తుంది.ఈ నీ కోరిక తీరిస్తే మీఆవిడ ప్రపంచసుందరి అవుతుంది
ఇబ్బంది పడతావు ,ఆలోచించుకో "

"పర్లేదు భూతం ,ప్రపంచంలో నేనే గొప్ప అందగాడిని కాబట్టి , ఆమె నాతోనే
ఉంటుంది .నన్ను అందగాడిని చేసేయి "

"తధాస్తు " ,

రాజు గొప్ప అందగాడుగా మారిపోయాడు .రెండో వరం అడిగాడు

"నేను లోకంలోని అందరికంటే గొప్ప ధనవంతుడిని కావాలి "

"మీఆవిడ నీకంటే ధనవంతురాలు అవుతుంది .చూసుకో "


"పర్లేదు ,నేనంటే దానికి పిచ్చి ప్రేమ, నేనడిగితే ఎంతడబ్బైనా వణుకుతూ
తెచ్చిస్తుంది. వరం ఇచ్చుకో "

"అట్లే అగుగాక "

రాజు లోకంలోని ధనవంతుల లిస్టు లో (భార్య తో కలిసి ) ఫస్ట్ వచ్చాడు .

మూడోవరం అడగమంది భూతం .

రాజు అడిగాడు :

"నాకు గుండెపోటు వచ్చేట్టు చెయ్యి "

మోడరన్ ఆర్ట్

*
కిరణ్ ,కల్పనలకు కొత్తగా పెళ్లైయింది. కల్పనకు కళలన్నా,
కళా ఖండాలన్నా చాలా ఇష్టం .ఓ సాయంత్రం షికారుకు ,సరదాగా రోడ్డున
పడ్డారు . ఐదునిమిషాల తరువాత కల్పన అడిగింది కిరణ్ ను గోముగా

"కిరణ్ !నువ్వు డిసైడ్ చెయ్యి .మనం " మనువాడని మొగుడు " సినిమాకు
వెళదామా ? ,మోడరన్ ఆర్ట్ ఎక్సిబిషన్ కు వెళదామా ? "

ఆమె కు ఇష్టమైన సినిమా ల సంగతి తెలిసిన వాడై , ఈ సారి
ఆర్ట్ ఎక్సిబిషన్ లోకి అడుగు వేసాడు కిరణ్ .

కల్పన గుమ్మం లోకి అడుగు పెడుతూనే ప్రశ్నించింది ,

"ఈ పెయింటింగ్ను ఇలా గుమ్మం పైన వెళ్ళాడ వేసారేమిటి కిరణ్ ,విచిత్రంగా? "

" బహుశా దాన్ని వేసిన వాడు దొరికుండడు " గొణిగాడు కిరణ్ .

లోపల పేయింటింగ్ లు తన్మయంగా చూస్తూ కల్పన , ఆమె వెనుక
ఆమెను , పెయింటింగ్ ను మార్చి మార్చి చూస్తూ కిరణ్ .

అలా ఓ గంట గడిచింది .

కల్పనకు ఓ పెయింటింగ్ విపరీతంగా నచ్చి కొనేసింది . ఆ ఆర్ట్ ను వేసిన
కుంచె సుందరరావు ఆమె తో చెప్పాడు ఆనందంగా

"మీరు మంచి చిత్రం ఎన్ను"కొన్నారు " .దీనికోసం నేను 10 ఏళ్ళు
కష్ట పడ్డాను "

"మీకు ఈ చిత్రం గీయటానికి పది సంవత్సరాలు పట్టిందా ? " అడిగింది
కల్పన .

" లేదు , ఒక్క రోజులోనే గీసాను .అమ్మటానికే పది సంవత్సరాలు పట్టింది "
అన్నాడు కుం.సుం.

కిరణ్ పై దయ కలిగి చూడటం ముగించి బయలుదేరింది .గుమ్మం ముందర
విజిటర్స్ బుక్ లో తమ అభిప్రాయాలు రాయవలసింది గా కోరాడు గార్డ్ .

కిరణ్ ఇలా రాసాడు :

పేరు : కిరణ్

పెయింటింగ్ లపై మీ అభిప్రాయం : అయోమయం

మీ రాకకు కారణం :
బయట భోరున వర్షం

మతిమరుపు రోగం

*
రాము,సోము తమ వీధిలో ఓ పెద్దాయన చనిపోతే పలకరించటానికి వెళ్ళారు .

రాము :90 ఏళ్ల తాతారావు గారు గుండ్రాయిలా ఉండేవారు.ఆ వయసులో
షేర్ వ్యాపారం చేసేవారు .సందు చివరి మిర్చి బండి దగ్గర బజ్జీలు రోజూ
తినే వారు .పేకాట ఆడేవారు .హటాత్తుగా ఎలా పోయారు ?

సోము : పెద్దాయనకు 2 నెలల క్రితం వరకు అంతా బానే ఉంది .ఉన్నట్టుండి

మతిమరుపు రోగం పట్టుకుంది . నిన్న రాత్రి కూడా చాలా సేపు మూడో పెట్టె
సిజర్స్ సిగరెట్లు తాగుతూ పేకాట ఆడాడు .నిద్రలో గాలి పీల్చటం మరచి
"పోయాడు ".

తప్పిపోయిన పిల్లి

*
సాయంత్రం ఆరు గంటలు .రంపచోడవరం పోలీస్ స్టేషన్ హడావిడిగా ఉంది .
ఇంతలో ఫోను మోగింది.S.I. వెంటనే ఫోన్ తీసి చెవిలో పెట్టుకొని

"హలో ! చెప్పండి సార్ " అన్నాడు .

"నా పేరు అంజయ్యండి. మా పిల్లి నిన్న తప్పిపోయిందండి .మీరు దయతో
వెతికి పెట్టాలండి "

" మేము చాలా బిజీగా ఉన్నాము. మీరే వెతుక్కోండి "

"మా పిల్లి మాములు పిల్లి కాదండి .మనిషంత తెలివైనదండి "

"అయినా కుదరదయ్యా.మేము ఆకు రౌడీ అప్పారావు కుక్క పిల్ల కిడ్నాప్
కేసులో బిజీగా ఉన్నాము .నువ్వే వెతుక్కో "


" సార్ ,సార్ దయుంచి వెతికి పెట్టండి .అది తెలివైనదే కాదు .మనలా
మాట్లాడ గలదు కూడా "

"ముందు నోర్ముసుకొని ఫోను పెట్టేయి .నీ మాట్లాడే పిల్లి ఎక్కడ నుండైనా
నీకు ఫోను చెయ్యొచ్చు "

పుస్తకమైనా

*
ఆరేళ్ల క్రితం సరస్వతి పెళ్లి చదువుల రావు తో జరిగింది . అతనొక పుస్తకాల
పురుగు .మిర్చి బజ్జీలు ,పుణుకుల కంటే ,వాటిని కట్టిన కాగితాన్ని ఎక్కువ
ఆస్వాదిస్తాడు .

బాధ భరించలేక సరస్వతి విసుగ్గా

"నేను పుస్తకాన్నైనా బాగుండేది.కనీసం అప్పుడైనా ఎప్పుడూ నన్ను చదువుతూ
ఉండేవారు " అంది .

"నాకైతే నువ్వు కాలండర్ అయితే బాగుంటుందనిపిస్తోంది .ప్రతి సంవత్సరం
కొత్త కాలండర్ చదువుకోవచ్చు " పుస్తకంలోంచి తొంగి చూస్తూ అన్నాడు
చదువుల రావు .

తాగుడు

*
రాంబాబు కు ఏదో తెలియని మాయదారి రోగం పట్టుకుంది .

తన వూళ్ళో ఉన్న అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రి గోవింద నారాయణ
హాస్పటల్స్ లో చేరాడు .అన్ని పరీక్షలు చేసారు .పెద్ద డాక్టర్ గారు
రిపోర్టులు అన్నీ పరిశీలించి

"రాంబాబు ! రిపోర్టులు అన్నీ చూసాను .అయినా నీ అనారోగ్యానికి

కారణం నాకు అంతుబట్టలేదు.బహుశా తాగుడు కారణమై ఉండవచ్చు"

డాక్టర్ వంక పరిశీలనగా చూస్తూ ,

"డాక్టర్ గారు ! ఈ మాయదారి రోగం తో బాధపడలేకుండా ఉన్నానండి.
మీరు మాములుగా తాగకుండా ఉన్నపుడు చూసి చెప్పండి "
అన్నాడు రాంబాబు .


పరుగో పరుగు

*
కాకులు దూరని కారడవి,చీమలు దూరని చిట్టడవి.మూలికల వెతుకులాట లో
అందులోకి ప్రవేశించారు ఒక సైంటిస్ట్ , ఒక స్వామీజీ .మూలిక అనుకోని
ఒక తీగను పట్టుకొని పరీక్షించసాగారు .దాంతో ఆ తీగకు చివర పొదలో
పడుకొనివున్న పులికి మెలుకువ వచ్చింది .చాలా రోజులకు నరమాంసం
దొరికిందని ఆనందిస్తూ ,వాళ్ల వెనుక పడింది .

పరుగు మొదలైయ్యింది. పరుగెడుతూనే సైంటిస్ట్ లెక్కలు వేసి, స్వామి తో
"స్వామీజీ !మనం పరుగెత్తి లాభం లేదు .పులి వేగం ఎక్కువ .మనం దానికి
ఆహారమవటం ఖాయం " అన్నాడు .

అది విని స్వామీజీ "ఆ విషయం నాకూ తెలుసు .నా ప్రయత్నమంతా
నిన్ను దాటి ముందుకు వెళ్ళాలనే "

S.M.S.

*
రఘు, రాము S.M.S. ఉపయోగాల గురించి మాట్లాడుకుంటున్నారు .

రఘు :"S.M.S.ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి .S.M.S.ల వల్ల
దేశం లోని కష్టాలు తీరుతాయి .S.M.S. అనుకుంటే కిలో బియ్యం
10 రూపాయలకే ఇవ్వచ్చు .పెట్రోల్ లీటరు ౩౦ రూపాయలకే
రావచ్చు. ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి "

రాము :"S.M.S. తో ధరలు తగ్గుతాయా?,మెదడుండే మాట్లాడు తున్నావా?"

రఘు : "నీకే కాదు , నాకూఉంది బుర్ర . S.M.S. అంటే
సోనియా & మన్మోహన్ సింగ్ "

పెద్ద నాణెం

*
రామాలయం లో దైవదర్శనం చేసుకొని బయటకు వచ్చాడు కృష్ణమూర్తి.

మండపం హడావిడిగా ఉంది.విషయం తెలుసుకుందామని అక్కడకు వెళ్ళాడు.
అక్కడ ఓ నాలుగేళ్ళ పిల్లవాడు ,అతనికెదురు గా ఐదు రుపాయల నాణెం ,

అర్ధరూపాయి నాణెం ఉన్నాయి.చుట్టూ ఉన్న గుంపు లోనుండీ ఒక వ్యక్తి
అడిగాడు

"నీకే నాణెం కావాలిరా పిల్లోడా ? "

"నాకు ఎక్కువ డబ్బులు కావాలి" అంటూ అర్ధ రుపాయి బిళ్ళ తీసి జేబూలో
వేసుకున్నాడు బాలుడు.ఆ రెండు నాణాలు అక్కడ పెట్టిన పెద్ద మనిషి ఐదు
రూపాయల నాణెం తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.ఈ వినోదం అలాగే
సాగింది . కృష్ణమూర్తి చూస్తూనే ఉండిపోయాడు.జనం వెళ్ళిపోయాక పిల్లవానికి
ఙానోపదేశం మొదలు పెట్టాడు

"బాబూ ! నువ్వు తీసుకొన్న అర్ధ రూపాయి కంటే ఐదు రూపాయిలు
నాణానికి విలువెక్కువ.ఈసారి ఐదు నాణెం పెద్దదని చెప్పు బాబు "

"ఐదు నాణెం పెద్దదని నేను చెబితే నాకు అర్ధ రూపాయి ఎవరు వదిలి
వెళ్ళిపోతారు ?.నా అమాయకపు నటన వల్ల అర్ధరూపాయి దక్కుతోంది.
దయచేసి ఈ విషయం ఎవరితో అనకండి"అంటూ తుర్రుమన్నాడు పిల్లవాడు

స్వర్గానికి నిచ్చెన

*
అల్లంత దూరం లో స్వర్గం. స్వర్గారోహణానికి దేవదూతలు ఓ మాయా

నిచ్చెనను ఏర్పాటు చేసారు.స్వర్గానికి అర్హత ఉన్నఅందరికి దేవదూతలు

ఓ నాముసుద్ద ముక్క ఇచ్చి చెప్పారు ,


"మీరందరు మీరు చేసిన ఒక్కొక్క తప్పును ఒప్పుకుంటూ, మీ చేతి లోని

సుద్దముక్క తో నిచ్చెన పై తప్పుకో మెట్టుపై గీత గీస్తే ఆ మెట్లు మాయమై

తొందరగా స్వర్గం చేరుకొంటారు "

అందరు సుద్దముక్క తో గీతలు పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు

ఇంతలో పై నుండి ఓ స్వరం నెమ్మదిగా దగ్గరవుతూ వినిపించసాగింది

"నాయనలారా ! కొద్దిగా దారి ఇవ్వండి , కొద్దిగా దారి ఇవ్వండి " ఓ

స్వామీజీ వడివడిగా అడుగులేసుకొంటూ క్రిందకు వస్తున్నారు.ఆయన్ను

ప్రపంచమంతా ఆరాధించే స్వామీ పవిత్రానందగా గుర్తించారు అక్కడివారు

ఆయనను ఒక వ్యక్తి వినయంగా అడిగాడు

"స్వామీజీ !మాకోసం మీరు క్రిందకి దిగివస్తున్నారా ?"

స్వామీజి ఆదుర్దాగా "మరో రెండు సుద్ద ముక్కలు కావాలి.అవి

అయిపోతాయేమోనని భయంగా ఉంది.తొందరగా దారి ఇవ్వు నాయనా"

అంటూ ముందుకురికారు


మతిమరుపు

*
ఇటు గోడ పక్కన గుర్నాధం , అటు వైపు సోమలింగం :

"మా ఆవిడ మతిమరుపు వల్ల ఇవాళ నాకో మేలు జరిగింది " సంబరంగా
చెప్పాడు గుర్నాధం .

"ఎలా ? " బోల్డు ఆశ్ఛర్యపోతూ అడిగాడు సోమలింగం

"వంటంతా తనే చేసి , అంట్ల గిన్నెలు కూడా తోమేసింది "

అలవాటు

*
"రఘూ ! మీ మామగారు చనిపోతూ,తన కోట్ల ఆస్తి ,అన్ని వ్యసనాలు

వదిలేస్తే, నీకు దక్కుతుందని వీలునామా రాసారు కదా .అందుకైనా నీ
దురలవాట్లు మానేయచ్చు కదా ? "

"ఒరేయ్ పిచ్చోడా ! అన్నీ వదిలేస్తే నాకు డబ్బుతో పనేముంటుంది ? "

ఎవరిని

*
"నా లవర్ శ్రీజ పెళ్లి ప్రపోజల్ పెట్టింది.తొందరలోనే పెళ్లి "బాధగా చెప్పాడు

అరవింద్ .

" బాధ దేనికి ? " అడిగాడు రవి .

"మరి నేను ఇంకెవరిని ప్రేమించాలి ? "

పెళ్లి జోస్యం

*
చిరకాల ప్రేమతో , నడి వయసుకొచ్చిన ప్రేమ జంట సంభాషణ :

"మనకు తొందరలో పెళ్లి జరుగుతుందని అనిపిస్తోంది "

"ఎలా చెప్పగలుగుతున్నావు ? " ఆనందంగా అడిగిందామె .

"జ్యోతిష్యుడు తొందరలో నాకు కష్ట కాలం మొదలవుతోందని చెప్పాడు "

తగ్గిన బరువు

*
బరువు తగ్గటం కోసం లంబోదరరావు ,రెండు నెలలుగా
గుర్రపుస్వారీ చేస్తున్నాడు.

"ఏమైనా బరువు తగ్గావా ? " అడిగాడు మిత్రుడు .

"ఓ పది కేజీలు , నా గుర్రం బరువు తగ్గింది "

బా.సు.

*
ఓ బాపు సుందరి పొడుగాటి జడతో సిటీ బస్ ఎక్కింది .ఆ వెనకే చిన్ని పాప
షాలిని కూడా ఎక్కింది. ఇద్దరికి సీట్ దొరకలేదు .

షాలిని బా.సు.(బాపు సుందరి ) జడను రెండు చేతులతో గాట్టిగా పట్టుకొని
పడకుండా నిలబడింది .

నెప్పి పుట్టిన బా.సు. "ఏయ్ ! జడపై చేతులు తీయ్ " అంది .

"వచ్చే స్టాప్ లో దిగిపోతావా అక్కా ? " అమాయకంగా అడిగింది షాలిని

కుక్క కరవలేదుగా ?

*
సీత గీత తో ,

"నిన్న వంట చేస్తుంటే వీధి కుక్కొకటి మీద కొచ్చింది "

"మీ ఆయన్నేమీ కరవలేదుగా ? "

బఠానీలు

*
పార్క్ లో ,

"గోపీ ! రోజూ బఠానీలు తినేవాడివి ,ఈ రోజు వద్దన్నావే ? " అడిగింది రాధ .

" పళ్ళ సెట్ ఇంట్లో మర్చిపోయాను "

నేను సూపర్

*
రమణ రఘు తో

"ఎవరి వంకా కన్నెత్తి చూడని రజని నాకు కన్ను కొట్టిందంటే ,
నేను సూపర్ అనే కదా ? "

"కాదు ,ఆమెకు తన అందం మీద నమ్మకం పోయిందని అర్ధం "

మూడు ముళ్ళు

*
సరోజ శాంతితో ,

"ఆ కుర్ర లాయర్ కు పెళ్లి చేసుకోవాలని మహా ఉబలాటంగా ఉన్నట్టుంది "

"నువ్వెలా కనిపెట్టావు ? "

"ప్రతి ఫైల్ కు మూడు ముళ్ళు వేస్తున్నాడు "

సినిమా ఎలా ఉంది ?

*
"మొన్న ఆదివారం వినాయకుడు సినిమాకు వెళదామని నేను ,
చింతకాయల రవి కి వెళదామని మాఆవిడ గొడవ పడ్డాము ."

"ఇంతకు చింతకాయల రవి ఎలా ఉంది " మధ్యలో మాట అందుకుంటూ
అడిగాడు మిత్రుడు .

చట్టం

*
ఓ కుర్రకుంక తన లాయర్ మామయ్యను ,

"మామయ్యా ! మనం ఒక్క పెళ్లి కంటే ఎక్కువ ఎందుకు చేసుకోకూడదు ? "

"మనని మనం కాపాడుకోలేనప్పుడు ,చట్టం మనల్ని కాపాడాలి కాబట్టి "
రహస్యం విప్పాడు లాయర్ మావయ్య .

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు