*
బలాదూర్ ,బేవార్స్ ,అచ్చోసిన ఆంబోతు ,జల్సా రాయుడు లాంటి
పదాలు రాజు ముందు దిగదుడుపే .కన్నతల్లి పోపు సామాన్ల డబ్బాలో
దాచిన చివరి పావలా వాడేశాడు .ఆఖరికి పోపు డబ్బా కూడా అమ్మేసి
పండగ చేసుకొన్నాడు .
తన బాధ పంచుకోవటానికి, బాగు పడతాడన్న ఆశతో ఓ పిల్లను తెచ్చి
అతని చేతిలో పెట్టింది తల్లి .
అయినా రాజు బాగుపడే రోజు పొలిమేర దాకా కూడా రాలేదు.
అనుకోకుండా ఒక రోజు ,
ఎప్పటిలాగే తప్పతాగి సీసా విసిరికొట్టాడు రాజు. అది వెళ్లి తుప్పల్లోని
మరో సీసాకు తగిలింది .
మరో సీసా పగిలింది .
ఓ మంచి భూతం బయటకు వచ్చి మూడు వరాలిస్తా, కోరుకోమంది.
రాజు మొదటి కోరిక కోరాడు "నేను ప్రపంచం లోనే గొప్ప అందగాడిని కావాలి "
భూతం చెప్పింది "సరే ,కాని ఒక షరతు ఉంది .నీకేం లభిస్తే దానికి 20 రెట్లు
మీఆవిడకు లభిస్తుంది.ఈ నీ కోరిక తీరిస్తే మీఆవిడ ప్రపంచసుందరి అవుతుంది
ఇబ్బంది పడతావు ,ఆలోచించుకో "
"పర్లేదు భూతం ,ప్రపంచంలో నేనే గొప్ప అందగాడిని కాబట్టి , ఆమె నాతోనే
ఉంటుంది .నన్ను అందగాడిని చేసేయి "
"తధాస్తు " ,
రాజు గొప్ప అందగాడుగా మారిపోయాడు .రెండో వరం అడిగాడు
"నేను లోకంలోని అందరికంటే గొప్ప ధనవంతుడిని కావాలి "
"మీఆవిడ నీకంటే ధనవంతురాలు అవుతుంది .చూసుకో "
"పర్లేదు ,నేనంటే దానికి పిచ్చి ప్రేమ, నేనడిగితే ఎంతడబ్బైనా వణుకుతూ
తెచ్చిస్తుంది. వరం ఇచ్చుకో "
"అట్లే అగుగాక "
రాజు లోకంలోని ధనవంతుల లిస్టు లో (భార్య తో కలిసి ) ఫస్ట్ వచ్చాడు .
మూడోవరం అడగమంది భూతం .
రాజు అడిగాడు :
"నాకు గుండెపోటు వచ్చేట్టు చెయ్యి "